తియ్యగా పుల్లగా ఉండే మామిడి పండును… కొత్తగా అందంగా ఉండే ఫ్యాషన్‌కు జోడించడం అంటే సమ్మర్‌ను ట్రెండీగా చేయడమే. ఆవకాయ ముద్ద పప్పులా ఈ జోడీ కూడా సూపర్‌హిట్టే అనేది ఫ్యాషనిస్టుల ఉవాచ.
ఎందుకంటే, మామిడాకులు వేడుకను సూచిస్తే… మామిడి పండు వేసవి సెలవుల్ని గుర్తుకు తెస్తుంది. రెండూ సంతోషమే… ఈ ట్రెండూ ఆ కోవదే! మామిడి పిందెలదీ మహిళల నగలదీ తాతలనాటి చుట్టరికం. కంటె నుంచీ కాసుల పేరు దాకా అన్నీ వీటికి వరసైనవే. ఒకచోట నిండుగా, ఒక చోట నాజూగ్గా… ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఒదిగి… బంగారానికి చేరువయ్యాయి. మగువల సింగారంలో భాగమయ్యాయి. అక్కడితో ఆగిపోకుండా అప్పుడప్పుడూ దుస్తుల మీదా తమ ముద్రను వేశాయి. ఆ బంధాన్ని ముందుకు తీసుకువెళుతూ నగలూ, దుస్తులూ, యాక్సెసరీలకు మామిడి పండ్లను జత చేశారు ఫ్యాషనిస్టులు. ఇంకేం, పిందె నుంచి పండు దాకా రంగూ, రుచీ మారినట్టే… వీటికీ కొత్తదనం వచ్చింది.
అన్నింటి మీదా…
మ్యాంగో ఫ్యాషన్ అన్నది… హాలిడే మూడ్‌ను తెలిపేలా దుస్తుల మీద మెరుస్తున్నది. తియ్యగా పుల్లగా ఉండే మామిడి పండు దీంతో కొత్త అందాన్ని సంతరించుకుంటున్నది. డ్రెస్‌లు, షర్టులు, చీరలు… ఇలా అన్నింటి మీదా ఇప్పుడు నిండైన రంగుల్లో ఈ పండ్లు మెరుస్తున్నాయి. మామిడి ఆకులతో పాటు కోయిలలు కూడా కనిపించేవీ ఇందులో ఉంటున్నాయి. టీ షర్టుల మీదైతే, ‘మీ అందరికీ నచ్చడానికి నేనేం మామిడి పండును కాదు..’ తరహాలో ఫలరాజు ప్రత్యేకతను తెలిపేలా రకరకాల కోట్స్ ఉంటున్నాయి. ఇక, ఎనామిల్, మట్టి నగల్లోనూ మామిడి పండు సొగసులీనుతున్నది. బ్యాగులు, పర్సులు, చెప్పులు… ఇలా రకరకాల యాక్సెసరీలూ మామిడి ముద్రలతో అందంగా ముస్తాబవుతున్నాయి. అటు సీజన్.. ఇటు ఫ్యూజన్… ఇంకేం… మామిడి ప్రియులంతా ఈ మ్యాంగో ఫ్యాషన్‌ని తెగ ఇష్టపడుతున్నారట. మొత్తానికి పిందె పండయ్యింది.. అందం మెండయ్యింది.. ఏమంటారు?!