ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ పరిశోధన కోసం 37 నుంచి 66 సంవత్సరాల వయసు గల 93 మంది మహిళా ఆరోగ్య కార్యకర్తలను ఎంచుకున్నారు. వీరిలో 47 మంది పగటిపూట మాత్రమే పనిచేసేవారు కాగా, 46 మంది రాత్రి ఫిఫ్ట్ ఉద్యోగులు. పరిశోధకులు వీరందరి రక్త నమూనాలను సేకరించి.. సర్కాడియన్ జన్యువుల పనితీరును విశ్లేషించారు. పగటిపూట పనిచేసేవారితో పోలిస్తే.. రాత్రి షిఫ్ట్ చేసేవారిలో జన్యువుల క్రియాశీలత చాలా తక్కువగా ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తించారు.
అందులోనూ చాలా ఏండ్లుగా రాత్రి విధులు నిర్వహిస్తున్నవారిలో ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపించాయట. దీంతోపాటు రాత్రి షిఫ్ట్ చేసేవారిలో నిద్ర సంతృప్తి కూడా చాలా తక్కువగా, 54 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. మానవ శరీరంలో ఉండే సర్కాడియన్ రిథమ్స్.. హార్మోన్ల విడుదల, రోగనిరోధక శక్తి, జీవక్రియలను బాహ్య వాతావరణానికి అనుగుణంగా నియంత్రిస్తాయి. అయితే, నిరంతరంగా రాత్రి సమయాల్లో పనిచేయడం వల్ల ఈ సహజసిద్ధమైన లయ దెబ్బతింటుంది. ముఖ్యంగా, మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ జీవగడియారపు అంతరాయం వల్ల జీవక్రియ, గుండె జబ్బులు, రోగనిరోధక శక్తి తగ్గడం, క్యాన్సర్ వంటి ముప్పులు పెరుగుతాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఇప్పటికే హెచ్చరించింది కూడా! కాబట్టి, నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలనీ సూచిస్తున్నారు.