పుట్టుకతోనే చూపు తక్కువ. మసక చీకట్లలోనూ అక్షరాలు దిద్దింది. పాఠాలు చదివింది. తరగతులు పెరుగుతూ ఉంటే కంటిచూపు తగ్గుతూ పోయింది. చివరికి ఆమె చుట్టూ చిమ్మ చీకటి కమ్మేసింది. ఆ కారుచీకట్లో ఆత్మవిశ్వాసం వేగుచుక్కై ఆమెకు దారి చూపింది. డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సులెన్నో చదివింది. ఒక్క ఉద్యోగంతోనే ఆగిపోకుండా ఎన్నెన్నో కొలువులు చేసింది. డాక్టరేట్ సాధించింది! తెలంగాణలో సైకాలజీలో డాక్టరేట్ అందుకున్న మొదటి అంధురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. గోరంత వెలుగు కూడా చూడలేని ఈ ధీర ఎందరో అంధుల జీవితాల్లో అఖండ దీపం వెలిగిస్తున్నది. జీవన నైపుణ్యాలే వైకల్యాన్ని ఓడిస్తాయని చెబుతున్న డాక్టర్ పిల్లలమర్రి శాంతి ప్రస్థానం ఆమె మాటల్లోనే..
చిన్నప్పుడు కంటిచూపు ఇరవై శాతమే ఉండేది.
మా నాన్న డీటీపీ ఆపరేటర్. అమ్మ గృహిణి. ప్రత్యేకమైన పాఠశాలల గురించి వాళ్లకు తెలియదు. సాధారణ పాఠశాలలో చేర్పించారు. మా అక్కతో కలిసి స్కూల్‌కి వెళ్లేదాన్ని. ముందు వరుసలో కూర్చున్నా బ్లాక్ బోర్డ్ కనిపించీ, కనిపించనట్లుగా ఉండేది. చదివేటప్పుడు పుస్తకాన్ని కంటికి దగ్గరగా పెట్టుకునేదాన్ని. ఒక్కోసారి పుస్తకం మీద టార్చ్‌లైట్ వేసి చదివేదాన్ని. బడిలో నా తోటివాళ్లతో ఖోఖో, ఇతర ఆటలు ఆడాను. చాలాసార్లు కిందపడ్డాను. దెబ్బలు తాకించుకున్నాను. ఎవరూ సహకరించలేదు. నన్ను చూసి నవ్వేవారు. ఎన్నో అవమానాలు భరించాను. మూడో తరగతి నుంచి దారి సరిగా కనిపించక కింద పడేదాన్ని. రాత్రిపూట ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుంటే కుక్కలు వెంటపడేవి. ఒకసారి కుక్కను తొక్కాను. అది కరిచింది. అయినా భయపడి ట్యూషన్, స్కూల్ మానలేదు.

అంధకారంలోకి..
టెన్త్, ఇంటర్ పరీక్షలప్పుడు నాన్న ఎగ్జామ్ సెంటర్ వాళ్లకు లేఖ పంపేవారు. ‘మా అమ్మాయికి కంటి చూపు తక్కువగా ఉంది. తన సమస్యను అర్థం చేసుకుని కిటికీ పక్కన కూర్చునే అవకాశం ఇవ్వగలరు’ అని లేఖ రాసేవారు. వాళ్లు నా సమస్యను అర్థం చేసుకుని వెలుతురు ఎక్కువ ఉన్నచోటే కూర్చునే అవకాశం ఇచ్చేవారు. ఎగ్జామ్ సెంటర్లలోనూ కొన్ని ఇబ్బందులు పడ్డాను. అయినా పరీక్షలు బాగానే రాశాను. పాసయ్యాను. ఇంటర్మీడియెట్, డిగ్రీ కాలేజ్‌లో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. నా చదువుకు సహకరించారు. డిగ్రీ చదువుతున్నప్పుడు కంటిచూపు తగ్గుతూ పోయింది. హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. చివరికి చూపు పూర్తిగా పోయింది. అయినా పట్టుదలతో చదివాను. బీకామ్ పూర్తి చేశాను.
