మదిలోని భావాన్ని వ్యక్తపరచే వాహకమే భాష. ఇది నమ్మకాలను ప్రోదిచేస్తుంది. సంస్కృతిని నిర్మిస్తుంది. చరిత్రను ఆమోదిస్తుంది. ఒక జాతికి గుర్తింపు తెచ్చిపెడుతుంది. తొలినాళ్లలో దూరంగా ఉన్నవారికి సమాచారం అందించడానికి దూతను పంపేవారు. ఆ తర్వాత
ఉత్తరం వచ్చింది. దాని తర్వాత వచ్చిన ఫోన్ మాట్లాడే దూరాన్ని చెరిపేసింది. దీనికి అదనంగా మెయిల్, వాట్సాప్ వంటి సమాచార
సాధనాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి.
ఇపుడు నేరుగా మాట్లాడడానికి వీడియో కాల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఎన్ని సాధనాలు వచ్చినా భాష మాత్రం మారలేదు. అలానే ఉన్నది. అప్పుడు, ఇప్పుడు ఇద్దర్ని కలిపేది మాటే. సాధనాలు మారాయి. అంతే..కానీ ప్రేరణ అలానే నిలిచి ఉన్నది.
కృత్రిమ మేధ ఇపుడు నేర్చుకోవడం, పని పద్ధతులను తిరగ రాస్తున్నది. ఇది గణిత సమీకరణాలను పరిష్కరిస్తున్నది. వ్యాసాలు రచిస్తున్నది. సంగీత బాణీలను కడుతున్నది. ఇలా ఎన్నో చేస్తున్నది. ఈ మేధ ట్యూటర్‌గా, అనువాదకునిగా, సహచరునిగానూ వ్యహరిస్తున్నది. తర్కం, స్థిరవ్యవస్థలపై నిర్మితమైన లెక్కలు, ఇంజినీరింగ్ తదితర శాస్త్ర విషయాలు ఇప్పటికే ఏఐ ప్రభావంతో రూపాంతరం చెందాయి. సంక్లిష్ట సైన్స్ సూత్రాల వివరాలు ఇప్పుడు ఏఐ ద్వారా తక్షణమే పొందగలుగుతున్నాం. కథలు చెప్పగలిగేవారే ప్రపంచంలో అత్యంత శక్తిమంతులు అంటారు పెద్దలు. మాట అంత మహత్తరమైనది. భాష ఒక జాతి సంస్కృతి, భావోద్వేగాల జీవన శ్వాస.
ఏఐ వ్యాకరణాన్ని, పదజాలాన్ని వివరించగలదు. కానీ హాస్యం, వ్యంగ్యం, ప్రేమలు పట్టుకోలేదు. యంత్రం సాయంతో చేసిన అనువాదం సాంకేతికంగా సరిగానే ఉండవచ్చు. అయితే దీనిలో హృదయం లోపిస్తుంది. ఎవరైనా ఒకరు ‘ఐ మిస్ యు’ అంటే, దానిలో భావోద్వేగం ఇమిడి ఉంటుంది. ఆ ఉద్వేగ అనుభూతి యంత్రానికి సాధ్యం కాదు కదా! టెక్నాలజీ అనువాద క్రియను చాలా సులువు చేసింది.
తెలుగు ఉత్తరమో, వ్యాసమో కేవలం క్షణాల్లో తప్పులు లేకుండా ఏఐ మరో భాషలోకి అనువదిస్తుంది. అది కచ్చితంగా ఉంటుంది. కానీ పేలవం అనిపిస్తుంది. అనువాదం అంటే ఒక భాష నుంచి మరో భాషలోకి తర్జుమా మాత్రమే కాదు కదా! అనువాదం అంటే విషయంలోకి పరకాయ ప్రవేశం చేసి అందించడం. అందుకే భాష భిన్నమైనదని భాషావేత్తలు చెప్తారు.
