నీలాకాశాన్ని సిబ్బిగా మలిచి సింగిడిని పూల వరుసలుగా పేర్చి ప్రకృతినే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ. ప్రపంచంలోనే అరుదైన రంగురంగుల పూలపండుగ. బతుకమ్మ అంటే బతుకుదెరువును మెరుగుపరిచే అమ్మ అని. ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించటం బతుకమ్మ పండుగ విశిష్టత. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ అంతటా ఒక జాతరలా సాగి చివరిరోజు సద్దుల బతుకమ్మగా మన వాకిట్లో బతుకుదెరువును ఆవిష్కరిస్తుంది. ఆటపాటలతో మనల్ని సేదతీరుస్తుంది. జీవన సంబురాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో మాత్రమే జరుపుకొనే పండుగ బతుకమ్మ. స్వరాష్టంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొంది నేడు ప్రపంచంలో తెలంగాణవారున్న చోటల్లా పూలజాతరై వర్ధిల్లుతున్నది.
మహాలయ అమావాస్య నాడు పూదోటల పున్నమల్లే వచ్చి తెలంగాణ గడప గడపకు వెలుగుల తోరణం కట్టి పడతులను పరవశింపజేసి పలకరించే పూలరెమ్మ బతుకమ్మ
పుట్టింటికి పయనమైన పుత్తడి బొమ్మ గాజుల గలగలలు పసిడి పలుకులు ఆప్యాయతలు అరవిరియగ పట్నాలే పల్లెలకు కదిలివచ్చి అంబరాన్నంటే సంబురాలను తెచ్చి సద్దుల బతుకమ్మగా సందడి చేసి గునుగు పూలు మురిపెంగా హారతులివ్వగ గుమ్మడి పూలు, తంగేడులు తలంబ్రాలు పోయగ చెరువులన్నీ పూల రహదారులై నిను సాగనంపే
– కళ తాటికొండ 99898 91558
పూవులు నీ స్వరూపములు పూజలు సైతము పూలతోడనే
పూవులు జీవితమ్ములకు మూలములై వెలుగొందు నిత్యమున్
పూవుల మేరుచక్రమున పూజలనందెదవీవు రాజ్ఞివై
పూవుల తల్లి! మమ్మెపుడు బ్రోవుము నీ కరుణైక దృష్టితో !
నిన్ను బతుకమ్మ యందురు నిఖిల జనులు
నిన్ను సుమరాశి రూపున సన్నుతించి
చద్దులను నివేదన జేసి సంతసమున
సకల శుభములనందులే జగతి నేడు !
– డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ 94404 68557
ఇన్నాళ్లు పూలు దేవుళ్లను అలంకరిస్తే ఇప్పుడు
దేవతలే పూలను అలంకరిస్తున్నాయి
ఎక్కడా లేని పండుగ ఈ నేల మీదనే చంద్రవంక
నవరాత్రులు నవరాగాలు అలలై పొంగే అనురాగాలు
ఆత్మీయ అనుబంధాలు మట్టిచేతుల బొడ్డెమ్మలు
వరుస వరుస అమరుల త్యాగాలెత్తి పాడుతూ
మంజీర నాదాలై దుందుభి దరువులై
వెండివానలా పూలవానలు
చిరునవ్వుల చిన్నారి బతుకమ్మలు
కోరిన కోరికలు తీర్చే తల్లి బతుకునిలిపే తల్లి
ఇంటి దీపమై వెలిగే తల్లి కంటి వెలుగై కాపాడే తల్లి
చల్ల చల్లగా దీవించే తల్లి సద్దుల బతుకమ్మ తల్లి
పాల వెన్నెలలా పసిడి గౌరమ్మ
పూల సమ్మేళనం విరబూసిన వెన్నెల సమ్మేళనం
పండు మీది రామచిలుకలా
తీరొక్క పువ్వుల బాలనాగమ్మలు
ఊరూరు గుండెలుప్పొంగే
నింగి నేల పులకరించే బతుకమ్మ సంబురం
ఓ బతుకమ్మ తల్లి
నా పాలవెల్లి కల్పవల్లి
సిరులు కురిపించె తల్లి
తల్లివి నీవే తండ్రివి నీవే
తెలంగాణ తల్లివి నీవే !
