ఎవరూ లేకపోయినా
చుట్టూ ఏకాంతం వలయంగా
పలకరింపు శూన్యమై
కాలమంతా గడుస్తున్నా
రంగుల రుచులు తెలియకున్నా
సువాసన లేదని స్పృశించకున్నా
పూజకు పనికిరాదని
ముఖం చాటేసినా
అవసరం ఏమీ లేదంటూ
వేళ్ళతో ఊడబెరికి
భూమి నుంచి దూరం చేసినా…
నన్నెవ్వరూ…
ఏమీ చేయలేరంటూ
వేకువ కిరణాల వెలుగులో
మంచు బిందువులను చల్లుకొని
అక్కడక్కడ మెరుస్తూ
నిటారుగా నిలదొక్కుకొని
గాలి సయ్యాటలకు
తలవూపు ఊసులు కలిపి
అరవిచ్చిన నవ్వుతో
సిగ్గుల మొలకలా గడ్డిపూవు!!
అరుణ ధూళిపాళ
87123 42323