మంగళవారం 07 జూలై 2020
Khammam - Feb 17, 2020 , 00:10:02

సొసైటీల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు

సొసైటీల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు

ఖమ్మం వ్యవసాయం : జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కొత్తపాలక వర్గాలు ఆదివారం కొలువుదీరాయి. స్వరాష్ట్ర సాధన తరువాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆయా సొసైటీల డైరెక్టర్లు తమ సొసైటీ చైర్మన్లను, వైస్‌ చైర్మన్లను ఎన్నుకున్నారు. అయితే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ పరిధిలో మొత్తం 76 సొసైటీలకుగాను 34 సొసైటీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 42 సొసైటీల పరిధిలో 363 నియోజకవర్గాలకు ఈ నెల 15 ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని సొసైటీ కార్యాలయాల్లో పాలకవర్గాల సమావేశాలు ఏర్పాటు చేసి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక ప్రక్రియను జిల్లా సహకార సంఘాల ఎన్నికల అధికారులు చేపట్టారు. అయితే పది సొసైటీలకు సంబంధించి కోరం హాజరు కాకపోవడంతో ఆయా సొసైటీల చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ నేటికి వాయిదా పడింది. మిగిలిన 66 సొసైటీల్లో ఆయా సొసైటీల ఎన్నికల అధికారులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక చేపట్టారు. మెజార్టీ డైరెక్టర్ల అభిష్టం మేరకు దాదాపు అన్ని సొసైటీలలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 66 సొసైటీలలో 54 సొసైటీల చైర్మన్లను టీఆర్‌ఎస్‌ పార్టీ తన ఖాతాలో వేసుకుని జిల్లాలో మరో రికార్డు సృష్టించింది. గతంలో జిల్లా చరిత్రలో ఏ పార్టీ విజయం సాధించని విధంగా టీఆర్‌ఎస్‌ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. మిగిలిన 12 స్థానాలకు గాను సీపీఎం పార్టీ ఐదు స్థానాలు, సీపీఐ-1, కాంగ్రెస్‌-3 స్థానాలతో పాటు స్వతంత్రులు మరో మూడు స్థానాల్లో ఎన్నికయ్యారు. సొసైటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైన వారితో పాటు డైరెక్టర్లకు ఆయా సొసైటీల ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. 


మెజార్టీ సభ్యుల గైర్హాజరుతో ఎన్నికలు వాయిదా...

సొసైటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకునేందుకుగాను మొత్తం 13 మంది సభ్యులకు కనీసం ఏడుగురు, అంతకంటే ఎక్కువ సభ్యులు హాజరైతేనే సొసైటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే సొసైటీ ఎన్నికల అధికారులు ప్రక్రియ చేపట్టారు. అయితే గడువులోగా ఎన్నికైన డైరెక్టర్లు హాజరుకాకపోవడంతో జిల్లావ్యాప్తంగా పది సొసైటీలకు సంబంధించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరుగలేదు. జిల్లాలోని మధిర నియోజకవర్గ పరిధిలో నాగులవంచ, చింతకాని, ముదిగొండ, కలకోట, దెందుకూరు, ఖమ్మంపాడు, తక్కెళ్లపాడు, పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయాపాలెం, బీరోలు సొసైటీలతో పాటు సత్తుపల్లి నియోజకవర్గంలోని కుర్నవల్లి సొసైటీలకు సంబంధించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ఈ సొసైటీలలో నేడు మరోమారు ఎన్నిక చేపట్టనున్నట్లు జిల్లా సహకార అధికారి కార్యాలయం అధికారులు పేర్కొన్నారు. 


సంబురాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు...

స్వరాష్ట్ర సాధన తరువాత ఖమ్మం జిల్లాలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయాలను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల నుంచి మొదలుకుని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో తన సత్తా చాటిన టీఆర్‌ఎస్‌ పార్టీ సహకార సంఘాల్లో మరో మారు తిరుగులేని విజయం సాధించింది. దీంతో ఆదివారం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు భారీగా సంబురాలు చేసుకున్నారు. రంగులు చల్లుకుని, టాపాసులు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయా డైరెక్టర్లు, సొసైటీ బాధ్యులుగా ఎన్నికైన వారు తమ నియోజకవర్గ, మండల, ఇతర పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో విజయాన్ని అందించిన రైతు సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ కార్యాలయం ఆవరణలో ఒక్కసారిగా సందడి నెలకొంది. ఆయా మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ర్యాలీలు నిర్వహించి పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. చరిత్రలో తొలిసారిగా డీసీసీబీ పాలకవర్గాన్ని సొంతంగా కైవసం చేసుకోవడం పట్ల పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కార్యకర్తలతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. 


స్వరాష్ట్రంలో తొలి పాలకవర్గాలు   

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత తొలిసారిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. చివరిగా 2013 సంవత్సరం జనవరి 31, ఫిబ్రవరి 3 తేదీల్లో జరిగాయి. 2018 సంవత్సరంలోనే సొసైటీల కాలపరిమితి ముగిసనప్పటికీ నూతన సహకార చట్టం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ఎన్నికలను వాయిదా వేసింది. ప్రస్తుతం ఆయా సొసైటీలలో ఎంపికైన డైరెక్టర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు రాష్టంలో తొలి సారిగా ఎన్నికైన ఘనతను చాటుకున్నైట్లెంది. ఆదివారం ఆయా సొసైటీలలో చైర్మన్లుగా ఎన్నికైన వారిలో గత డీసీసీబీ పాలకవర్గంలో చోటు దక్కించుకున్న వారు కొందరు ఉండగా, సొసైటీ చైర్మన్లుగా ఉన్న వారు మరికొందరు ఎన్నిక కావడం విశేషం. దాదాపు 20మందికి పైగానే గతంలో సొసైటీ చైర్మన్లుగా మరోమారు ఎన్నికయ్యారు.logo