కొమురవెల్లి, మార్చి 6: తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు నేడు (మంగళవారం) హోలీ పండుగ జరుపుకొంటారు. భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్‌లో ఈ పండుగను వైభవంగా చేసుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనదని అర్థం.
హోలీ రంగులు వదిలించుకుందాం ఇలా..
హోలీ రంగులను వలించుకోవడం ఎలా? హోలీ పండుగ రోజు అందరికీ ఉండే భయమిది. దాంతో హోలీ వేడుకలను తటపటాయిస్తూ జరుపుకొంటారు. అయితే చర్మానికి, దుస్తులకు అంటుకునే హోలీ రంగులను సులువుగా వదిలించుకునే వీలుంది. అదెలాగో తెలుసుకుందామా.
దుస్తుల నుంచి..
బ్లీచ్: రంగులు అంటుకున్న దుస్తులను నాన్ క్లోరి న్ బ్లీచ్ కలిపిన నీళ్లలో గంటపాటు నానబెట్టాలి. తర్వాత సబ్బురుద్ది శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి.
వైట్ వెనిగర్ : రెండు నుంచి మూడు లీటర్ల నీటిలో ఒక టీ స్పూన్ ఏరియల్, అర కప్పు వైట్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఆ నీళ్లలో దుస్తులు గంట పాటు నానబెట్టి ఉతికి ఆరేయాలి.
నిమ్మరసం: నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ రంగులను వదిలిస్తుంది. రంగు అంటిన కాడ దుస్తులను నిమ్మరసంలో ముంచి చేతులతో రుద్ది రంగును వదిలించి నీళ్లతో శుభ్రం చేసి ఆరబెట్టాలి.
ఆల్కహాల్: నీళ్లు కలపని ఆల్కహాల్‌ను నేరుగా మరక మీద ఒంపి చేతులతో రుద్ది రంగును వదిలించాలి. చల్లనీటి దార కింద దుస్తులు ఉంచి శుభ్రం చేసి ఆరబెట్టాలి.
మరికొన్ని చిట్కాలు..
రంగు అంటిన వెంటనే వీలైనంత త్వరగా దుస్తులను శుభ్రం చేయాలి. ఆలస్యమయ్యే కొద్దీ రంగు దుస్తుల్లో ఇంకిపోతూ ఉంటుంది.
రంగు అంటుకున్న దుస్తులను తడిపి వదిలేయకూడదు. తడి ఆరనివ్వకూడదు. రంగులు అంటుకున్న వాటిని వదిలించే పనికి పూనుకోవాలి.
రంగు అంటుకున్న దుస్తులను ఇతర దుస్తులతో కలిపి ఉతకకూడదు. ఇలా చేస్తే అన్ని దుస్తులకూ రంగులు అంటుకుంటాయి. దుస్తులకు అంటుకున్న రంగులను వదలించడానికి క్లోరిన్ కలిసిన బ్లీచ్‌ను ఉపయోగించకూడదు. ఈ బ్లీచ్‌తో దుస్తుల రంగుల వెలిసిపోతాయి.
చర్మం నుంచి..
కొబ్బెరినూనె: రంగులు అంటుకున్న ముఖాన్ని కడిగేముందు కొబ్బరినూనె పూసుకోవాలి. తర్వాత చేతులతో బాగా రుద్దితే రంగులు కరిగి కొబ్బరినూనెలో కలుస్తాయి. ఆ తర్వాత సబ్బుతో రుద్ది కడిగేసుకుంటే రంగులు తేలికగా వదులుతాయి.
గోధుమపిండి: గోధుమపిండికి వంట నూనె చేర్చి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పెస్ట్‌ను ముఖానికి పట్టించి కొద్ది నిమిషాల తర్వాత మసాజ్ చేయాలి. తర్వాత సబ్బుతో కడిగేసుకోవాలి.
ముల్తానీ మట్టి: దీంతో ఫేస్ ఫ్యాక్ వేసుకొని పొడిగా మారిన తర్వాత రుద్ది కడిగేయాలి. ముల్తానీ మట్టితో పాటు రంగులు కూడా వదిలిపోతాయి.
