గజ్వేల్, జనవరి 17: ట్రిపుల్ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు) అలైన్మెంట్ మార్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధితులకు ఇచ్చిన మాటను తప్పారని, ప్రభుత్వం ట్రిపుల్ఆర్ బాధితులను మోసం చేస్తున్నదని గజ్వేల్ డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన బాధితులు మండిపడ్డారు. శుక్రవారం ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగ్‌రోడ్డు) బాధితులు ఆర్డీవో చంద్రకళను కలిసిన తర్వాత కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. బాధితులతో మాట్లాడుతామని చెప్పిన అధికారులు, కార్యాలయానికి వచ్చిన తర్వాత పరిహారంపై ఎలాం టి స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులు మాట్లాడుతూ.. ట్రిపుల్ఆర్ బాధితులంతా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిస్తే తప్పకుండా అలైన్మెంట్ మార్చుతామని చెప్పి, నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంతో సీఎం రేవంత్ కూడా మాట తప్పారన్నారు.
సావడానికైనా సిద్ధమే కానీ, సాగు భూములు మాత్రం ట్రిపుల్ఆర్కు ఇవ్వబోమంటున్నారు. శవాలపై రోడ్డు వేసుకోండి. కానీ, తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. రాత్రి సమయంలో 60 నుంచి 70 మంది అధికారులు, పోలీసులతో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఎంతకైనా తెగిస్తామన్నారు. గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పీర్లపల్లి నుంచి బేగంపేట వరకు ఎకరాకు రూ.2కోట్లు పలుకుతుందని, ప్రభుత్వం ఎకరాకు మూడింతల పరిహారం, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ట్రిపుల్ఆర్ను 60 కిలోమీటర్ల వరకైనా పొడగించి అలైన్మెంట్ మార్చాలన్నారు. లేదంటే సంగారెడ్డి నుంచి భువనగిరి మీదుగా జాతీయ రాహదారి మార్గంలోనే వేయాలన్నారు. ధర్నా లో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.