ఉమ్మడి కుటుంబం.. ప్రస్తుతం అరుదుగా వినిపిస్తున్న పదం. సమాజంలో కంటే సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువ కాలం గడిపే ఈ రోజుల్లో.. ఇరవై మందికి పైగా కలిసి ఓ ఇంట్లో ఉండడం నిజంగా గొప్ప విషయం. పాత సినిమాల్లో మాత్రమే కనిపించే ఉమ్మడి కుటుంబ మాధుర్యాన్ని హుస్నాబాద్‌లో ఓ కుటుంబం నిజం చేస్తున్నది. 40 ఏండ్లుగా ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటున్నది. కుటుంబ పెద్ద కాలంచేసిన తర్వాత ఆ బాధ్యతను ఆ ఇంటి ఇల్లాలు భుజాన వేసుకుంది. కలిసి ఉంటే కలదు సుఖం అని ఆ కుటుంబం నిరూపిస్తున్నది. తల్లి మాటకు కట్టుబడి ఆ సంతానం కూడా అదే మార్గదర్శనంలో నడుస్తున్నది. ఈ కుటుంబం ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నది. ఆ ఉమ్మడి కుటుంబం గురించి మీ కోసం ఈ వారం సండే స్పెషల్‌లో..
హుస్నాబాద్ టౌన్, డిసెంబర్ 10 : కరీంనగర్‌కు చెందిన నారాయణసింగ్, మున్నీకౌర్ దంపతులు బతుకుదెరువు కోసం 40ఏండ్ల క్రితం హుస్నాబాద్ పట్టణానికి వచ్చారు. ఇంట్లోని పొయ్యిల తయారీ వృత్తితో జీవనం ప్రారంభించారు. వీరికి ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుళ్లు. ఈ దంపతులు కుటుంబాన్ని పోషించుకుంటూ స్థానికంగానే భూమిని కొని, స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రోజువారీగా ఇంటి అవసరాలకు ఉపయోగించే పలురకాల వస్తువుల తయారీ పనిలో మహిళలు.. వెల్డింగ్‌తో పాటు ఇతర పనులు పురుషులు చేస్తూ నేటికీ ఒక్కటిగానే జీవనం సాగిస్తున్నారు. దాదాపు 40ఏండ్ల క్రితం వలస వచ్చిన ఈ కుటుంబం, పెద్ద కుటుంబంగా మారినప్పటికీ నేటికి వారంతా తల్లిమాట, బాటలోనే ఉమ్మడిగా జీవిస్తున్నారు. కొన్నేండ్ల క్రితం నారాయణ సింగ్ కాలం చేయగా, అన్ని బాధ్యతలను మున్నీకౌర్ తన
భుజంపై వేసుకుంది.
ఇరవై మందికి పైగా కుటుంబం..
నారాయణసింగ్‌కు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం. ఎంత కష్టం వచ్చినా విడిపోవద్దని ఎప్పుడూ చెబుతుండే వాడు. అతను ఉన్నన్ని రోజులు కుటుంబాన్ని మంచిగా చూసుకున్నాడు. అతను కాలం చేసిన తర్వాత అతని భార్య మున్నీకౌర్ ఆశయాన్ని, బాధ్యతను తీసుకుంది. కుటుంబానికి ఏలోటు రాకుండా చూసుకుంటున్నది. ఎవరి సంపాదన ఎంత ఉన్నా.. ఎవరెంత కష్టం చేసినా.. సంపాదనంతా అమ్మచేతికి అందిస్తారు. పెద్దకొడుకు దియాల్సింగ్, రెండో కొడుకు రవీందర్‌సింగ్, మూడో కొడుకు మహేందర్‌సింగ్ భార్యాపిల్లలతో పనులు చేస్తూ అంతా కలిసికట్టుగానే ఒకేచోట నివాసం ఉంటున్నారు. ఇందులోని ముగ్గురు కొడుకులు వారి భార్యాపిల్లలతో కలిపి 20మంది వరకు ఉన్నారు. వీరి వివాహాలు జరిగి ఏండ్లు గడవడంతో పాటు వీరి పిల్లల వివాహాలు జరిగినా నేటికి అంతా ఉమ్మడిగానే జీవనం కొనసాగిస్తుండడం విశేషం.
అంతా అమ్మనే..
