పొద్దుపోయాక నిద్ర ఆపాలన్నా, నిద్ర లేచాక పొద్దుపోవాలన్నా టీ ఉండాల్సిందే. అసలు ఈ పానీయానికి పొద్దనే హద్దే ఉండదు. కెటిల్లో చాయ్ తెర్లుతుంటే మనసు దానిమీదకే మర్లుతుంది. మనం అంత ఇష్టంగా తాగే చాయ్‌కి చలికాలపు ఫ్యాషన్‌లోనూ చోటు దక్కింది. టీపాట్-టీకప్ జువెలరీ ఇప్పుడు గరమ్‌గరమ్ ట్రెండ్. టీ.. చాలా మందికి ఓ ఎమోషన్. రోజువారీ ఎమోషన్లన్నీ పద్ధతిగా ఉండాలంటే ముందు ఈ ఎమోషన్ సాటిస్ఫై అవ్వాల్సిందే. అంతెందుకు, ఉడుకు చాయ్‌ని రోజంతా తాగుతూ తాగుబోతులుగా పేరు పొందిన వాళ్లు ప్రతి సర్కిల్లోనూ మనకు కనిపిస్తుంటారు. వాళ్లకు ఉష్ణోదకంతో ఉన్న అనుబంధం అలాంటిది మరి! మర్యాదకు మారుపేరు కూడా చాయే.
చాయ్కప్పు చేతిలో పెడితేనే చుట్టాన్ని ఆర్సుకున్నట్టు అర్థం. మన మధ్య అంత ఫేమస్ అయిన టీ ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం పక్కకు కూర్చుంటుందా? గదిని దాటే ఘుమఘుమల వాసనలాగే అక్కడా అల్లుకుపోయింది. లోలాకులు, ఉంగరాలు, లాకెట్లు… ఇలా నగలన్నిటిలో తనదైన మార్కు కనబరుస్తున్నది. వీటిలో ఒక చెవికి టీ పాట్ వేలాడితే, మరో దానికి టీ కప్ కనిపిస్తుంది. పేరుకు మిస్‌మ్యాచ్ రకంలోవే అయినా ఒకదానికొకటి మ్యాచింగ్ అన్న భావన కలిగించే వెరైటీ జుంకాలు రూపొందుతున్నాయి. పాట్ నుంచి కప్పులోకి టీ వంపుతున్నట్టుగా కనిపించే అంగుళీకాలూ ఆకట్టుకుంటున్నాయి. మెడలో వేలాడే కప్పులు, కెటిళ్లు… రాళ్లూ, ఎనామిల్ సొగసుల్ని సంతరించుకుంటున్నాయి.