కొన్ని పుస్తకాలు చదివి మూసివేస్తాం. కొన్ని పుస్తకాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని పుస్తకాలు మన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. సహజ రచించిన ‘ఉద్వేగ’ అలాంటి పుస్తకమే. ఇది కేవలం కవితలూ, క థల సమాహారం కాదు. ఒక సున్నితమైన మనసు తన జీవితానుభవాలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలు, సామాజిక స్పృహను అక్షరాలుగా మలిచిన ఆత్మకథాత్మక సాహిత్యయానం.
ఉషోదయపు తడిమొగ్గపై వికసించే పువ్వులా, ప్రకృతితో మమేకమై జీవించే మనసు సహజది. వర్షపు చినుకులను ప్రేమించే హృదయం, అడవికి పచ్చదనం కావాలనే తపన, చెట్లు, కొండలు, కోనల మధ్య లేడిపిల్లలా విహరించే స్వేచ్ఛా స్వభావం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అదే సమయంలో అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, సమాజాన్ని ప్రశ్నించే తత్వం, మనిషిలోని మంచితనాన్ని వెతికే విశాల హృదయం ఆమెది.
ఆమె పెరిగిన కుటుంబ నేపథ్యం ఈ పుస్తకానికి మూలాధారం. కవులు, రచయితలు, కళాకారుల మధ్య పెరిగిన సహజలో సాహిత్యాసక్తి సహజంగానే మొలకెత్తింది. ఈ పుస్తకంలోని ‘కోరిక’ కవిత పాఠకుడి మనసును కదిలిస్తుంది. ‘ఒక్కసారి చనిపోవాలని ఉంది’ అనే వాక్యం మరణ వాంఛ కాదు, తనకిష్టమైన వారిని మరోసారి కలుసుకుని వారి ప్రేమ, ధైర్యం, ఆశయాలు మళ్లీ హృదయంలో నింపుకోవాలనే ఆత్మీయ తపన.
‘కన్నతల్లి’ కవితలో తల్లితనాన్ని ప్రశ్నిస్తూ సమాజంలోని విషాద వాస్తవాలను మన ముందుంచుతుంది. ‘మహిళ’ కథలో ఆడశిశువు హత్యల వంటి అమానుష ఘటనలను చిత్రిస్తూ, కనీసం రాబోయే తరమైనా ఆడపిల్లల జీవితాల్ని గౌరవించాలని బలమైన సందేశాన్ని అందిస్తుంది. ‘కూలీ’ కవిత శ్రమజీవుల జీవిత సత్యాన్ని హృదయాన్ని తాకేలా ఆవిష్కరిస్తుంది.సహజ రచనల్లో మరో ప్రత్యేకత ఆమె జ్ఞాపకాల సౌందర్యం.ఆమె రచనల్లో స్త్రీ జీవితంపై అవగాహన, సామాజిక బాధ్యత, మానవీయ విలువలు, ప్రకృతిపట్ల ప్రేమ సమానంగా ప్రతిధ్వనిస్తాయి.
‘ఉద్వేగ’ కవిత చదివిన తర్వాత పాఠకుడి మనసులో మిగిలేది కేవలం కొన్ని కవితలు, కథలు కాదు, ఒక మనిషి జీవితం, ఒక కుటుంబం నిలబెట్టిన విలువలు, ఒక స్త్రీ ఆత్మగౌరవం, ఒక రచయిత్రి సున్నిత హృదయం. ఈ పుస్తకం మనసును తడిపే ఉద్వేగాల ప్రవాహం. ఆలోచింపజేసే అక్షరాల ఆవిష్కరణ. జీవితాన్ని ప్రేమించడం, మనుషులను అర్థం చేసుకోవడం, అన్యాయాన్ని ప్రశ్నించడం నేర్పించే సాహిత్య సాక్ష్యం. ‘ఉద్వేగ’ పుస్తకం సహజ మనసుకు అద్దం మాత్రమే కాదు; నేటి సమాజానికి అవసరమైన సున్నితత్వం, చైతన్యం, మానవీయ విలువలను గుర్తు చేసే అక్షర దీపిక.
-ప్రమోద్ ఆవంచ
7013272452