నిలువెత్తు గుట్టలు ప్రమాదకరమైనవి. ప్రమాదకరమైనవే సాహస క్రీడలకు అనువైనవి. వందల అడుగులు నిట్ట నిలువుగా ఉండే భువనగిరి గుట్ట అనేక సాహస క్రీడల సాధనకు వేదిక. ఒక్కమాటలో చెప్పాలంటే భువనగిరి గుట్ట సాహస క్రీడలకు అడ్డా! ప్రపంచంలో ఎత్తయిన పర్వతాలు ఎక్కాలంటే ఇక్కడే సాధన మొదలుపెట్టాలి. ఇక్కడ ఫిట్ అయితేనే అక్కడ సక్సెస్! ఇది సెంటిమెంట్ కాదు. సాహస యాత్రికుల సక్సెస్ రేట్. వేలాది మంది సాహసికుల్ని, వందలమంది హిమాలయ పర్వతారోహకుల్ని తీర్చిదిద్దిన కీర్తి కూడా గుట్టంత ఎత్తయినది!

భువనగిరి హైదరాబాద్‌కు 40 కిలో మీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు. ఉప్పల్ నుంచి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు కూడా ఉన్నాయి. గంటలో భువనగిరి చేరుకోవచ్చు. హన్మకొండ, వరంగల్, చౌటుప్పల్, జనగామ, ఘట్కేసర్ నుంచి బస్సు సదుపాయం ఉంది.

భువనగిరి గుట్టంత ఎత్తయిన ఏకశిలా పర్వతం తెలంగాణలో మరోటి లేదు. 600 అడుగుల ఎత్తున్న ఈ గుట్ట సుదూరంలో ఉన్న వారినీ చూపు తిప్పుకోనివ్వదు. ఎత్తే కాదు దీని రూపమూ వైవిధ్యమే! ఈ గుట్టని దక్షిణ దిక్కు నుంచి చూస్తే తాబేలులా కనిపిస్తుంది. పడమటి దిక్కు నుంచి చూస్తే నిద్రపోతున్న ఏనుగులా కనువిందు చేస్తుంది. ఇక గుట్టపైకి ఎక్కి చూస్తే అందమైన అంతఃపుర ఆనవాళ్లు అలరిస్తాయి. ఈ కొండపై కోట, కోట గోడను పశ్చిమ చాళుక్య రాజు ఆరో త్రిభువనమల్ల విక్రమాదిత్య పాలనలో నిర్మించారు. రాజ్యాలు అంతరించి, కోట శిథిలమైపోయింది. భువనగిరి కోట రాచరిక వైభవం కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు ఈ ఎత్తయిన రాతి గుట్ట సాహస క్రీడలకు ఆలవాలమై కళకళలాడుతున్నది.

బలమైన తాడుని ఆసరాగా చేసుకుని గుట్టను పైకి ఎక్కే రాక్ ైక్లెంబింగ్ సాధన చేసేవాళ్లు, అదే రాక్ ైక్లెంబింగ్ని వ్యతిరేక దిశలో పై నుంచి కిందకు సాధన చేసే సాధకులతో గుట్టపైన వారాంతాల్లో సందడి కనిపిస్తుంటుంది. దాదాపు 150 నుంచి 300 అడుగుల ఎత్తున చేసే ఈ సాహస క్రీడలను చూసేందుకు కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. సాహస క్రీడల్లో ఆరితేరాలని ఆసక్తి ఉన్నవాళ్లకు తెలంగాణ పర్యాటక శాఖ, ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ ైక్లెంబింగ్ (టార్క్) రాక్ ైక్లెంబింగ్, ర్యాపెలింగ్, ట్రెక్కింగ్, జిప్‌లైన్, హైకింగ్‌లో శిక్షణ ఇస్తున్నాయి. చిన్నారుల నుంచి నడి వయసు వారి వరకు ఈ క్రీడలలో శిక్షణ పొందొచ్చు. సాహస క్రీడల్లో శిక్షణే కాదు సాధన చేసే వారికీ భువనగిరి గుట్టే సరైన చిరునామా. ఎత్తయిన పర్వతాలు అధిరోహించాలని కలలు కనేవారు సైతం ఇక్కడ సాధన చేస్తున్నారు.

