చండ్రుగొండ, జూన్ 7 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామాన్ని ఎంపిక చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించింది. ఆ ఇండ్ల నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు బిల్లులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన బెండాలపాడ గ్రామంలో ప్రభుత్వం 310 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా.. వాటిలో ఇప్పటివరకు 161 ఇండ్ల నిర్మాణం పూర్తయింది.
వీటిలో గత ఏడాది సెప్టెంబర్ 3వ తేదీ నాటికి గ్రామంలో 25 ఇండ్లను సీఎం చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా.. చివరి నిమిషంలో కేవలం ఇద్దరు(బచ్చల నర్సమ్మ, బచ్చల రమణ) ఇండ్లను ప్రారంభించారు. అయితే ఆనాటి నుంచి ఇప్పటివరకు సీఎం ప్రారంభించిన రెండు ఇండ్లకు కూడా ఫైనల్ బిల్లు రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గూడు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇండ్ల బిల్లులు రాలేదని చెప్పడానికి సైతం లబ్ధిదారులు జంకుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి బిల్లు రాలేదని బయటకు చెబితే పూర్తిగా బిల్లులు రాకుండా చేస్తామని అధికార పార్టీ నాయకులు లబ్ధిదారులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇండ్లకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
మాది పైలెట్ గ్రామం కావంతో ఎక్కువ ఇండ్లు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి ప్రారంభించిన రెండు ఇండ్లకు ఎంబీలు పూర్తయ్యాయి. త్వరలోనే బిల్లులు వస్తాయి. ఇంకా నిర్మాణం పూర్తి కావాల్సిన ఇండ్లు చాలానే ఉన్నాయి. ఆఖరి బిల్లు మాత్రమే ఆలస్యం అవుతున్నాయి. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
-ఎన్.రోహిత్, పంచాయతీ కార్యదర్శి, బెండాలపాడు, చండ్రుగొండ మండలం
నాకు ఇప్పటివరకు రూ.3.40 లక్షలు వచ్చాయి. ఇంకా లక్షా అరవై వేల రూపాయల బిల్లులు రావాల్సి ఉంది. బిల్లులు సక్రమంగా రాక అప్పుల పాలయ్యాం. బయటకు చెబితే ఇంటిని రద్దు చేస్తామని బెదిరిస్తున్నరు. ఇంటిని కట్టిన మేస్త్రీలు, కూలీలకు ఇంకా డబ్బులు ఇవ్వాల్సి ఉంది. పూర్తి బిల్లు రాలేదు.
-కొడెం నాగమణి, లబ్ధిదారు, బెండాలపాడు, చండ్రుగొండ మండలం
నా ఇంటిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గత ఏడాది సెప్టెంబర్లో ప్రారంభించిండు. ఇంటి నిర్మాణం పూర్తయినా ఫైనల్ బిల్లు ఆలస్యమైంది. అది కూడా ఐదారు రోజుల క్రితం అకౌంట్లో పడ్డాయని నా కొడుకు చెప్పిండు. నా చేతికి మాత్రం డబ్బులు రాలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.
-బచ్చల నర్సమ్మ, లబ్ధిదారు, బెండాలపాడు, చండ్రుగొండ మండలం
ఇల్లు పూర్తి అయింది. ఆఖరి బిల్లు మాత్రం ఇంకా రాలేదు. వారంలో వస్తదని అధికారులు చెబుతున్నారు. కానీ, ఇంకా అకౌంట్లో డబ్బులు పడలేదు. ఎన్ని వారాలు ఎదురుచూడాలో అర్థం కావడం లేదు. ఇది నా ఒక్కరి పరిస్థితి కాదు. ఇల్లు కట్టుకున్న అందరూ ఇబ్బంది పడుతున్నారు.
-పఠాన్ సాధిక బేగం, లబ్ధిదారు, బెండాలపాడు, చండ్రుగొండ మండలం
ఇంటి నిర్మాణ పూర్తయింది. వారంలో బిల్లు వస్తుందని చెప్పారు. పది నెలలు గడిచినా బిల్లు రాలేదు. బిల్లు రాకపోయినా వచ్చిందని చెప్పమంటున్నరు. ముఖ్యమంత్రి ఇంటిని ప్రారంభించినా బిల్లు రాకపోవడం విడ్డూరంగా ఉంది. మా ఊరిలో పూర్తి బిల్లు ఒక్కరికి కూడా రాలేదు.
-బచ్చల రమణ, లబ్ధిదారు, బెండాలపాడు, చండ్రుగొండ మండలం