నైపుణ్యమే విజయం. నైపుణ్యమే జీవన మార్గం. నైపుణ్యంతోనే మహిళలు సాధికారత సాధించగలరని బలంగా నమ్ముతారామె. కాబట్టే, ఉపాధి అవకాశాలున్న కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. యాభై ఐదు కోర్సులలో దేన్నయినా ఎంచుకోవచ్చు. నైపుణ్యం సాధించవచ్చు. వ్యాపారమూ ప్రారంభించవచ్చు. ఆ ప్రయత్నంలో హూనార్ సీయీవో నిష్ఠా యోగేశ్ అండగా ఉంటారు.
ఆన్లైన్లో ఎన్నో కోర్సులు ఉన్నాయి. కానీ ఆ శిక్షణలో సందేహ నివృత్తి సందేహాస్పదమే. ఎంత నేర్చుకున్నామన్నది ఎవరూ పర్యవేక్షించరు. ఎక్కడ తప్పు చేస్తున్నామన్నదీ గుర్తించరు. సరిచేయడం సరేసరి. దీంతో, ప్రయత్నం మధ్యలోనే ఆగిపోతుంది. ఆ పరిమితిని గుర్తించారు నిష్ఠా యోగేశ్. ఆన్లైన్ విద్యలోని లోపాలను సాంకేతికతతో పరిష్కరించే ప్రయత్నం చేశారు. కాబట్టే, ఆమె స్థాపించిన హూనార్ సంస్థకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఫ్యాషన్, ఫుడ్, బ్యూటీ.. ఇలా యాభై ఐదు కోర్సులను అందిస్తున్నారామె. నిష్ఠ చిన్నప్పటి నుంచీ చదువుల్లో ఫస్ట్. పుస్తకాలు బాగా చదివేది. నాన్న స్టాక్ మార్కెట్ ట్రేడర్. స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు అమ్మ శిక్షణ ఇచ్చేది. నాన్న ద్వారా వ్యాపారాభిలాష, అమ్మ నుంచి మహిళా సాధికారత ఆమె ఆలోచనలో భాగం అయ్యాయి. నిష్ఠకు మ్యాథ్స్, ఫిజిక్స్ బాగా ఇష్టం. కెమిస్ట్రీ అంటేనే భయం. దీంతో ఇంటర్లో కామర్స్ తీసుకుని స్టేట్ టాపర్‌గా నిలిచింది. తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ చదివింది. దేశంలోనే అతిచిన్న వయసు చార్టర్డ్ అకౌంటెంట్‌గా గౌరవం అందుకుంది. ఆమెకు వ్యాపారం చేయాలని కోరిక. వ్యాపార నైపుణ్యం పెంచుకోవడానికి ఆంత్రప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్కు చిరునామా అయిన బాబ్సన్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివింది. పేద, మధ్య తరగతి మహిళల్లో ఉపాధి నైపుణ్యాలు పెంచేందుకు.. హూనార్ స్టార్టప్‌ను ఆరంభించింది.
అడుగడుగునా అండ..
హూనార్లో తక్కువ ఫీజుతో, తక్కువ కాల వ్యవధితో అపార ఉపాధి అవకాశాలున్న కోర్సులు అనేకం ఉన్నాయి. ఆ శిక్షణతో ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేకమంది సొంత వ్యాపారాలు మొదలుపెట్టారు. హూనార్ ఆన్లైన్ క్లాసులలో ప్రస్తుతం 45 వేల మంది మహిళలు పేరు నమోదు చేసుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, గుజరాతీ మాధ్యమాల్లో పాఠాలు చెబుతారు. ఏ పని నేర్చుకుంటే మంచి ఉపాధి దొరుకుతుంది? జీతాలు ఎలా ఉంటాయి? సొంత వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరం?.. తదితర సందేహాలను నివృత్తి చేసుకునేందుకు హూనార్ ఫ్యాకల్టీతో ఫోన్లో మాట్లాడవచ్చు. వాట్సాప్ చాట్ సౌకర్యమూ ఉంది. మన ఆసక్తికి తగిన విద్యను వాళ్లే సూచిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత వ్యాపారం ఆరంభించాలని అనుకుంటే.. బ్రాండింగ్, మార్కెటింగ్, జీఎస్టీ నంబర్, బిజినెస్ లైసెన్స్ మొదలైన విషయాల్లోనూ సలహాలు ఇస్తారు. ఇప్పటివరకూ ఆరువేల మందిని వ్యాపారంలోకి దించామని నిష్ఠా యోగేశ్ చెబుతున్నారు. హూనార్ కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. ఉద్యో
గాలకు, బ్యాంకు రుణాలకు ఇది పనికొస్తుంది.
తెలంగాణలో..
‘ఏడాది క్రితం వీహబ్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్ చేశాం. రామగుండం చుట్టుపక్కల ప్రాంతాల మహిళలకు తెలంగాణ ప్రభుత్వం హూనార్ ఆన్లైన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించింది. 120 మంది ఫ్యాషన్, జువెలరీ డిజైన్ కోర్సులు చేశారు. ఇప్పుడు వాళ్లంతా సొంత వ్యాపారాలు మొదలుపెట్టారు. వేడినీళ్లకు చన్నీళ్లు తోడైనట్టు భర్త జీతానికి తమ ఆదాయం తోడైతే.. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వవచ్చనే ఉద్దేశంతో గృహిణులూ ముందుకొస్తున్నారు. చార్మినార్ పరిసరాల్లోని ఓ మహిళ హూనార్ ఫ్యాషన్ కోర్సులో చేరింది. హూనార్ ఆమెకు ఫ్యాషన్ డిజైనర్ స్టార్టర్ కిట్ పంపింది. దానిని ఆమె తీసుకోలేదు. మరోసారి పంపారు. రెండోసారీ అదే జరిగింది. మూడు నాలుగుసార్లు పునరావృతమైన తర్వాత.. ఎందుకిలా జరుగుతున్నదని నిష్ఠ ఆమెకు ఫోన్ చేసింది. ఆ జవాబు తనను ఆలోచింపజేసింది.
‘మేడమ్! మాది ఉమ్మడి కుటుంబం. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అంటే ఇంట్లో ఒప్పుకోరు. ఎవరూ లేనప్పుడు మాత్రమే కిట్ పంపండి ప్లీజ్’ అని వేడుకొన్నది. అందరూ నిద్రపోయాక హూనార్లో వీడియో క్లాసులు వినేదా యువతి. ప్రతి మూడు క్లాసుల తర్వాత.. ప్రతి ఒక్కరూ తాము నేర్చుకున్నదంతా చేసి చూపించాలి. హూనార్కు ఆ ఫొటోలు పంపాలి. లేకపోతే క్లాసులు ఆపేస్తారు. కొన్నాళ్లకు ఆ యువతి విజయవంతంగా కోర్సు పూర్తిచేసింది. ఆర్డర్లు సంపాదించింది. పైసలూ సంపాదించింది. ఆ సంపాదన చూసి కుటుంబ సభ్యులూ ఆశ్చర్య పోయారు. ఇంట్లోనే ఉంటున్న తోడికోడళ్లు, మరదళ్లకు కూడా నేర్పిందామె. అందరూ కలిసి దుకాణం పెట్టారు. ఒకటా, రెండా.. హూనార్ అండతో మారిన జీవితాలు అనేకం.