ఒక్కసారి ఊహించుకోండి. మీ వాహనం రివ్వున హైవే మీద దూసుకుపోతూ ఉంటుంది. మీరేమో క్వీన్ సైజ్ కాట్ మీద కింగ్‌లా రిలాక్స్ అవుతూ నెట్‌ఫ్లిక్స్‌లో ఏదో వెబ్ సిరీస్ చూస్తుంటారు. మధ్యమధ్యలో ఫ్రిజ్‌లోంచి కోక్ బాటిల్ తీసి.. గొంతు తడుపుకొంటారు. అక్కడే ఉన్న కోడిగుడ్లను చూడగానే వేడివేడిగా ఆమ్లెట్ వేసుకోవాలనే ఐడియా వస్తుంది.
మినియేచర్ కిచెన్ పుణ్యమాని ఆ ముచ్చటా తీరిపోతుంది. షవర్ కింద జల్లుల స్నానం చేయాలనుకుంటే.. ఆ వసతీ ఉంటుంది. ఇలాంటి సకల సౌకర్యాలూ ఉన్న వాహనాలను సినిమా వాళ్లు కారవాన్ అని సంబోధిస్తారు.
టూరిస్టుల పరిభాషలో ఇవి రిక్రియేషనల్ వెహికిల్స్. వీటిని అద్దెకు ఇచ్చే కంపెనీలూ వచ్చేశాయి. రోజుకు ఏడున్నరవేల నుంచి అద్దెలు మొదలవుతాయి. సేవలు పెరిగేకొద్దీ ధరలూ మారతాయి. ఎంతమంది ప్రయాణిస్తున్నాం అన్నదీ ముఖ్యమే.