Kondaiyyapalle | గంగాధర, సెప్టెంబర్ 27 : గంగాధర మండలం కొండయ్యపల్లిలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న దళిత కుటుంబాలకు చెందిన భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. దళితుల జాగపై 22ఏ పడగ పేరుతో రెండు రోజుల క్రితం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. దీంతో ఆదివారం కొండాయపల్లి గ్రామాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండయ్యపల్లి సర్వేనెంబర్ 157 లో 50 ఏళ్లుగా దళిత కుటుంబాలు ఇండ్లు నిర్మించుకొని నివాసముంటున్నట్లు పేర్కొన్నారు. తాతలు, తండ్రుల కాలం నుంచి అక్కడే ఉంటూ, కొందరు సొంతంగా భూములు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నారని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారులు సదరు భూములను 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయని చెబుతుండటంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొందన్నారు. ఇండ్లకు అనుమతులు ఉండి సుమారు 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాలపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దళిత పక్షపాత ప్రభుత్వమని చెప్పుకొని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22ఏ సమస్యపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కొండయపల్లి గ్రామంలో సమగ్ర విచారణ చేసి అర్హులైన కుటుంబాల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి, పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్లు 157, 171 భూములపై ప్రత్యేక విచారణ చేసి వాస్తవ పరిస్థితులను గుర్తించాలని కోరారు. దళితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్యాల వినయ్ సాగర్, నాయకులు వేముల దామోదర్, మడ్లపల్లి గంగాధర్, దూలం శంకర్‌గౌడ్, గడ్డం స్వామి, కిషన్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.