సైన్స్ ఫార్ములా తెలుసుకోవడం ఓ వియుక్త నైపుణ్యం. మాట్లాడటమే భాష. మాటలో, నవ్వులో, స్వరంలో అనేక భావాలు దాగి ఉంటాయి. ఆలోచన చెప్పడంలో పొరపడి, జాగ్రత్తగా దిద్దుకుంటాం. ఇవి అన్నీ చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి. ఇవి తీపి, చేదు అనుభూతులు కలిగిస్తాయి. మనలో విశ్వాసం పెంపొందిస్తాయి. ఒకరితో ఒకరిని కలుపుతాయి. ఎందరో గురువులను అందిస్తాయి. భాష నేర్చుకోవడంలో మెలకువలు నేర్పుతాయి. ఇది సజీవ శిక్షణ. ఆ సజీవతను ఏ యాప్, చాట్ బోట్లు మనకు అందించగలవు?
కృత్రిమ మేధో సాధనాలు పలు రకాలుగా సాయపడతాయి. అవి పలుకుబడిని సరిచేస్తాయి. వ్యాకరణాన్ని వివరిస్తాయి. ఇంకా వ్యక్తిగతీకరించిన అభ్యాసాన్ని అందిస్తాయి. ఇవి టీచర్లకు బాగా ఉపయోగపడతాయి. పాఠ్యప్రణాళిక రాసుకోవచ్చు, విద్యార్థుల నుంచి వేగంగా అభిప్రాయాలూ సేకరించవచ్చు. ఎదుటి వ్యక్తి మాటల్లోని భావోద్వేగాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నాన్ని యంత్రాలు భర్తీ చేయలేవు. భాషాపటిమ ధారాళంగా మాట్లాడటం ద్వారా రాదు. సహానుభూతి ద్వారానే వస్తుంది.
సజీవ భాషలు నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. యాస, మర్యాదపూర్వక సంభాషణా స్వరాలు మెల్లగా అనుభవంతో అలవడతాయి. యంత్రం వీటిని నమోదు చేయగలదు. కానీ అది మనిషి కాదు కదా! కనుక అది మన మాటల లయలో పాల్గొనలేదు. వినడం, అర్థం చేసుకోవడం, తగిన విధంగా ప్రతిస్పందించడం నిరంతర తర్ఫీదు, ఇదే నిజమైన భాషా ప్రావీణ్యత సాధనా మార్గం.
గత కొన్ని దశాబ్దాలుగా పట్టణీకరణ జోరందుకున్నది. ఆంగ్ల మాధ్యమ కాన్వెంట్ చదువులు విస్తృతంగా పెరిగాయి. ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఇప్పుడు ఇంగ్లిష్ తప్పని సరైంది. నేడు ఏ భాషనైనా ఏఐ పరికరాల సాయంతో అనువదించడం చాలా సులువైంది. కష్టం లేకుండా చేస్తున్నది టెక్నాలజీ. ఇదే పెనుముప్పు కలిగించే అవకాశం ఉన్నది. భాష నేర్చుకోవలసిన అవసరం లేదనే భావన మనలో ఏర్పరుస్తున్నది. అందుకే టెక్నాలజీని నేర్పుగా వాడాలని భాషా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భాష నేర్వడం అంటే పదవినియోగం, శ్రద్ధగా వినడం, జవాబు చెప్పడం, చదవడం, రాయడం మాత్రమే కాదు, సాంస్కృతిక సందర్భం గుర్తెరగాలి. ఇది సామాజిక సంబంధాలను నిలిపే సాధనం. కానీ వ్యక్తిత్వ ఎదుగుదలకు సోపానం. నూతన ఆలోచనా ప్రపంచాలను చేరువచేసే మార్గం. భాష నెమ్మదిగా వంటబడుతుంది. ఇలా నేర్చుకోవడంలో భావోద్వేగం, మానవతలు మిళితమై ఉంటాయి. ఇదే నిజమైన భాషా పండిత్య సాధనకు సోపానం. దీర్ఘకాల ప్రయత్నంతోనే భాషా పటిమ పట్టుబడుతుంది. ఈ సాధనే భాష సజీవంగా నిలిచి వెలిగేలా చేస్తుంది.
సైన్స్ ఫార్ములా తెలుసుకోవడం ఓ వియుక్త నైపుణ్యం. మాట్లాడటమే భాష. మాటలో, నవ్వులో, స్వరంలో అనేక భావాలు
దాగి ఉంటాయి. ఆలోచన చెప్పడంలో పొరపడి, జాగ్రత్తగా దిద్దుకుంటాం. ఇవి అన్నీ చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి. ఇవి తీపి, చేదు అనుభూతులు కలిగిస్తాయి.
-వి. వరదరాజు
9492542033