ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి ఆలోచించే అమ్మ.. తన ఆరోగ్యాన్ని మాత్రం చాలాసార్లు పట్టించుకోదు. సమయానికి భోజనం చేయకపోవడం, విశ్రాంతి తీసుకోకపోవడం, చిన్న చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయడం చాలా మంది మహిళల్లో కనిపించే విషయం. అందుకే ఈ మదర్స్ డే రోజున అమ్మకు ఆరోగ్యానికి సంబంధించిన కానుక ఇచ్చి ఇంటిల్లిపాదినీ ఆనందంగా ఉంచుదాం.
40 ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో బీపీ, షుగర్, థైరాయిడ్ ఎముకల బలహీనత, విటమిన్ లోపాలు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే ఫుల్ బాడీ చెకప్ ప్యాకేజీని బహుమతిగా ఇవ్వడం మంచి ఆలోచన. తన ఆరోగ్యం పట్ల మనం చూపే శ్రద్ధ ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాదు సమస్యల్ని ఆదిలోనే అరికట్టడానికి ఇది మంచి మార్గం కూడా.
ఇప్పటి మార్కెట్లో స్మార్ట్ వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్లు, స్టెప్ కౌంటర్లు వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి రోజువారీ నడక, హార్ట్ రేట్, నిద్ర సమయం వంటి వివరాలను ట్రాక్ చేస్తాయి. ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి.
మానసిక ప్రశాంతత కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. యోగా మ్యాట్, సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులు, మెడిటేషన్ మ్యూజిక్ సెట్ వంటి కానుకలు అమ్మకు రిలాక్సేషన్ అందిస్తాయి. ప్రతిరోజూ కొద్దిసేపు యోగా లేదా ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గి శరీరానికి ఉత్సాహం పెరుగుతుంది.
హెల్తీఫుడ్ హ్యాంపర్స్ డ్రై ఫ్రూట్స్, మిల్లెట్లు, హెర్బల్ టీలు, షుగర్ ఫ్రీ స్నాక్స్‌తో తయారైన హెల్త్ హ్యాంపర్ల లాంటివి కూడా మంచి కానుకలే. నీ ఆరోగ్యం మాకు ముఖ్యం అనే సందేశాన్ని ఇవి అందంగా తెలియజేస్తాయి.
రోజంతా కుటుంబం కోసం పరుగులు తీసే అమ్మకు ఒక రోజు పూర్తిగా విశ్రాంతి ఇవ్వండి. ఆమెకు ఇష్టమైన పనులు చేయడానికి వీలు కల్పించండి. మంచి నిద్ర, ప్రశాంతమైన సమయం కూడా నిజంగా ఇవ్వదగ్గ బహుమతులే.