భువనగిరి గుట్ట పర్వతారోహకులు ఎందరినో ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. మరెందరో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. చిన్న వయసు (13 సంవత్సరాల 11 నెలలు)లో ఎవరెస్ట్‌ను అధిరోహించిన మలావత్ పూర్ణ, సాధనాల ఆనంద్ ఇక్కడే శిక్షణ పొందారు. పర్వతారోహకురాలు అన్వితారెడ్డి ఇక్కడే సాధన చేసి ఎవరెస్ట్తోపాటు ఆరు ఖండాల్లో అత్యంత ఎత్తయిన ఆరు పర్వతాలను అధిరోహించారు. భువనగిరి గుట్టపై పర్వతారోహణ శిక్షణపొందిన

98 మంది పర్వతారోహకులు విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. వందమందికి పైగా పర్వతారోహకులు ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతం ఎక్కారు. ఇప్పటి వరకు ఇక్కడ 50వేల మంది వరకు విద్యార్థులు శిక్షణ పొందారు. 300 ఫీట్ల ర్యాపెలింగ్ను 10వేల మంది ఔత్సాహికులు విజయవంతంగా పూర్తి చేశారు. అమెరికా, రష్యా, కెనడా, ఇంగ్లండ్ మొదలైన దేశాల పర్వతారోహకులు సైతంసాధన చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు.

పర్వతాలు ఎక్కడానికే కాదు చీకట్లలో సంచరించడానికీ ధైర్యం ఉండాలి. జామురాతిరి జాలీ అనుభూతి కోసం ఇక్కడ క్యాంపింగ్ కూడా నిర్వహిస్తున్నారు. గుట్ట కింద ఉన్న క్యాంపింగ్‌కు సందర్శకులు సాయంత్రం చేరుకుంటారు. రాత్రంతా గుడారాల్లో గడుపుతారు. ఈ గుడారాల మధ్య క్యాంప్ ఫైర్ (చలిమంట) వేస్తారు. సంగీతం వాయిస్తూ, పాటలు పాడుతూ, డాన్స్‌లు చేస్తూ రాత్రంతా సరదాగా గడుపుతారు. పొద్దున్నే లేచి కొండ మెట్లు ఎక్కుతూ గుట్టపైకి చేరుకుంటారు. ఎత్తయిన గుట్టపై నుంచి ఉదయభానుడి వెలుగు రేఖలను ఆస్వాదిస్తూ గడుపుతారు. అనంతరం అక్కడి నుంచి ర్యాపెలింగ్ (గుట్టపై నుంచి కిందికి తాడు సాయంతో దిగడం) షురూ చేస్తారు. ఒక్క రోజైనా సాహసం చేయాలనే కోరిక ఉంటే భువనగిరి కొండకు బయలుదేరండి!

భువనగిరి కొండపై ఉదయం, సాయంత్రాల్లో పర్వతారోహణంపై ప్రాథమిక శిక్షణ పొందేవాళ్లు, పర్వతారోహణ కోసం కఠోర సాధన చేసేవాళ్లు కనిపిస్తారు. 12 నుంచి 15 ఏండ్ల పిల్లల కోసం నాలుగు రోజుల అడ్వెంచర్ కోర్స్, ఐదు రోజుల బేసిక్ రాక్ ైక్లెంబింగ్, నాలుగు రోజుల అడ్వాన్స్డ్ రాక్ ైక్లెంబింగ్ ఉన్నాయి. ఒకటి, రెండు రోజులే శిక్షణ ఇచ్చే వీకెండ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని శిక్షకుడు ఆనంద్ చెప్పారు. ఇక్కడ శిక్షణ పొందేందుకు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. శిక్షణ సమయంలోఅడ్వెంచర్ క్రీడలకు కావాల్సిన సదుపాయాలన్నీ శిక్షణా అకాడమీ సమకూరుస్తుంది. ప్రమాద సమయాల్లో సురక్షితంగా బయటపడేందుకు అవసరమైన భద్రత కూడా సంస్థే చూసుకుంటుంది. ఆత్మైస్థెర్యం పెంపొందించడం, సవాళ్లను స్వీకరించే మనస్తత్వం పెంచేందుకు సాహస క్రీడల సాధన దోహదపడుతుందని చాలామంది శిక్షణ కోసం వస్తున్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ కూడా ప్రదానం చేస్తారు.
– పున్న శ్రీకాంత్ ఫొటోలు: గుజ్జ నరేశ్, యాదాద్రి భువనగిరి