– వనపట్ల సుబ్బయ్య 9492765358
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు
గడ్డి పూలూ గౌరమ్మలవుతాయి!
పూల పండగొస్తే చాలు
పుట్టినిండ్లన్నీ
ఆడ బిడ్డలతోన కొలువుదీరుతాయి!
ఆట విడుపన్నట్టు
అడవి పూలన్నీ పల్లెల్నీ పట్టణాలనీ
పూల తేరులను చేస్తాయి!
తలమీదెక్కిన బతుకమ్మ
పసుపు కుంకుమలిచ్చి
చల్లగా ఉండమని దీవిస్తది!
మన చేత ఆడించి పాడించి
ఇంటిల్లి పాదిని ఆనందాల్లో ముంచి
గంగమ్మ సిగలోన తారకై తరలి పోతది!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి 94402 33261
కొండల్లో కోనల్లో ఎండల్లో వానల్లో
మంచు బిందువుల ముత్యాల్లో
సుందరంగా వికసించిన
బంగారు రంగు తంగేడు పూలకు
బూరు బూరు గునుగు పూలకు
స్వాగతం ! సుస్వాగతం
పేర్చిన బతుకమ్మ గోపురములో
ఎన్నెన్ని పూలున్నా
వనం పూలే అందం చందం!
బొడ్డెమ్మ గుట్టలో
తంగేడు పూలు గునుగుపూలు
కనబడితేనే పండగ సార్థకం!
షోకుల్లేకుంటేనేం !అడవి పూలైతేనేం
తంగేడు గునుగు పూలకే రాణి కళ
రాచ మర్యాద !
స్వాగతం! సుస్వాగతం!!
అడవి పూలకు స్వాగతం!!
– కందాళై రాఘవాచార్య 87905 93638
పొక్కిలైన వాకిళ్లల్లా
కోటి వెలుగుల వెన్నెల అయితది
కూటికి లేని బతుకుల్లా
ఆత్మగౌరవ నినాదమైతది!!!
పల్లె పల్లెలో పండుగైతది
దండిగా పువ్వుల జాతరైతది
ఎండిన డొక్కల ఎతలను
అలసిన బతుకుల కథలను
రాగమెత్తి నినాదమై వినిపిస్తది!!!
పువ్వులను పూజించే సంస్కృతిని నేర్పుతది
పల్లెలను పసుపు వర్ణం చేస్తది
తల్లి లెక్క చెల్లి లెక్క ఆత్మీయ బంధం
తల్లిపేగు బంధమది
తంగేడు పూల మహత్యమది
– దేవులపల్లి రమేశ్ 9963701294
తీరొక్క పూలన్ని తోడవ్వగా
తీయందనాలతో అలరారుతూ
ఘనముగ గౌరమ్మ కొలువుదీరగా
పులకించె తెలంగాణ మది మురవగా
ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ
ఆడపడుచులంతా ఆడిపాడగా
పువ్వు పువ్వున పులకింత విరిసేను
పూలసింగిడై నేలమ్మ మురిసేను
పిల్లాజెల్లాలంతా పాలపుంతై మెరువగా
లోగిల్లన్ని ఆనందాల హరివిల్లయి విరియగా
బతుకమ్మ పాటలే బడుగుల బతుకుల్లో
బుగులు తీర్చే భరోసా గీతాలయ్యి మోగెను
తంగేడు పూలు పసుపు ధనమవ్వగా
సీతమ్మ జడలు సింగారాలె అవ్వగా
అల్లీ లిల్లీ పూలు అల్లారు ముద్దులయ్యేను
గోరంటలు కొండంత అండయ్యేను
బంతిపూలన్నీ బలగమై చేరగా
చేమంతులన్నీ శ్రీమంతులవ్వగా
గునుగుపూలతో కలిసి గుబాళించేను
గౌరమ్మతో కలిసి గంగమ్మను చేరేను
– అడప రాజు 91778 25265
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో- బంగారు బతుకమ్మ ఉయ్యాలో!!
పూలకొమ్మలు పిలువ ఉయ్యాలో- చెలి చేయి చిలుకమ్మ ఉయ్యాలో!!
