షాపింగ్ మాల్కి వెళ్తాం.. నచ్చిన డ్రెస్ కొంటాం. ఇంటికి రాగానే ముచ్చటగా దాన్ని వేసుకుని ఫొటోలు దిగుతాం. కానీ, ఆ కొత్త దుస్తులను ఉతక్కుండా నేరుగా వేసుకోవడం వల్ల మీ చర్మానికి ఎంతటి ముప్పు ఉందో తెలుసా? ‘కొత్తవే కదా, శుభ్రంగానే ఉంటాయి’ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే! ఈ అలవాటు వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త దుస్తులు చూడటానికి అందంగా ఉండవచ్చు. కానీ, అవి మేనికి అంత మేలు చేయవు. మీ తనువు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం… కొత్త దుస్తులను ఒకసారి నీటిలో జాడించి వేసుకుంటేనే మంచిది.
ఫ్యాక్టరీ నుంచి సీల్డ్ ప్యాక్‌లో వస్తాయి కదా, అవి క్లీన్‌గానే ఉంటాయి కదా అని అందరి ఫీలింగ్. కానీ నిజం ఏంటంటే, టెక్స్టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లో చాలా స్టెప్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్‌కి కలర్ వేయడం, ఫినిషింగ్ కెమికల్స్ ఐప్లె చేయడం, స్టోరేజ్‌లో ఉంచడం, షిప్పింగ్ చేయడం, స్టోర్ షెల్ఫ్స్‌లో పెట్టడం.. ఈ ప్రతి దశలోనూ దుస్తులపై వివిధ రకాల సబ్స్టెన్సెస్ చేరవచ్చు. వాటిపై రసాయనాల అవశేషాలు ఉండవచ్చు. ఇవి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లకు ర్యాషెస్, ఇరిటేషన్, అలర్జిక్ రియాక్షన్స్‌కి కారణమయ్యే ప్రమాదం లేకపోలేదు. అలాగే, స్టోర్స్‌లో చాలామంది ఆ దుస్తులను ట్రై చేసి ఉండవచ్చు. అప్పుడు స్కిన్ సెల్స్, స్వెట్, బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది.
దుస్తుల తయారీలో రంగులు వెలిసిపోకుండా ఉండటానికి, ముడతలు రాకుండా ఉండటానికి ‘ఫార్మాల్డిహైడ్’ (Formaldehyde) వంటి రసాయనాలను వాడుతుంటారు.
అలర్ట్: ఉతక్కుండా వేసుకున్నప్పుడు ఈ కెమికల్స్ నేరుగా మీ చర్మానికి తగిలి ‘కాంటాక్ట్ డెర్మటైటిస్’ (చర్మం ఎర్రగా కందిపోవడం) వంటి సమస్యలకు దారితీస్తాయి.
మనం ఏదైనా డ్రెస్ కొనే ముందు దానిని ట్రయల్ చేయడం రివాజు. అలా ఎంతమంది దానిని ట్రయల్ చేశారో అస్సలు తెలియదు.
అలర్ట్: ఒకరికి ఉన్న చర్మ వ్యాధులు, చెమట ద్వారా వచ్చే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఆ దుస్తుల ద్వారా మీకు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గజ్జి (Scabies) వంటి వ్యాధులు ఇలాగే త్వరగా వ్యాపిస్తాయి.

కొత్త దుస్తుల రంగులు అంటుకుంటే కూడా అలర్జీలు రావొచ్చు.
అలర్ట్: సింథటిక్ దుస్తుల విషయంలో ఈ ముప్పు ఇంకా ఎక్కువ. ఉతికినప్పుడు ఈ అదనపు రంగులన్నీ పోయి దుస్తులు సురక్షితంగా మారుతాయి.
ఫ్యాక్టరీ నుంచి షోరూమ్‌కి వచ్చే వరకు దుస్తులు ఎన్నో చేతులు మారుతాయి.
అలర్ట్: దుమ్ము, ధూళి మాత్రమే కాకుండా నిల్వ ఉంచే గిడ్డంగులలో ఎలుకలు, పురుగులు తిరిగే అవకాశం కూడా ఉంది.
వాటినైతే కచ్చితంగా ఉతకాలి: లో దుస్తులు, టీషర్ట్ట్ పసిపిల్లల దుస్తుల విషయంలో అస్సలు రిస్క్ తీసుకోవద్దు. కచ్చితంగా ఉతికే వాడాలి.
వెనిగర్ టిప్: కొత్త దుస్తులు ఉతికేటప్పుడు నీళ్లలో కొంచెం వెనిగర్ వేస్తే కెమికల్స్ తొలగిపోతాయి. అదే సమయంలో దుస్తుల రంగులు పోకుండా ఉంటాయి.
ఎండలో ఆరబెట్టండి: ఉతికిన తర్వాత దుస్తులు ఎండలో ఆరబెట్టడం వల్ల బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది.
అవి చదవండి: దుస్తులపై ఉండే వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఫ్యాబ్రిక్ కంటెంట్, కేర్ సింబల్స్ గురించి తెలుసుకోండి. మొదటి వాషింగ్‌కి మైల్డ్ డిటర్జెంట్ వాడండి. కోల్డ్ వాటర్‌లో వాషింగ్ చేయడం మంచిది. ఇది కలర్ ఫేడింగ్ని తగ్గిస్తుంది.