ఒట్టావా: ఒక ఓడ ఆకాశంలో తేలుతున్నట్లు కనిపిస్తున్నది. కెనడాలోని బాన్ఫ్ పట్టణంలో ఒక వ్యక్తి ఈ దృష్టి భ్రాంతికి గురయ్యారు. వెంటనే తన మొబైల్లో ఆ ఫొటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఆకాశంలో తేలుతున్నట్లు ఉన్న ఆ ఓడ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
కోలిన్ మెక్కల్లమ్ అనే వ్యక్తి బాన్ఫ్ పట్టణంలో తన వాహనంలో వెళ్తుండగా ఒక కార్గో షిప్ సముద్రంపైన గాల్లో తేలుతున్నట్లు కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆయన మరోసారి పరిశీలించగా మబ్బుల వల్ల ఈ దృష్టి బ్రాంతికి గురైనట్లు గ్రహించారు. వెంటనే తన మొబైల్లో ఆ ఫోటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
ఈ రోజు బాన్ఫ్లో నిజ జీవితంలో ఆప్టికల్ భ్రమను చూశాను అని కోలిన్ పేర్కొన్నారు. సముద్రం అలలపై మబ్బుల నీడ పడటంతో ఆ ఓడ ఉన్న చోటు ఆకాశంగా కనిపించిందని తెలిపారు. దీంతో ఆ షిప్ ఆకాశంలో తేలుతున్నట్లుగా ఉన్నదని చెప్పారు.
మరోవైపు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ ఫొటోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. చాలా అద్భుతంగా ఉన్నదని కొందరు, అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదని ఒకరు, చాలా అద్భుతమైన దృష్టి బ్రాంతి అని మరొకరు వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.