తిరగబడిన సింగరేణి
సింగరేణి సభలో ప్రతిధ్వనించింది కేటీఆర్ గొంతు కాదు, అశేష కార్మికుల పొలికేక. బహువచనం ఏకవచనమైన నినాదం. సమర సన్నద్ధమైన కార్మికలోకం సమరనాదం. గనుల పొరల్లో నుంచి మార్మోగుతున్న ప్రశ్నలు. ఇందుకు సర్కార్ దగ్గర జవాబులు ఉన్నాయా?
నల్లబంగారంలో మంటలు రగులుతున్నాయి. ఆగ్రహ శిఖరాలు పగులుతున్నాయి. మాటతప్పిన, మడమతిప్పిన సర్కార్‌పై నిప్పురవ్వలు ఎగురుతున్నాయి. తెలంగాణ జీవనాడి తెగించి పోరుకు సిద్ధమవుతున్నది. బొగ్గును తవ్వితీసే చేతులు పిడికిళ్లు ఎత్తుతున్నాయి. సింగరేణి కార్మికలోకం ఏకవ్యక్తిగా రూపుదాల్చి సవాల్ చేస్తున్నది. సింగరేణి సభలో ప్రతిధ్వనించింది కేటీఆర్ గొంతు కాదు, అశేష కార్మికుల పొలికేక. బహువచనం ఏకవచనమైన నినాదం. సమర సన్నద్ధమైన కార్మికలోకం సమరనాదం. గనుల పొరల్లో నుంచి మార్మోగుతున్న ప్రశ్నలు. ఇందుకు సర్కార్ దగ్గర జవాబులు ఉన్నాయా? తెలంగాణ తల్లి సిరులవేణి సింగరేణిలో అలజడికి బీఆర్ఎస్ సభ నిలువుటద్దం పట్టింది. అధికారంలో ఉన్నా లేకున్నా బొగ్గుబాయి గుండెల్లో రెపరెపలాడేది గులాబీ జెండానే అని చాటిచెప్పింది. ఆ అనుబంధం ఈనాటిది కాదు. నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడు సింగరేణి కేసీఆర్ సైన్యమై కదం తొక్కింది. నేడు కాంగ్రెస్ సర్కార్ మోసాలు, ద్రోహాలతో కలవరపడుతున్న కార్మికులకు ‘నేనున్నాను తోడుగా’ అని అండగా నిలిచింది బీఆర్ఎస్. రెట్టించిన సమరోత్సాహంతో జూలు విదిల్చింది సింగరేణి. సింహమై గర్జించింది సింగరేణి. ఆ గర్జనకు గొంతు కలిపారు కేటీఆర్.
సింగరేణి అంటే చిన్నాచితకా కంపెనీ కాదు. భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికితీసే కార్మికుల స్వేద శిఖరం. అలాంటి కార్మికుల సమస్యలను సాధారణ ఉద్యోగుల ఫిర్యాదులుగా పరిగణించలేము. వారి భద్రత, వేతనాలు, ఉద్యోగ భద్రత, వైద్య సదుపాయాలు, నివాస వసతులు, కుటుంబాల సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఉండాలి. కానీ అలా ఎందుకు లేదు? ఎన్నికల ముందు ఇచ్చిన అడ్డగోలు హామీలు ఏమయ్యాయి. అవి హామీలు కావు, అర్రాసు పాటలు. ఇంతకు ఇంత ఇస్తామనే మాటలు. అవి కోటలు దాటినా అడుగు మాత్రం ముందుకు కదల్లేదు. కార్మికుల సొంతింటి కల నిజం చేస్తామన్నారు. ప్రతి కార్మికుడికి 250 గజాల ఇంటి స్థలం, 20 లక్షల వడ్డీలేని రుణం ఇస్తామన్నారు. ఇచ్చారా? కారుణ్య నియామకాలాను సరళీకృతం చేస్తామని చెప్పారు. చేశారా? లాభాల్లో మెరుగైన వాటా ఇస్తామన్నారు. ఆచరణలో తగ్గించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికుల సమస్యలపై గళమెత్తి, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలను అటకెక్కించారు. మోసపోయి గోసపడుతున్న సింగరేణి శ్రామికలోకం తరఫున బీఆర్ఎస్ సభ ప్రశ్నలను సంధించింది. సమాధానాలున్నాయా కాంగ్రెస్ దగ్గర?
కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసి, సింగరేణి నిర్వహణను మెరుగుపర్చడం మాట దేవుడెరుగు, అసలు అస్తిత్వానికే ఎసరు తెస్తున్నారు. లెక్కలు నొక్కేసి బొగ్గును బొక్కేస్తున్నారు. మూడేండ్లలో పది వేల కోట్ల సంపద హాంఫట్ అయిపోయిందని విపక్షం ఆరోపిస్తున్నది. కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో స్కాములు ఎగసిపడుతున్నా బీజేపీ నోరు మెదపదు. అంతా కాటాకుస్తీ. ఈ దొందూదొందే సింగరేణి నల్లవజ్రాలను అంబానీ, అదానీలకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టాలని చూస్తున్నది. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరుగనివ్వబోమని గొప్పగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ లోపల్లోపల కుట్రలు పన్నుతున్నది. ఆ కుట్రలకు ముసిముసి నవ్వులతో వత్తాసు పలుకుతున్నది బీజేపీ. ఈ దొందూదొందేపై కేటీఆర్ ఎక్కుపెట్టిన విమర్శలపై సమాధానాలు ఉన్నాయా కాంగ్రెస్ దగ్గర? రూ.నాలుగున్నర లక్షల కోట్లు అప్పుచేశామని చెప్తున్న సర్కార్ రూ.60 వేల కోట్లు సింగరేణి బకాయిలు తీర్చలేకపోయింది. కరెంటు ఏమైందంటే బొగ్గు లేదంటున్నారు. బొగ్గు ఏమైందంటే సింగరేణి వైపు వేలెత్తి చూపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఓ రికార్డు. 2025-26లో 58 మిలియన్ టన్నులే. రానురాను పెరగాల్సింది తరిగిపోవడం ఏమిటి? చేతగాని, చేవలేని పాలన ఫలితం కాదా ఇది? రామన్న సంధించిన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా కాంగ్రెస్ దగ్గర? సింగరేణి కార్మికుల ఆందోళనలో అత్యంత కీలకమైన అంశం సంస్థ లాభాల్లో వారి వాటా. సంస్థ అభివృద్ధికి కార్మికుల శ్రమే పునాది అయినప్పుడు, ఆర్థిక ఫలితాల్లో వారికి న్యాయమైన వాటా దక్కాలన్న డిమాండ్‌ను కాదనగలమా? కేసీఆర్‌కు ముందు లాభాల్లో వాటా 16 శాతమే. కేసీఆర్ దానిని 32 శాతానికి పెంచారు. ఒక శాతం ఎక్కువే ఇస్తామన్న కాంగ్రెస్ లాభాలు తగ్గించి చూపి బోనస్‌కు కోత పెడుతున్నది. గత ఏడాది రూ.1.95 లక్షలున్న బోనస్ ఈ ఏడాది రూ.1.53 లక్షలకు తగ్గిపోవడమే అందుకు నిదర్శనం. ఈ దోఖాలపై పోరుగడ్డ సింగరేణి నిలదీస్తున్నది. బరిగీసి సర్కార్‌తో కొట్లాడుతామని అంటున్నారు కేటీఆర్. నిలబడే దమ్మున్నదా కాంగ్రెస్ పాలకులకు?
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