ఇంట్లోని పనులు ఎవరికి వీలును బట్టి వారు చేసుకుంటూ తల్లీ మున్నీకౌర్ మాటలను తప్పకుండా పాటిస్తున్నారు. ఏ అవసరమున్నా అమ్మే చూస్తుందనే నమ్మకంతో పాటు అందరినీ ఒకేలాగే చూడటం, ఎవరికి మనస్పర్థలు రాకుండా చూస్తుండటంతో ఈ కుటుంబం అంతా ఒక్కటిగానే ఉంటున్నది. ఉమ్మడి కుటుంబం అనే బంధం తెగిపోతున్న నేటి సమాజంలో నేటికి మేమంతా ఉమ్మడిగానే ఎప్పటికీ ఉంటామని చెబుతున్న ఈ కుటుంబాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. అనేకమంది ఈ కుటుంబాన్ని చూసి మీరంతా కలిసే ఉంటున్నారా? అని ఆశ్చర్యపోవడంతో పాటు అయ్యో.. మేము అలా ఎందుకు ఉండలేకపోయామే అని బాధపడేవారు సైతం ఉన్నారు.
మేం చెప్పినట్లే మా కుటుంబం వింటది
నాకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు బిడ్డలు. చిన్నప్పటి నుంచి పిల్లలందరూ నేను, నా భర్త చెప్పినట్టే వింటుండే. మా ఆయన కాలం చేసి ఎనిమిదేండ్లకు పైగా అవుతున్నది. ఆయన తర్వాత అందరూ నా మాట అందరూ వింటున్నారు. కోడళ్లు కూడా అందరినీ మంచిగా చూసుకుంటరు. మా పిల్లలకు పిల్లలు.. వాళ్లకు కూడా పిల్లలు పుట్టిండ్రు. అయినా అందరూ ఒక్క దగ్గరనే కలిసి ఉంటరు. ఎవలూ గూడ ఒగళ్ల మీద ఒగలు సికాయిత్ ఉండదు. చెప్పినట్లు అందరూ వింటరు. నా చేతిగుండనే అన్ని చేస్త. బట్టలైనా, ఇంట్ల సామానైన అన్ని నేనే చేసుడు. ఇంట్ల ఏదీ కావాలన్న నన్నే అడుగతరు.
– మున్నీకౌర్(ఇంటిపెద్ద)
అందరం కలిసి ఉంటం..
మా అత్తమ్మను మేము అమ్మలాగే చూసుకుంటం. అందరం మంచిగ కలిసి ఉంటం. ఇంట్ల ఏ అవసరమున్నా మా అత్తమ్మనే. దేనికి తక్కువ చేయదు. ఎప్పుడు కూడా లొల్లిలు కాలే. బిడ్డ లెక్కనే మమ్మల్ని ఇప్పటి దాకా చూస్తున్నది. ఎవరినీ తక్కువ చూడదు. మా లెక్క ఎవలూ ఉండరు. మా అత్త, మామ మంచిగనే చూసుకున్నరు కాబట్టి, మేము కూడా గట్లనే ఉంటున్నం. మా కొడుకులకు పెండ్లిండ్లు కూడా చేసినం. అయినా కలిసి ఉంటున్నం.
– మంజులా (మున్నీకౌర్ పెద్దకోడలు)
ఇదీ మున్నీ కౌర్ కుటుంబం
కుంకుమ్ నారాయణసింగ్- మున్నీకౌర్ దంపతులకు ఎనిమిది మంది సంతానం.. ఇందులో ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు దియాల్సింగ్, అతని భార్య మంజల కౌర్, వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఇందులో పెద్దకొడుక్కు సైతం వివాహం జరిగింది. రెండో కొడుకు రవీందర్‌సింగ్, అతని భార్య రజినికౌర్. వీరికి ముగ్గురు మగపిల్లలు. మూడో కొడుకు మహేందర్‌సింగ్, అతని భార్య హర్జిత్ కౌర్. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, కొడుకు ఉన్నాడు.
మా అమ్మే ప్రాణం..
మేము ఎనిమిది మందిమి. మా కుటుంబానికి కావాల్సినవన్నీ అమ్మనే చూసుకుంటది. నలుగురు నాలుగురకాల పనులు చేసి కలిసి ఉంటాం. కోపం, కొట్లాటలు లేవు మా ఇంట్లో. అమ్మ ఏది చెబితే అదే వింటం. మా కుటుంబాన్ని అందరూ మెచ్చుకుంటారు. ఏ గొడవ లేకుండా ఎలా ఉంటున్నారని అడుగుతారు. మాకు మా అమ్మే ప్రాణం.
– రవీందర్‌సింగ్ (మున్నీకౌర్ రెండో కొడుకు)