ప్రపంచ సాంస్కృతిక చరిత్రలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ నేలకు మాత్రమే సొంతం. ఈ నేలపై పుట్టిన ప్రతి ఆడబిడ్డ ఎంతో ఆనందంతో జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగలో తెలంగాణ జీవన చిత్రం నిబిడీకృతమై ఉన్నది. తెలంగాణ ప్రజల ఆనందాలు, అనుబంధాలు, కష్టసుఖాలు బతుకమ్మ పాటల్లో ప్రతిఫలిస్తాయి. ప్రత్యేకించి స్త్రీల హృదయ మార్దవం ఈ పాటల్లో ప్రతిబింబిస్తుంది. ఈ పూల జాతర అనుబంధాల మధురిమలను అంతకంతకూ రెట్టింపు చేసే సామూహిక పండుగ. తెలంగాణ సంస్కృతి గొప్పదనాన్ని నలుదిశలకు చాటి చెప్పే గొప్ప పండుగ. ప్రకృతిని ఆరాధించే ప్రత్యేకమైన పండుగ.
ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే కుటుంబ వ్యవస్థ మన భారతీయుల సొంతం. మన కుటుంబ వ్యవస్థ అనుబంధాల పొదరిల్లుగా ఒకరి కష్టసుఖాల్లో మరొకరు భాగస్వాములవుతూ పరస్పర సహకార జీవనం కొనసాగిస్తారు. ఈ భావన బతుకమ్మ పండుగలో కనిపిస్తున్నది. బతుకమ్మ పండుగ వస్తుందంటేనే తెలంగాణలో సందడి మొదలవుతుంది. స్త్రీ, పురుష భేదం లేకు ండా అందరూ తమ తమ బాధ్యతల్లో నిమగ్నమవుతారు.
బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మానవ జీవిత అనుబంధాలను బతుకమ్మ పాటలు ఆవిష్కరిస్తాయి. శైశవదశలో నిద్రపుచ్చడానికి తల్లులు పాడే జోల పాటలు ఎంతో హాయిని గొలుపుతాయి. ఆ జోల పాటల స్పర్శ కూడా బతుకమ్మలో కనిపిస్తుంది.
‘నిద్రపో బొడ్డెమ్మా నిద్రపోవమ్మ
నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నినుగన్న తల్లికి నిండునూరేండ్లు
పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేండ్లు’
కన్నతల్లి వలె బొడ్డెమ్మకు జోల పాడే ఈ పాట తల్లీ పిల్లల అనుబంధానికి ప్రతీక. అత్తవారింటికి వెళ్లిన స్త్రీ బతుకమ్మ పండుగకు పుట్టింటికి రావాలని ఆశ పడుతుంటారు. తన అన్న వచ్చి తీసుకువెళ్తే బాగుండునని కోరుకుంటారు. ఇటువంటి స్త్రీ మనోవాంఛను అనేక బతుకమ్మ పాటల్లో మనం గమనించవచ్చు.
ఇద్దరక్కా చెల్లెళ్లు ఉయ్యాలో
ఒక్క ఊరికిస్తే ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో
చూసన్న వోడాయే ఉయ్యాలో
ఎట్ల వత్తు చెల్లెళ్లు ఉయ్యాలో
ఏరు అడ్డమాయే ఉయ్యాలో
అనే పాట లోక ప్రసిద్ధమైనది. తన అన్న కోసం ఎదురుచూసే చెల్లెలు, తన చెల్లెలు కోసం రావడానికి ప్రకృతి సహకరించక బాధపడే అన్న ఇతివృత్తాన్ని ఈ పాటలో గమనించవచ్చు. తమ్మునికి అక్క పట్ల అనురాగాన్ని ప్రకటించే పాటలు కూడా బతుకమ్మలో కనిపిస్తాయి. ఒక పండును చిలుక ద్వారా పంపిస్తూ తన అక్కకు ఇచ్చి రమ్మని అక్క జాడను చిలుకకు చెప్తాడు తమ్ముడు.
అరుగు మీద అక్క ఉయ్యాలో
అచ్చనాలాడంగ ఉయ్యాలో
పందిట్లో మా బావ ఉయ్యాలో
పద్యాలు చెప్పంగ ఉయ్యాలో
ఓ పక్షులారా ఉయ్యాలో
అక్కకు పండ్లిచ్చి ఉయ్యాలో
కుశలము అడగరే ఉయ్యాలో…అనే పాట శిష్ట సాహిత్యంలో సందేశ కావ్యాలను స్ఫురణకు తెస్తుంది. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి అందమైన ప్రతీకగా నిలుస్తుంది. ఈ విధంగా బతుకమ్మ పాటలను విశ్లేషిస్తే చాలావరకు కుటుంబ సంబంధాలకు, అనుబంధాలకు సంబంధించినవే ఎక్కువగా కనిపిస్తాయి. పురాణేతిహాస గాథల నుంచి పాటలు ఉన్నా అవి కూడా సామాజిక పరిస్థితులకు అన్వయించి పాడుకోవడం బతుక మ్మ పాటల ప్రత్యేకతగా చెప్పవచ్చు. మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ సంబంధాలకు బతుకమ్మ పాటలు నెలవైనాయి. వీటిని ముం దు తరాలకు అందించవలసిన బాధ్య త మనందరిపై ఉన్నది.
-ఉప్పల పద్మ