భయం నుంచి భవిష్యత్‌లోకి
కొన్నాళ్లకు అక్కకు పెండ్లి జరిగింది. తను అత్తగారింటికి వెళ్లిపోయింది. నా భవిష్యత్ గురించి ఆలోచిస్తే భయమయ్యేది. ఈ భయం నుంచి బయటపడేందుకు కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలని నిశ్చయించుకున్నాను. నా కాళ్ల మీద నేను నిలబడాలనుకున్నా. జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే క్రమంలో నన్ను నేను మార్చుకునే పనికి పూనుకున్నాను. ఎల్వీ ప్రసాద్ రిహాబిలిటేషన్ సెంటర్లో కంటిచూపు లేనివారికి కంప్యూటర్ శిక్షణ ఇస్తారని తెలిసింది. అందులో చేరి కంప్యూటర్‌తోపాటు స్టిక్ సాయంతో నడవడం నేర్చుకున్నాను. ఆ నడక నా నడతను మార్చింది. అప్పటి నుంచి సొంతంగా ప్రయాణిస్తున్నాను. ఎల్వీ ప్రసాద్ రిహాబిలిటేషన్ సెంటర్లో ఒక కామన్ కిచెన్ ఉండేది. అందులో మాలాంటి వాళ్లకు వంట గురించి అవగాహన కల్పిస్తారు. వాసన, స్పర్శ ద్వారా ఆహార పదార్థాలను గుర్తించడం నేర్పేవాళ్లు. స్టౌ మీద గిన్నెలు కరెక్ట్‌గా ఎలా పెట్టాలి? ఏ కూరగాయల్ని ఎలా కోయాలి? గరిట పరిమాణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆకారాన్ని బట్టి పాత్రలను గుర్తించడం, ఏ వంటకు ఏ పాత్ర ఉపయోగించాలో నేర్చుకున్నాం. స్టౌ ముట్టించడం, అది వెలిగిందీ, లేనిదీ తెలుసుకోవడం నేర్పించారు. నడకతోపాటు వంటలు నేర్చుకోవడం వల్ల ఎక్కడైనా ఇండిపెండెంట్‌గా బతకగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది.
మౌనంగా ఎదిగా
ఎన్వీ రెడ్డి విశ్వాస్ ట్రస్ట్ నడిపే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో చేరాను. ఇంటి నుంచి ఎవరి సాయం లేకుండా ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్లేదాన్ని. అంధులు కంప్యూటర్ ఉపయోగించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన జాస్ సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను. కంప్యూటర్ మీద పట్టు వచ్చాక ఏదైనా చేయగలననే కాన్ఫిడెన్స్ పెరిగింది. తర్వాత డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌లో చేరి మరిన్ని కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్నాను. ఆ సంస్థలో చేరకముందు అమాయకంగా ఉండే నేను పూర్తిగా మారిపోయాను. అందరిలా ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించాను. చిన్నప్పుడు పాటలు పాడాలని, నాటకాలు వేయాలని కోరికలు ఉండేవి. అవి తీరే అవకాశం ఎప్పుడూ రాలేదు. రెడ్డీస్ ఫౌండేషన్‌లో ఉన్నప్పుడు విజువల్లీ చాలెంజ్ డే (డిసెంబర్ 3) నాడు ‘మౌనంగానే ఎదగమని’ పాట పాడాను. తర్వాత డ్రామాలు వేశాను.
నేను అనుకున్నది చేశాననే సంతోషం నాకు చెప్పలేనంత ధైర్యాన్నిచ్చింది. రెడ్డీస్‌లో కంప్యూటర్ కోర్స్ చేశాక ఓ బీపీవో కంపెనీకి సెలెక్ట్ అయ్యాను. కాల్ సెంటర్ జాబ్‌లో చేరాను. మూడు నెలల తర్వాత ఆ ఉద్యోగం మానేశాను. అంధ విద్యార్థులకు కంప్యూటర్స్ నేర్పడం కోసం శంషాబాద్‌లోని ‘నేత్ర విద్యాలయ’లో చేరాను. మా ఇంటి (ఈసీఐఎల్) నుంచి అక్కడికి 35 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రయాణం చేయలేక హాస్టల్లో ఉండి ఉద్యోగం చేశాను. నేత్ర విద్యాలయలో పని చేస్తూ ఇగ్నో ద్వారా డిస్టెన్స్‌లో ఎంఏ సైకాలజీలో చేరాను. ఏడాదికి ఉద్యోగం మానేశాను. బెంగళూరులోని మిత్రజ్యోతి సంస్థలో చేరాను. అక్కడ అంధులకు కంప్యూటర్ కోర్స్ నేర్పడంలో శిక్షణ పొందాను. అది అయిపోయాక ఇంటికి వచ్చాను.

