ఊలుతో స్వెటర్లు,జాకెట్లు, గ్లౌజులు అల్లుతారనే మనకు తెలుసు. ఇప్పుడు అందమైన ఆభరణాలనూ ఆ జాబితాలో చేర్చారు జువెలరీ డిజైనర్లు. కంఠాభరణాలు, బ్రేస్లెట్లు, జుంకాలు, వడ్డాణాలు.. ఒక్కటేమిటి ఆపాదమస్తకం అలంకరించుకునేందుకు వీలుగా రోప్ జువెలరీ మార్కెట్లోకి వచ్చింది.
రంగురంగుల రాళ్లు, ముత్యాలు, లోహపు రింగులు జతచేసిన రోప్ జువెలరీ ప్రస్తుతం హల్చల్ చేస్తున్నది. మరింత మెరుపు కోసం నైలాన్, సిల్క్ దారాలతో అల్లిన నగల్ని ఎంచుకోవచ్చు. రెండు మూడు తాళ్లను అందంగా ముడేసి ఆభరణాలుగా మలుస్తున్నారు తయారీదారులు. భిన్నవర్ణాలు మేళవించినవీ ఉన్నాయి.
నైపుణ్యం, సృజన ఉంటే ఇంట్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. యూట్యూబ్ వంటి మాధ్యమాలలో ‘డూ ఇట్ యువర్సెల్ఫ్’ వీడియోలు పుష్కలం. మరింత ఆకర్షణ కోసం లోహపు పెండెంట్లను జతచేసుకోవచ్చు. ఆభరణాలకు నప్పే రంగులతో చేతి పర్సులు కూడా లభిస్తున్నాయి. జడ అల్లికలు, పీటముళ్లు, మెలికలు.. ఒక్కో ఆభరణానికి ఓ శైలి. ఊలు, పత్తి, నైలాన్, జనపనార.. తాళ్లతో తయారైన నగలకు మంచి మార్కెట్ ఉంది. సంప్రదాయ, వెస్ట్రన్ ఫ్యాషన్‌పై చక్కగా నప్పుతాయి.