సాధికారత, సంపాదన విషయంలో మహిళ సాగించాల్సిన ప్రయాణం ఇంకా చాలానే ఉంది. అందులోనూ అసోంలాంటి మారుమూల ప్రాంతాల్లో వెనుకబాటుతనం మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. దీనికి తనవంతుగా పరిష్కారం చూపాలనుకున్నారు అలకనంద దాస్. తను గౌహతిలో పుట్టారు. తండ్రి రైల్వే అధికారి కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ సమాజాన్ని దగ్గర నుంచి చూశారు. స్కూల్ టీచర్‌గా, మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా కొంతకాలం పనిచేసినా తన లక్ష్యం ఎప్పుడూ గ్రామీణ మహిళలకు అండగా నిలబడటమే.
అందుకే TOGORR (Traditional Opportunities Growth of Rural Resources) అనే సంస్థను స్థాపించారు. చేనేత వస్ర్తాల రూపకల్పన, ఆభరణాల తయారీలో గ్రామీణ మహిళలను ప్రోత్సహించడమే కాదు.. వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమూ ఈ సంస్థ ఉద్దేశం. ఆ తర్వాత LOOMS పేరుతో మరో వేదికనూ నెలకొల్పారు. ఔత్సాహిక మహిళల కోసం వర్క్‌షాప్స్ నిర్వహిస్తారామె. వ్యాపార రుణాల మంజూరులో అండగా నిలుస్తున్నారు. ఉమెన్ ఎకనమిక్ ఫోరం వంటి వేదికల మీద గ్రామీణ మహిళల ప్రతిభను చాటే ప్రయత్నమూ చేస్తున్నారు.