చీకట్లను వెలిగించిన జ్వాల
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బోయిన్పల్లి (సికింద్రాబాద్)లో ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ విజువల్లీ డిజేబుల్’లో చేరాను. ఆ ఇన్స్టిట్యూట్లో పదిహేను బ్యాచ్‌లకు కంప్యూటర్స్ నేర్పాను. నా దగ్గర శిక్షణ పొందిన మూడు వందల మందిలో యాభై మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. విద్యార్థులకు కంప్యూటర్స్‌తోపాటు మెడిటేషన్, కమ్యునికేషన్ స్కిల్స్ కూడా నేర్పాను. ఇక్కడ ఉద్యోగంలో చేరిన వెంటనే సైకాలజీ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశాను. యూజీసీ నెట్ అర్హత పరీక్ష రాశాను. క్వాలిఫై కాలేదు. పట్టు వదలకుండా అయిదేళ్లు ప్రయత్నించాను. అన్నిసార్లూ విఫలమయ్యాను. ఈలోగా ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ వచ్చింది.
ఆ పరీక్ష రాసి క్వాలిఫై అయ్యాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ‘ఇన్ఫ్లూయెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ మెంటల్ హెల్త్ ఆన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్’ టాపిక్‌తో నా పరిశోధన మొదలుపెట్టాను. ప్రొఫెసర్ సరోజ ఆర్య మార్గదర్శకత్వంలో పరిశోధన చేస్తూనే యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యాను. పీహెచ్డీ పూర్తి చేశాను. డాక్టరేట్ సాధించాను. తెలంగాణలో సైకాలజీలో డాక్టరేట్ డిగ్రీ సాధించిన మొట్టమొదటి అంధురాలిని నేనే. యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరి పాఠాలు చెప్పాలన్నది నా కోరిక. కంప్యూటర్ నేర్చుకుని మా వాళ్లకు నేర్పాను. ఇప్పుడు అంధుల మనోవేదన అర్థం చేసుకొని మంచి దారి చూపగలను. మూడేళ్ల నుంచి ఎనభై ఏళ్ల వాళ్లకు ఫిజికల్, మెంటల్‌గా సపోర్ట్ చేయాలన్నది నా ఆశయం. దీన్ని నెరవేర్చే సంకల్పంతో ‘ఉజ్వల శక్తి’ అనే సేవా సంస్థను స్థాపించాను. ఇక నా జీవితం అంతా ఈ సంస్థకే అంకితం.
వైకల్యాన్ని ఓడించే నైపుణ్యం
పరిశోధన చేస్తూనే కొత్త జీవన నైపుణ్యాలు పెంచుకున్నాను. యోగా నేర్చుకున్నాను. ఆన్లైన్లో యోగా టీచర్ కోర్స్ చేశాను. ఇంపాక్ట్‌లో మోటివేషనల్ ట్రైనర్‌గా శిక్షణ పొందాను. నాగార్జున యూనివర్సిటీలో లైఫ్ స్కిల్స్‌లో ఆరు నెలల ఆన్లైన్ కోర్స్ చేశాను. ఎన్ఎల్పీ నేర్చుకున్నాను. హెల్త్ హీలర్గా సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. ఆన్లైన్లో యోగా, మెడిటేషన్ నేర్పిస్తున్నాను. సైకాలజీ కౌన్సెలింగ్ చేస్తున్నాను. జీవన నైపుణ్యాల ఎంతగా పెంచుకుంటే మన జీవితాన్ని అంత ప్రకాశవంతం చేస్తాయని నేను తెలుసుకున్నాను. నైపుణ్యాలు పెంచుకోండి. ఎలాంటి వైకల్యాన్నైనా ఓడిస్తారు. జీవితంలో గెలుస్తారు.
నాగవర్ధన్ రాయల
భాస్కర్