భారతదేశ సాంస్కృతిక, రాజకీయ పటంలో తెలంగాణ గడ్డది ఒక విశిష్టమైన చరిత్ర. పోరాటాలు, త్యాగాలు, ఆత్మగౌరవ ప్రతీకల కలయిక ఈ నేల. చారిత్రక పరిణామాల నేపథ్యంలో ఇక్కడి సమాజం ప్రదర్శించిన సహనం, చూపిన చైతన్యం, నేటికీ కొందరు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక ఆధిపత్య అహంకారాన్ని బౌద్ధికంగా ఎదిరిస్తున్న తీరును గమనిస్తే ఈ నేల ఆత్మగౌరవ తీవ్రత అర్థమవుతుంది. ఈ గడ్డపై వికసించిన యాసకు, ఇక్కడి సొంత భాషకు ఉన్న చారిత్రక పునాదులు, ప్రాచీనత అత్యంత లోతైనవి. ఈ ప్రాకృతిక భాష ఇటీవలి కాలంలో పుట్టుకొచ్చింది కాదు. శతాబ్దాల కిందటే దీనికి బలమైన శాసన, సాహిత్య ఆధారాలు ఉన్నాయి. ’ఇడుపు కాయితం’ (విడాకుల పత్రం లేదా రసీదు) లాంటి పాలనాపరమైన అచ్చమైన పదాలు, ‘కాటికి కాళ్లు చాచుకొని…‘ లాంటి లోకోక్తులు ఈ నేలపై శతాబ్దాలుగా పరిమళించిన సజీవ భాషా పరిణామ ప్రవాహాలు. ఒకప్పుడు ఏ యాసనైతే పరిహసించారో, నేడు అదే యాస, అదే మట్టి సువాసనతో కూడిన కథలు చిత్ర పరిశ్రమను శాసిస్తున్నాయి. 60 ఏండ్లు అన్ని ప్రాంతాల సినిమాలను ఆదరించిన ఈ సమాజం, తమ భాష, సంస్కృతిని తక్కువ చేసి చూపే ప్రయత్నాలను ఇకపై బౌద్ధికంగా, గట్టిగా తిప్పికొడుతుంది. ఇక్కడి గర్వం, అస్తిత్వం ఎప్పటికీ అజేయం.
-రఘువీర్ రాథోడ్
9948480556