‘అనుకున్నామని జరగవు అన్నీ… అనుకోలేదని ఆగవు కొన్ని’ అని ఆత్రేయ అన్నట్టే చాలా సందర్భాల్లో అనుకున్నవి… అనుకున్నట్టుగా జరగవు. చిత్రమేమంటే అనుకోనివి అనుకోకుండా జరిగిపోతాయి. అలాంటివెన్నో జరిగిన ఈ అంతులేని ప్రపంచంలో ఇదో వింత. ఇది ఒక వేడి నీటి బుగ్గ! అగ్ని పర్వతం నుంచి లావా ఎగిసిపడ్డట్టు ఈ బుగ్గ నుంచి సలసల కాగే నీరు ఎగిసిపడుతూ ఉంటుంది! సాగు నీటి కోసం తవ్విన నాడు ఇది బువ్వ పెట్టలేదు. తరాల తర్వాత పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఆదాయం తెచ్చిపెడుతున్నది! ఆసక్తిగా కలిగించే ఈ ‘యాక్సిడెంటల్ బ్యూటీ’ గురించి తెలుసుకోవాల్సిందే!
అమెరికాలోని పశ్చిమ పర్వత రాష్ర్టాల్లో నెవాడా ఒకటి. వాయవ్య నెవాడాలో ‘వాలాపై ఫ్లాట్’ అనే లోయ వేడి నీటి బుగ్గలకు పుట్టిల్లు. అక్కడి వాళ్లు వీటిని గీజర్లని పిలుస్తారు! బాత్రూమ్లో వేడి నీళ్లను షవర్లోంచి కురిపించే గీజర్లలాగే ఇక్కడ వేడి నీళ్లు పైకి ఎగిసిపడతాయి! ఈ వేడినీటి బుగ్గల్లో ఫ్లై గీజర్ ప్రత్యేకమైనది. ఇది ప్రపంచ పర్యాటకాన్ని బాగా ఆకట్టుకుంటున్నది.
వందేళ్లకు పూర్వం.. బీడు భూమిని సాగులోకి తెచ్చేందుకు 1916లో ఓ రైతు ఇక్కడ బావి తవ్వించాడు. చిత్రంగా లోపలి నుంచి నీరు ఎగిసిపడింది. మోటారు ఎత్తిపోయకుండా, తోడకుండానే సహజంగా ఎగిసిపడే ఆ నీరు రైతుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. చేతులు కాలిపోయేంత వేడిగా ఉన్నాయవి! అంత వేడి నీటిలో ఏ మొక్క బతుకుతుంది? చేసేది లేక ఆ రైతు ఆ బావిని వదిలేశాడు. ఆ భూమి మీదా ఆశలు వదులుకున్నాడు.
నీటి ఊట కట్టిన కోట
దశాబ్దాలపాటు వేడి నీటి బుగ్గలోంచి పాతాళ గంగ పైపైకి వస్తూనే ఉంది. భూమిలో నీరు తగ్గ్గట్లేదు. ఎగిసిపడటమూ ఆగట్లేదు. కాలం గడుస్తున్నా కొద్దీ ఆ బావి రూపం మారుతున్నది. నీరు ఆవిరవుతున్నది. నీటిలోని సల్ఫర్, క్యాల్షియం, మెగ్నీషియం ఖనిజ లవణాలు బావి చుట్టూ దిబ్బలా పోగుపడ్డాయి. ఆ క్యాల్షియం కార్బొనేట్ బండలా మారిపోయింది.
యాక్సిడెంటల్ బ్యూటీ!
అరవై ఏళ్ల క్రితం.. ఈ వేడి నీటి బుగ్గ రహస్యం తెలుసుకునేందుకు జియో థర్మల్ కంపెనీ ఒకటి రంగంలోకి దిగింది. ఇంకా లోపలికి తవ్వితే ఇంకేదన్నా రహస్యం బయటపడుతుందేమో అనుకున్నారు. మొదట తవ్విన బావి (గీజర్)కి దగ్గర్లో వందల మీటర్ల లోతుకు బావి తవ్వారు. కానీ, అందులోంచీ వేడి నీళ్లే వచ్చాయి. ఆ నీళ్లు మరింత ఎత్తుకు ఎగిసిపడ్డాయి. కొత్తగా తెలుసుకునేది లేక, చేసేదేమీ లేక దాన్నీ.. అలాగే వదిలేశారు. రెండో బావి తవ్వడం వల్ల మొదటి బావిలో పీడనం తగ్గింది. కాబట్టి నీరు ఎగిసిపడటం తగ్గింది. దీంతో గడ్డకట్టిన ఖనిజాలతో ఏర్పడిన పన్నెండు అడుగుల దిబ్బ స్పష్టంగా బయటపడి కనువిందు చేయడం మొదలైంది. రెండోసారి తవ్విన చోటు నుంచి నీరు అయిదు మీటర్ల ఎత్తుకు ఎగిసిపడసాగింది. దీనిని చూసిన వాళ్లు ‘ఫ్లై గీజర్’గా పిలవడం మొదలుపెట్టారు! దీనిని‘యాక్సిడెంటల్ బ్యూటీ’ అని అభివర్ణించారు.
భలే చాన్సులే!
రెండో వేడి బుగ్గ ఫ్లై గీజర్ నీళ్లు చిమ్ముతూ ఉండటం వల్ల… మొదటి వేడి నీటి బుగ్గకు సమీపంలో ఏర్పడ్డ రాయిలాంటి నిర్మాణం ఎప్పుడూ తేమగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన వాతావరణాన్ని తట్టుకుని దానిపై దట్టంగా నాచు పెరిగింది. ఈ నాచు ఆ ఖనిజ లవణాల దిబ్బకు ఎరుపు, ఆకుపచ్చ రంగులు అద్దింది. సమీప ప్రాంతాల్లోనూ ఇలాంటి వేడి నీటి బుగ్గలు ఉన్నప్పటికీ.. ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. పన్నెండు అడుగుల ఎత్తున పెరిగి, రంగులు చేరి కనువిందుగా మారేసరికి ఫ్లై గీజర్‌కు పర్యాటక ప్రాధాన్యం ఏర్పడింది. ఒకప్పుడు జీవనాధారం కోసం తవ్విన బావి నాడు తిండి పెట్టలేదు. తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ భూమి మూడో తరానికి గొప్ప ఆదాయ వనరుగా మారింది. ఈ వింత దిబ్బను దగ్గరగా చూసేందుకు అనుమతించాలంటే కొద్ది మొత్తంలో డబ్బు చెల్లించాలని నిబంధన పెట్టారు. అలా వచ్చిన ఆదాయంతో ఆ భూ యజమానులు ఇప్పుడు హాయిగా రోజులు గడుపుతున్నారు.