కొత్తగూడెం టౌన్, డిసెంబర్ 18: పట్టుదల, సాధన ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నాడు పాల్వంచకు చెందిన సంగీతకారుడు సుమంత్. సాధారణ కుటుంబంలో పుట్టి మ్యూజిక్ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తాను అప్లోడ్ చేసిన పాటలు యూట్యూబ్‌లో సంచలనం. లక్షలాది మంది సుమంత్ పాటలు వింటున్నారు. తండ్రి శ్రీనివాస్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉద్యోగి. తల్లి వాణి గృహిణి. సుమంత్‌కు సంగీతంపై ఆసక్తి ఉందని గమనించిన తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు. ఐదేళ్ల వయస్సులోనే మంత్రాలు జపించిన సుమంత్ సాహిత్యం, సంగీతంపైనా మక్కువ పెంచకుని సంగీతకారుడిగా ఎదుగుతున్నాడు. జాతీయ స్థాయి బాలోత్సవ్ పోటీల్లో సుమంత్ వరుసగా 11 సార్లు పాల్గొని విజేతగా నిలిచాడు. ఇది బాలోత్సవ్ చరిత్రలో రికార్డ్. తర్వాత రాష్ట్రస్థాయిలో జరిగిన పలు పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాడు. తర్వాత కాలేజీ స్థాయిలోనూ అనేక బహుమతులు సాధించాడు. డిగ్రీ చదువుకోవడానికి లవ్లీ ప్రొఫెసనల్ యూనివర్సిటీకి వెళ్లి ప్రొఫెసనల్ సింగర్‌గా మారాడు. బ్యాండ్‌ను నడిపించగల నైపుణ్యాన్ని సంపాదించాడు. సుమంత్‌కు సంగీతమంటే అభిరుచి ఉన్న మిత్రులు కొందరిని సంపాదించుకున్నాడు. వీరిలో ఒకరు వెంకటేశ్. ఇద్దరివీ ఒకేలా ఆలోచించే మనస్తత్వంజ మ్యూజిక్‌లో పైకి ఎదగాలనే తపనతో వారు ప్రాణం పెట్టి పాటలు చేస్తున్నారు.
ఆదిత్య కంపెనీతో ఒప్పందం..
సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు అర్చకత్వం చేస్తూ సుమంత్ సంగీత సాధన చేసేవాడు. తన మిత్రుడు వెంకటేశ్‌తో కలిసి అనేక ప్రయోగాలు చేసేవాడు. వీరిద్దరూ ఆల్బమ్ సిద్ధం చేశారు. పాట కంటే తనకి ఏదీ ఎక్కువ కాదని తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ఆల్బమ్‌పై పెట్టాడు. ఈ ఆల్బమ్‌లో ‘ఎలా మరీ ఇక రావా… ’ అనే పాట సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరించింది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య ఆల్బమ్‌ను విని సుమంత్‌తో పాటలు చేయించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. వాస్తవానికి సినిమాల్లో పాడే వారికి తప్ప మిగిలిన వారికి గుర్తింపు అరుదుగా లభిస్తుంది. కానీ సుమంత్‌కు యూట్యూబ్, ఆల్బమ్స్ ద్వారా వెంటనే లభించింది. తానే పాటలు పాడడంతో ఆల్బమ్‌కు నిర్మాతగా వ్యవహరించాడు. ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా ఆల్బమ్స్ తయారు చేశాడు. తాజాగా విడుదల చేసిన ఆల్బమ్‌లో సుమంత్ ‘పడిపోయా’ అనే పాట పాడి యువతను ఉర్రూతలూగించాడు. లక్షలాది మంది ఈ పాటను విన్నారు. అనేక ఇంగ్లిష్, తెలుగు పత్రికల్లో సుమంత్‌పై కథనాలు వచ్చాయి. ప్రస్తుతం మరో ఐదు పాటలు రికార్డింగ్ దశలో ఉన్నాయి. అవి త్వరలో రిలీజ్ కానున్నాయి. సోషల్ మీడియాలో సుమంత్‌కు ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్ పేజీలో అభిమానులు, సంగీత ప్రియులు సుమంత్ పాటను మెచ్చుకుంటున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సుమంత్ ఎవరి అండదండలు లేకుండానే స్వయం కృషితో ఎదగడం హర్షణీయం.మ్యూజిక్ వరల్డ్‌లో సంచలనం సృష్టిస్తున్న సుమంత్‌ను ఇటీవల కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అభినందించారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.