ఆమ్చూర్ : మామిడి పొడికి నీళ్లు కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత రుద్ది కడిగేసుకోవాలి. గోళ్లకు అంటుకున్న రంగులను వదిలించుకోవడం కోసం నిమ్మరసంలో కొన్ని నిమిషాలు నానబెట్టి శు భ్రం చేసుకోవాలి. రంగులు అంటిన గోళ్లకు ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలీష్ ఐప్లె చేసి కొన్ని చుక్కల బాదం నూనె కలిపిన గోరువెచ్చని నీళ్లలో గోళ్లను మునిగేలా పది నిమిషాల పాటు ఉంచాలి. గోళ్ల కు అంటుకున్న రంగులు నెమ్మదిగా కరిగి నీళ్ల లో కలుస్తాయి. హోలీ ఆడబోయే ముం దు గోళ్లకు ముదురు రంగు వేసుకోవాలి. ముదురు రంగు నెయి ల్ పాలీష్ రంగులు గోళ్లలో ఇంకిపోకుం డా అడ్డుకుంటాయి.
ముందస్తు హోలీ సంబురాలు
చేర్యాల, మార్చి 6: పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో సోమవారం ఐకేపీ మండల వీవోఏలు ముందస్తుగా హోలీ వేడుకలు నిర్వహించారు. ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీవోఏల సంఘం ప్రతినిధులు ఈరు చంద్రం, మల్లీశ్వరి, జ్యోతి, నర్సింహులు, రమ, నవీత, కవిత, లక్ష్మి, తేజ,
పరశురాములు, యాకమ్మ, సూర్యకళ, సుజాత పాల్గొన్నారు.
శాస్త్రీయంగా…
వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వలన ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందని ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం మోదుగ పూలను రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారే వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అటువంటి సహజ రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుంది. ప్రవాస భారతీయులు ఉంటున్న చాలా పాంతాల్లో ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఐరోపా, దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో హోలీ పండుగను ఘనంగా జరుపుకొంటారు. కారణాలు ఏమైనా రంగుల పండుగ హోలీ అంటే అందరికీ ఉత్సాహం ఉంటుంది.
చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు, బంధువులతో ఆనందంగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకొంటారు.
సహజ రంగులతో ఆరోగ్యం పదిలం
మెదక్ రూరల్/కోహీర్, మార్చి 6 : చిన్నా పెద్ద తేడాలేకుండా రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకొనే వేడుక హోలీ. ఈ పండుగలో రసాయన రంగులు వాడి అనారోగ్యం బారిన పడేకంటే సహజ రంగులు వినియోగించి సంతోషంగా జరుపుకోవాలని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. ఎర్రమందారం, టమాటో, క్యారెట్‌తో ఎరుపు రంగును తయారు చేసుకోవచ్చు. ఈ రంగులు ఒంటి మీద పడినా పొరపాటున కంట్లో, నోట్లోకి వెళ్లినా పెద్దగా ప్రమాదం ఉండదు. గోరింటాకుతో ఆకుపచ్చని రంగు,బీట్రూట్తో గులాబీరంగు, పసుపు కొమ్ములను దంచి నీళ్లలో నానబెట్టి పసుపు వర్ణాన్ని తయారు చేసుకోవచ్చు. మోదుగు పూలను నీటిలో నానబెడితే వచ్చే ఆరెంజ్ రంగు.. ఇలా ఎన్నో సహజసిద్ధ రంగులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
రసాయనాలతో జాగ్రత్త
రసాయన రంగులు వినియోగిస్తే చర్మవాధులు వచ్చే అవకాశాలుంటాయి. గ్రీసు, ఆయిల్ వంటివి ఒంటిపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకుండా చూసుకోవాలి. ఇలాంటి రంగులతో రియాక్షన్ అయి చర్మ సమస్యలు వస్తాయి. రంగులు కండ్లల్లో పడితే నలపడం, రుద్దడం చేయకూడదు. చల్లని నీటితో శుభ్రం చేసి ప్రాథమిక చికిత్స అనంతరం అవసరమైతే నేత్ర వైద్యుడిని సంప్రదించాలి.
– డాక్టర్ సురేశ్, మెదక్
చెడుపై మంచి విజయం
ప్రతిఏడాది ఫాల్గుణ మాసంలో హోలీ జరుపుకొంటారు. ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి మార్చి7న సాయంత్రం ముగుస్తుంది. మన్మథుడి మన్మథబాణంతో తపోభంగం చెందిన శంకరుడు మూడో నేత్రం తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు, దీనినే ప్రజలు కాముడిదహనంగా జరుపుకొంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ గ్రామాల్లో పిడకలు ,కట్టెలు పేర్చి కాముడిని దహనం చేస్తారు. మరుసాటి రోజు హోలీ జరుపుకొంటారు.
– వైద్యశ్రీనివాస్, వేదపండితుడు,మెదక్