సెరువు
అస్సోయ్యీ... ఇస్సోయ్యీ హైలెస్సా రంగోయీ విసురోయీ గుంజోయీ వల విసిరి గుంజోయీ
అస్సోయ్యీ… ఇస్సోయ్యీ హైలెస్సా రంగోయీ
విసురోయీ గుంజోయీ వల విసిరి గుంజోయీ
ఎద్దులనాపోయీ నీళ్లనూ దాపోయీ
గంతేసి దూకోయీ సెరువంత ఈదోయీ
పిట్టల సుట్టుతా పిల్లల పరుగోయీ
కట్టమీద కొంగ బావలూసులోయి
నింగివాన గట్టు నేలకొంగినట్టు
పారేటి ఈ సెరువు పల్లెకెంతందమో?
సెరువోయి మా ఊరి సెరువు
ఊరి బరువునంత మోసె ఏకైక ఆదెరువు
లేత రెమ్మలతోని లేసిన ముండ్లతోని
గొట్టి అళము సెరువు సుట్టు కంచెగుండె
పారాడె తీగలతో తేలాడే తామరలు
అలలు కొప్పులపైన తురిమినట్టున్నయి
రాతి సరికెల్లోని లేత కానుగ పొదలు
కొత్త నీళ్లు తాగి మత్తు గమ్మున్నాయి
నీట మునిగిన తుమ్మనీడల కిందికి
సిరుగాలికలలొచ్చి సిందాడుతున్నవి
కుడితి తాగిన గాని ఉడుకు తగ్గని బర్లు
కరువు తీర ఈది మైమరుస్తున్నాయి
ముక్కులు కలుపుకుని ముద్దులిచ్చుకునె
బులముడ్తలు మునిగి బుడగలు లేపినవి
అరిసెనీరు కోళ్లు అలేటి కొంగలు
సరస మాడుకుంట సయ్యాటలాడినవి
సుడులెంట పిట్టలు సుట్టు తిరుగుతుంటె
రాట్నమేటి నీట తిరుగుతున్నట్టుంది
కోరమీసం తిప్పె నారజెల్లల చూపు
ఇసుకదొంతుల తోకలేమో పైకి లేపు
కొడిపెలు రవ్వలు కొల్లలుగ పరుకలు
పూమేన్లు కొర్రమేన్లు నాసుకింద కోపు
కంసెలు మార్పుల్లు బురదనంతలోపు
ఇంగిలీకం సెరువు సేపలకే కాపు
బంగారు తీగల మెరిసె వంటిరూపు
తీరొక్క సేపల తిరుణాలనే జూపు
చింతలు మామిళ్లు పండ్లతోటలు పట్టి
పొట్టపోసుకునె తెలగొల్లు బెస్తొల్ల
సెరువు నిండగానె తోటలిడిసిపెట్టి
తెల్వకుండనె కాళ్లు సెరువొడ్డుకొచ్చినవి
వలతోని గాలించె జాలరి కండ్లల్ల
పడుకున్న మేల్కొన్న సెరువు మెదలాడింది
సేతులో పైసాడి సేపలను కొనుక్కొని
ఊరు జనుల నోటి సేదెల్లి పొయ్యేది
జంగాలు దాసర్లు బుడబుక్కల వాళ్లు
గంగిరెద్దులోల్లు గంట పకీరోల్లు
ఉరుముల తొలకరిల ఉసిల్ల తీరుగ
సెరువు నీళ్లను జూసి తిరిగి ఊరొచ్చిండ్రు
వదిలిపొయిన జాగ వంటపొయ్యి రాళ్లను
తడిమి సూసి మురిసి తావేసుకుంటుండ్రు
సెరువు ఆసరతోని గడువెల్ల దీసుకొని
బరువు దించుకోని బంతి కూసున్నరు
నోరు తెరిసిండంటే రామనామమోలె
నీరటోడు సెరువు ముచ్చట్లు జెప్పేది
ఎట్టకాలముల నీరటోని సోది
వెంటవడి సెప్పిన ఎవ్వరినక పొయ్యేది
మదిగుంజి కుతికెండి మందికి సెయ్యిజాపి
బీడిముక్కడిగిన బిక్షమెయ్య పొయ్యేది
సెరువు నిండగనె నీరటోని జేబి
బీడికట్టలతోని బిగ్గరయ్యి పోయింది
పొరుకలు బుట్లల్లె ఊరెరుకలోల్లకు
పొద్దిగింతల కల్లు అంచుకున్నది జవురు
వేట ఉచ్చులతోని నీటి పిట్టల పట్టె
దేవరొల్ల కూరకుండదు ఏ కరువు
సేపల పిట్టల శికారీతో ఊరు
సందేల విందుల సంబురాల దరువు
అల్లం ఎల్లిపాయ అమ్ముడెక్కువ జరిగి
బుట్టిదుకుణం గల్లపెట్టె పెరిగేది బరువు
కట్టకిందీదుల కల్లు పొంగులు పొంగి
గౌండ్లోల్ల లొట్టికి గౌరవం పెరిగింది
బొట్టుబోనం బెట్టె కుమ్మరి బైండ్లకు
కట్టమైసమ్మ వరికట్ట మెదలొచ్చినయి
సుత్తి బారిసె పట్టె కమ్మరొడ్రంగికి
సెరువు నిండితె గుండె బరువు దిగిపోయింది
బతుకు సెరువు వల్ల బంధుత్వములు కలిగి
సెరువు వల్ల ఊరి పరువెంతో పెరిగింది
సెరువమ్మ నిండుగ తొణుకులాడుతుంటే
బావులెల్ల వారి బాటలొరదయినయి
సిరులిచ్చే తరిపొలము తనువెల్ల తడువంగ
వరిసేల గంధంతో వన్నెలొలికిందూరు
సారమే లేనట్టి ఇసుక తువ్వలు గూడ
సాటెడొండు జలితె భూమి సల్వ ఎక్కింది
రోజు సెరువునీటి బురద రాసుకొని
తానమాడితె తనువు తేలికయి పోయింది
ఎండ కాలంల సెరువు తేమతోని
సెనగ పుచ్చకాయలిరివిగ కాసినవి
నీరింకి పోలేదు సెరువెండి పోలేదు
కొంగలు కొమ్మల్లో కోలాటమేసినయి
తుమ్మకాయల విందు సెరువొడ్డున మేసి
గొర్లు మేకలు నీళ్లు తాగి నెమరేసినవి
వొంటరి యోగుల యోగనిదురకు నెలవు
ధూళి అంటని నీలి దుప్పటి నా సెరువు
కాళేశ్వరం నీళ్లు కాలువలయి పారంగ
ఊరూర వాగులు ఉరకలేస్తున్నయి
ఎత్తిపోతల తోని ఎగిసె నదుల నీళ్లు
అణువణువునా వరి సిరుల కురిపించినయి
లోగిళ్లు యాగిళ్లు ధాన్యాలతో నిండి
అపర భగీరథునికి హారతులు పట్టినయి
భారతావని నేటీ ధాన్యగారంబై
బంగారు శిఖరంగా భాసిల్లుతున్నది
గోరటి వెంకన్న
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

