‘ఉద్యోగమే మనిషి అస్తిత్వం కాదు. ఉద్యోగం ఆధారంగానే మనుషుల్ని గుర్తించకండి’ అంటున్న దివ్యా బన్సల్ గురించి అమెరికాలో పెద్ద చర్చే నడుస్తున్నది. దివ్య జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించింది. ఆమెకు జాబ్ వచ్చింది. ఆ సందర్భంగా న్యూయార్క్ వీధుల్లో నడుస్తూ తను పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. మంచి కెరీర్ని నిర్మించుకోవాలనే ఆశతో అమెరికాలో చదివేందుకు న్యూయార్క్ యూనివర్సిటీలో చేరిందామె.
గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారం రోజుల తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాదాపు 420 దరఖాస్తులు పంపింది. కేవలం మూడు సంస్థల నుంచే ఇంటర్వ్యూకి ఆహ్వానం వచ్చింది. చివరికి రెండు ఉద్యోగాలకు ఆఫర్ లెటర్ ఇచ్చారు. చివరికి ఒక ఉద్యోగంలో చేరింది. నేటి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో తెలియజెప్పే అనుభవం ఇది. ‘ఇప్పుడు ఉద్యోగం వచ్చినా ఇదే నా గుర్తింపు కావాలని కోరుకోవట్లేదు. ఉద్యోగం జీవితంలో ఒక భాగమే. వేతనం నా చెల్లింపులకు, ఎదుగుదలకు సహాయపడుతుంది.
నా జిమ్, డ్యాన్స్, వంట చేయడం, స్నేహితులు ఇవి కూడా ఉద్యోగంలాగే జీవితంలో ఉంటాయి. వాటన్నిటినీ పక్కనపెట్టి ఒక్క ఉద్యోగంతోనే మనిషిని గుర్తిస్తే ఎలా?’ అని ఆమె సంధించిన ప్రశ్న నెట్టింట వైరల్ అయింది. నిజమే కదా. జీవితం ఉద్యోగం చుట్టూ తిరగకూడదు. ఉద్యోగం.. జీవితం చుట్టూ తిరగాలన్న దివ్యా బన్సల్ మాటలు ఎందరినో ఆలోచింపజేశాయి. అందుకే నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.