గుమ్మడాకుల తీగె ఉయ్యాలో- మమ్ము తెంపనె పడుచు ఉయ్యాలో!!
పచ్చని చందమామ ఉయ్యాలో- పరచినా తపుకమ్మ ఉయ్యాలో!!
పెట్టేనమ్మ తంగెడు ఉయ్యాలో- పెయ్యీ నిండుగ నగలుయ్యాలో!!
దారిలో అడుగడుగు ఉయ్యాలో- దొరసాని కులుకమ్మ ఉయ్యాలో!!
గునుగు పూలను సూడు ఉయ్యాలో- గుసగుసలు చెవిలోన ఉయ్యాలో!!
కొసలంట మావదినె ఉయ్యాలో- వశపడని వణుకమ్మ ఉయ్యాలో!!
గన్నేరు పూవొకటి ఉయ్యాలో- కన్నెర్రజేసెనే ఉయ్యాలో!!
కని తెంపవేమంటు ఉయ్యాలో- కటువుగా పలుకమ్మ ఉయ్యాలో!!
రాసగుమ్మడి పూవు ఉయ్యాలో- రాణోలె కూసుంది ఉయ్యాలో!!
శిఖరాన మెరిసెనూ ఉయ్యాలో- శ్రీగౌరి తళుకమ్మ ఉయ్యాలో!!
– మడిపల్లి రాజ్‌కుమార్ 99496 99215
బతుకమ్మ అంటే..
బతుకును నేర్పిన ఉద్యమం
నాడు నీళ్లులేని తెలంగాణలో
క‘న్నీటి’ చెలిమె బతుకమ్మ
కాయకష్టంలో
ఆత్మీయ చెలిమి బతుకమ్మ
పని పాటల జమిలి
బతుకు పాటల బలిమి
చైతన్యపు కలిమి బతుకమ్మ
బతుకమ్మ అంటే.. తనను తాను తవ్వి పోసుకున్న పాట
తనకు తానై ఉవ్విళ్ళూరిన పాట
తనువెల్ల పల్లవించిన పాట
ఒక తలపోత.. ఒక వలపోత
విజయగాథల పూల పోత
పరిపరివిధాలా పరివ్యాప్తమైన
పల్లె పాట పడతుల ఆట
బతుకుపోరును పరిచిన
సామూహిక జీవన బాట
కోలాటాల సవ్వడిలో
సమైక్య సాధనా గీతిక
సమష్ఠి భావనాపతాక
తెలంగాణ అస్తిత్వ ప్రతీక
ప్రకృతి ఒడిలో పూదోట
ఆడపడుచుల సయ్యాట
కోటి గొంతుల బావుటా బతుకమ్మ..!
– కటుకోఝ్వల రమేష్ 99490 83327
ఊర సెరువులన్నీ నిండుకుండలైనయి
వాగులన్నీ పుడమితల్లిని ముద్దాడుతున్నయి
ఆకుపచ్చని సీరె ఆరేసినట్టు
తెలంగాణ మాగాణమంతా
పసిడి పంటల పండుగ
కనులారా కాంచడానికి బయలెళ్లింది
మాకు బతుకునిచ్చే బతుకమ్మ
తంగేడు పూలై పూస్తారు అక్కాచెల్లెళ్ళు
బంధాలను పెనవేస్తారు తోబుట్టువులు
ఇల్లంతా ఆనందాల జాతరలు
పిల్లలంతా కేరింతల ఆటలు
ఊరంతా పూల పండుగలు
పూలసెట్టుకు పూసిన పువ్వులోలే
అందమైన అనుబంధాల నెలవులు
నిండుగా నిండిన సెరువుల్లో
పాలపిట్ట తానమాడుతుంది
సుక్కలు ముగ్గులై ఇంటిముంగట
అందమైన రంగవల్లికలైతున్నయి
ప్రకృతి వెన్నెలై ప్రేమవర్షం కురిపిస్తుంది
పూలన్నీ బతుకమ్మ సిగలోదూరి
పూలదేవతలై పోవాలని పరితపిస్తయి
తెలంగాణ నేలంతా పూలవనమైతది
– అశోక్ గోనె 9441317361