సత్తుపల్లి, ఆగస్టు 29 : తీరొక్క జబ్బులతో ఆస్పత్రికి వచ్చే రోగులను ఆత్మీయంగా పలకరించడం.. వైద్య పరీక్షలు చేసి నిదానంగా వ్యాధి తీరును వివరించడం.. అవసరమైన పరీక్షలు చేయడం.. మందులు ఇవ్వడం.. ఇలా రోగి నాడిపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) అరుదైన అవార్డును దక్కించుకున్నది. అంతేకాదు.. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం.. ఇంటిని తలపించేలా వార్డులు ఉండడం.. ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించడం.. ప్రభుత్వం అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడం.. గర్భిణులకు సుఖప్రసవాలు అయ్యేలా చేయడం.. వైద్యులు, సిబ్బంది పనితీరు రోగిని ఆకట్టుకునేలా ఉండడం.. ఇలాంటి తీరొక్క అంశాన్ని క్షేత్రస్థాయిలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరిశీలించిన బృందం లంకాసాగర్ పీహెచ్సీని జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. కేంద్రం అవార్డుతోపాటు మూడేళ్లపాటు రూ.3 లక్షల చొప్పున నిధులను ఆస్పత్రి అభివృద్ధి కోసం ఇవ్వనున్నది.
పెనుబల్లి మండలం లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలకు ఎంపికైంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అంతర్జాతీయ, జాతీయ అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో కేంద్రం అవార్డును ప్రకటిస్తుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 9, 10 తేదీల్లో పర్యటించిన బృందం ఆస్పత్రిలో సౌకర్యాలు, సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉండడంతో ఎన్క్యూఏఎస్ అవార్డుకు సోమవారం ఎంపిక చేసింది. పీహెచ్సీకి ఎన్క్వాస్ ధ్రువీకరణ ఉందంటే అక్కడ రోగులకు అత్యుత్తమ సేవలు అందుతున్నట్లు లెక్క. జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల(నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్)ను చేరుకోవడంలో లంకాసాగర్ పీహెచ్సీ ముందంజలో ఉంది. ఆయా నియమ నిబంధనలు పాటించి.. అవార్డుకు ఎంపికై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేంద్రం మూడేళ్లపాటు రూ.3లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తుంది. ఏటా వచ్చే ఆ నిధులతో పీహెచ్సీలను బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
50 అంశాలు లెక్కింపు
కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలను చేరుకోవడం కోసం పీహెచ్సీల్లో అందుతున్న సేవలు, రోగుల హక్కులు, వసతులు, ఇన్ఫెక్షన్ నియంత్రణ, నాణ్యతా ప్రమాణాల నిర్వహణ, సేవల ఫలితాల తీరును కేంద్ర బృందం సభ్యులు సమీక్షిస్తారు. బయట రోగుల విభాగం, ఇన్ పేషెంట్ విభాగం, లేబర్ రూమ్, ల్యాబ్ సేవలు, జాతీయ ఆరోగ్య మిషన్, సాధారణ పరిపాలన ఎలా ఉన్నదనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. పరిశుభ్రత, కనీస వసతులు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయా.. సమాచార బోర్డులు, పచ్చదనం, ప్రహరీ, సిబ్బంది ప్రవర్తన, రోగుల సంతృప్తిని పరిగణనలోకి తీసుకుని 70 శాతం కంటే అధికంగా మార్కులు సాధించిన పీహెచ్సీలకు మాత్రమే ఎన్క్వాస్ సర్టిఫికెట్ అందిస్తారు. గర్భం, శిశు జననాల్లో జాగ్రత్తలు, శిశు ఆరోగ్య సంరక్షణ, బాల్యం, కౌమార ఆరోగ్య సంరక్షణ, కుటుంబ నియంత్రణ, గర్భనిరోధక సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతో సహా సంక్రమించే వ్యాధుల నివారణ, అంటువ్యాధుల నిర్వహణ, అవుట్ పేషెంట్ల సంరక్షణ, వ్యాధుల స్క్రీనింగ్ నివారణ, నియంత్రణ, నిర్వహణ విభాగాల్లో వంద శాతానికి 86.06 మార్కులు సాధించినందుకు ధ్రువీకరణ పత్రం అందించనున్న పీహెచ్సీ వైద్యుడు చింతా కిరణ్కుమార్ తెలిపారు. కాగా.. అవార్డు సాధించినందుకు పీహెచ్సీ వైద్యులు కిరణ్కుమార్, సౌమ్య, సిబ్బందికి డీఎంహెచ్వో మాలతి, డిప్యూటీ డీఎంహెచ్వో సీతారాం, ఎన్హెచ్ఎం ప్రోగాం ఆఫీసర్ నీలోహన అభినందనలు తెలిపారు.
రోగులకు ప్రత్యేక సేవలు
పీహెచ్సీలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇద్దరు వైద్యులు, 20 మంది ఏఎన్ఎంలు, 56 మంది ఆశా కార్యకర్తలు, ఐదుగురు సూపర్వైజర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది మరో 8 మంది అందుబాటులో ఉన్నారు. రోజుకు 50 మందికి పైగా అవుట్ పేషెంట్లు పరీక్షలు చేయించుకుంటారు. అన్ని రకాల రక్త పరీక్షలతోపాటు నెలనెలా ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సేవలందిస్తున్నారు. వీరితోపాటు గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. సుఖ ప్రసవాలు చేస్తూ కేసీఆర్ కిట్లు, నగదు అందిస్తూ భరోసా కల్పిస్తున్నారు.
అవార్డు రావడం హర్షణీయం
మా పీహెచ్సీకి ఎన్క్వాస్ అవార్డు రావడం హర్షణీయం. సిబ్బంది పనితీరు, గ్రామ నాయకులు, ప్రజల సహకారంతో అవార్డు సాధించాం. తమకు సహకరించిన డీఎంహెచ్వో మాలతి, డిప్యూటీ డీఎంహెచ్వో సీతారాములుకు ప్రత్యేక ధన్యవాదాలు. మున్ముందు మరిన్ని సేవలు అందించి ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తాం.
-చింతా కిరణ్కుమార్, వైద్యులు, లంకాసాగర్ పీహెచ్సీ
మాకు గర్వంగా ఉంది
మా గ్రామ పీహెచ్సీకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం హర్షణీయం. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో ఆస్పత్రి వాతావరణం, సౌకర్యాలు, వైద్యుల సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించడం గర్వంగా ఉంది. రాబోయే కాలంలో ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు అందుకుంటాం.
– మందడపు అశోక్, సర్పంచ్, లంకాసాగర్