మధువులొలికే అతివ అధరాలకు లేత గులాబీ రంగునో, నిండు కెంపు వర్ణాన్నో అద్ది.. అందమంటే ఇదే అంటే సరికాదు. అంతకు మించిన ఆకర్షణనుతీసుకొచ్చే వన్నెలూ అనేకం. నిండైన నీలాలు, ఊరించే ఊదాలు సెలెబ్రిటీలు మెచ్చిన అధరాలంకరణ వర్ణాలు. ఐశ్వర్యారాయ్, శృతిహాసన్, హీనా ఖాన్, సారా అలీఖాన్‌లాంటి అందగత్తెలంతా ఇలాంటి వన్నెలే అద్దుకుని విభిన్నంగా కనిపిస్తున్నారు.
ఇటీవలి కేన్స్ ఫిల్మ్ ఫెస్టి వల్లో వింతైన నీలి రంగు లిప్‌స్టిక్ ధరించి వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నటి ఊర్వశి రౌతేలా. అలా బ్లూ, పర్పుల్ లిప్‌స్టిక్ ట్రెండ్‌ను బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తీసుకెళ్లారు మనవాళ్లు. ఇంద్రనీలాలను కళ్లలోనే కాదు పెదవుల్లోనూ చమక్కుమనేలా చేస్తున్న ఈ రంగులు.. నేటితరం అమ్మాయిలకు బాగా నప్పుతాయనీ, దుస్తులకు సరిపోయేలా ఎంచుకుంటే సరిపోతుందనీ సలహా ఇస్తున్నారు ఫ్యాషనిస్టులు. అవును, ఇప్పుడు ఫంకీ లుక్ కావాలంటే.. నీలాల రంగును ముద్దాడాల్సిందే!