బాల్యంలో జరిగే లైంగిక వేధింపులు కేవలం ఆ క్షణానికి పరిమితమయ్యే ఘటనలు కావు. ఇవి బాధితుల మనసుపై లోతైన గాయాలను మిగిల్చి, వారు పెరిగి పెద్దయి మహిళలుగా మారిన తర్వాత కూడా వారి వ్యక్తిగత, సామాజిక, వైవాహిక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. బాల్యంలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు తమ జీవితంలో ఎదుర్కొనే ప్రధాన సవాళ్లు అనేకం.
చైల్డ్ ట్రామా అనేది పెద్దయ్యాక రకరకాల మానసిక రుగ్మతలకు దారితీస్తుంది. గతంలోని చేదు జ్ఞాపకాలు తరచూ గుర్తొచ్చి భయాందోళనకు గురికావడం, ఫ్లాష్బ్యాక్స్ రావడం లేదా మానసికంగా స్తంభించిపోవడం జరుగుతుంది. నిరంతరం పీడించే విషాదం, భయం, సురక్షితం కాదనే భావన వారి రోజువారి జీవితాన్ని ఇబ్బందికి గురిచేస్తాయి. ‘నాలో ఏదో లోపం ఉంది’ లేదా ‘నాకు జరిగిన దానికి నేనే బాధ్యురాలిని’ అనే అనవసరమైన నేరభావన వారిని నిరంతరం వేధిస్తుంది.
అనుబంధంలో తడబాటు..
బాధితులలో అనుబంధాలను ఏర్పర్చుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్నతనంలోనే నమ్మినవారి చేతిలో మోసపోవడం వల్ల, పెద్దయ్యాక ఎవరినీ సులభంగా నమ్మలేకపోతారు. భాగస్వామితో శారీరక లేదా భావోద్వేగ సాన్నిహిత్యం పెంచుకోవడంలో భయం లేదా విరక్తి కలగవచ్చు. ఇతరులతో కలవడానికి భయపడి సామాజికంగా ఒంటరిగా ఉండిపోతారు. మానసిక ఆందోళన శారీరక రూపంలో కూడా బయటపడుతుంది. ఎటువంటి స్పష్టమైన వైద్య కారణం లేకుండా నడుము నొప్పులు, కడుపునొప్పి, లేదా పెల్విక్ పెయిన్ ఉండవచ్చు. తరచూ పీడకలలు రావడం, తీవ్రమైన నిద్రలేమి బాధిస్తాయి. నాడీ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం లేదా జీర్ణక్రియ సమస్యలు రావచ్చు. మనసులోని బాధను తట్టుకోలేక కొందరు తీవ్రమైన నిర్ణయాల వైపు మొగ్గుచూపుతారు. మానసిక వేదనను మర్చిపోవడానికి లేదా నిద్రపోవడానికి మద్యం లేదా మత్తు పదార్థాలకు అలవాటు పడే ప్రమాదం ఉంది. మానసిక నొప్పిని భరించలేక తమను తాము గాయపరచుకోవడం లేదా ఆత్మహత్య ఆలోచనలు రావడం జరుగుతుంది.
చికిత్సా మార్గాలు..
చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి సంపూర్ణ జీవితాన్ని గడపడం కచ్చితంగా సాధ్యమే. దానికి కొన్ని థెరపీలు ఉన్నాయి. ట్రామా-ఇన్ఫార్మ్డ్ థెరపీ, సైకోథెరపీ, సీబీటీ, ఈఎమ్డీఆర్ లాంటి విధానాలు బాధితులు ఆ జ్ఞాపకాల నుంచి బయటపడటానికి సాయపడతాయి. ఒకే రకమైన అనుభవాన్ని ఎదుర్కొన్న ఇతరులతో మాట్లాడటం వల్ల ఒంటరితనం తగ్గుతుంది. ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు నాడీ వ్యవస్థను శాంతపరచడంలో ఉపయోగపడతాయి.
కౌన్సెలింగ్ ఇలా..
బాల్యంలో వేధింపులకు గురై, ప్రస్తుతం పెద్దవారైన బాధితులకు కౌన్సెలింగ్ అందించే సమగ్ర ప్రక్రియ క్లినికల్/ట్రామా-ఇన్ఫార్మ్డ్ కోణంలో సాగుతుంది.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, హైదరాబాద్, 99854 28261