సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాల ప్రోత్సాహం లేక, ఉపాధి దొరక్క వలసబాట పట్టిన గర్శకుర్తి, స్వరాష్ట్రంలో బతుకుబాట పట్టింది. ఒకప్పుడు మినీ సిరిసిల్లగా పేరుగాంచిన ఈ ప్రాంతం ఆగమైపోయింది. కానీ, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు చేయూత, అనేక పథకాల అమలుతో పునర్జీవం పోసుకున్నది. ఏటా ఆడబిడ్డలకు కానుకగా అందించే బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు ఇస్తుండడంతో తేరుకున్నది. ఈ సీజన్లో 32లక్షల మీటర్ల వస్ర్తోత్పత్తి లక్ష్యం ఇవ్వగా, తయారీతో ఏ వీధిలో చూసినా సాంచాల సవ్వడి వినిపిస్తున్నది. గడువులోగా టార్గెట్‌ను పూర్తి చేసేందుకు కార్మికులు అహోరాత్రులు కష్టపడుతుండడం, ఇటు పనికి తగ్గ ఫలితం, మంచి వేతనం దొరుకుతుండడంతో కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
– గంగాధర, సెప్టెంబర్ 7
కరీంనగర్ జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే గర్శకుర్తి వస్తోత్పత్తికి పెట్టింది పేరు. మినీ సిరిసిల్లగా ప్రసిద్ధి. గ్రామ జనాభా 6500. అందులో 70 శాతం నేత కార్మికులే. దాదాపు 1400 పవర్ లూంలు ఉన్నాయి. వీరంతా వస్త్ర పరిశ్రమను నమ్ముకొనే బతుకుతుంటారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన గ్రామం, సమైక్య రాష్ట్రంలో వెనుకబడిపోయింది. కార్మికులకు ఏ ప్రోత్సాహం లేక, ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కష్టానికి తగిన ఫలితం రాక, కుటుంబాలను పోషించుకునే అవకాశం లేకపోవడంతో వలస బాటపట్టారు.
స్వరాష్ట్రంలో భరోసా
స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం, నేత కార్మికులకు అండగా నిలిచింది. అనేక పథకాలు అమలు చేస్తూ, ప్రోత్సాహం ఇవ్వడంతో అనతికాలంలోనే కార్మికుల జీవితాల్లో మార్పులు వచ్చాయి. ఇక ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మను, మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏటా బతుకమ్మ చీరెలను ఉచితంగా అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వస్తోత్పత్తి ఆర్డర్లను కార్పొరేట్ కంపనీలకు ఇవ్వకుండా నేత కార్మికులకే ఇస్తూ కార్మికులకు జీవితాల్లో వెలుగులు నింపుతుండగా, గర్శకుర్తిలోనూ వందలాది మంది కార్మికులు చీరలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. చేతినిండా పని, పనికి తగ్గ వేతనం అందుతుండడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
32 లక్షల మీటర్ల చీరెల తయారీ
నేత కార్మికులకు చేతినిండా పని కల్పించేందుకు ప్రభుత్వం కొన్నేండ్లుగా బతుకమ్మ చీరెల ఆర్డర్లను ఇస్తున్నది. అయితే మొదట్లో కొన్ని ప్రాంతాలకే ఇవ్వగా, గర్శకుర్తికి అవకాశం కల్పించాలని సర్పంచ్ అలువాల నాగలక్ష్మి, వస్త్ర వ్యాపార సంఘం నాయకులు 2019లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్, నాయకుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే రవిశంకర్ సీఎం, కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లి 11 లక్షల మీటర్ల బతుకమ్మ చీరెల తయారీకి అనుమతిని ఇప్పించారు. విడతల వారీగా తయారీని పెంచుతూ ప్రస్తుతం గ్రామంలో 32 లక్షల మీటర్ల బతుకమ్మ చీరెలను తయారు చేయడానికి అనుమతినిచ్చింది. వివిధ రకాల డిజైన్లతో కూడిన అచ్చువేసిన చీరలను తయారు చేస్తున్నారు. తెలంగాణలో మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ బతుకమ్మ. ఈ పండుగకు మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇటు మహిళలకు కొనుగోలు భారం తప్పడంతో పాటు, అటు చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తున్నది. ఆసాములకు సైతం గిట్టుబాటు ధర దొరుకుతున్నది.
ఇదంతా కేసీఆర్ పుణ్యమే
మాది గట్టుభూత్కూర్. ఊళ్లే సాంచాలు నడుపుతూ కాటన్ తువ్వాలలు నేసేవాడిని. సరైన ఆదాయం లేక సాంచెలు బందు చేసి కొన్ని రోజులు ఊళ్లే కూలీ పనులు చేసుకున్న. చాలీ చాలని పైసలతోని కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా ఉండేది. గర్శకుర్తిలో బతుకమ్మ చీరలు తయారు చేస్తున్నరని తెలిసి ఇక్కడికి వచ్చిన. ఆసామి అలువాల తిరుపతి దగ్గర పనికి కుదిరిన. ఇప్పుడు నెలకు రూ.22వేల జీతం ఎత్తుతున్న. ఇదంతా సీఎం కేసీఆర్ పుణ్యమే.
– శ్రీపతి భూపతి, చేనేత కార్మికుడు
రోజూ 150 మీటర్ల దాకా చీరెలు నేస్తున్నా
బతుకమ్మ చీరెల తయారీ వల్ల చేతి నిండా పని దొరికింది. ప్రతి రోజు 150 మీటర్ల దాకా చీరలు నేస్తున్నా. మీటరుకు రూ.5.25 చొప్పున రోజుకు రూ.750 దాకా సంపాదిస్తున్నా. ఇప్పటికే లక్ష్యం మేరకు చీరలు తయారు చేసి పంపిణీ కోసం సిద్ధం చేస్తున్నం. బతుకమ్మ చీరెల తయారికీ అవకాశం ఇచ్చి తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంటం. సీఎం కేసీఆర్ సారును ఎన్నటికీ మరచిపోం.
– మిట్టపెల్లి సత్తయ్య, చేనేత కార్మికుడు
చేతినిండా పనిదొరుకుతున్నది
గర్శకుర్తిలో బతుకమ్మ చీరెల తయారీకి సర్కారు అవకాశం ఇచ్చి మా కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. సిరిసిల్ల మాదిరి మాకు కూడా ఆర్డర్లు ఇస్తుండడంతో చేతినిండా పనిదొరుకుతున్నది. సాంచాలకు పేటీలు వేయడం, గాలాలు వేయడం ద్వారా నెలకు రూ.20 వేల దాకా సంపాదిస్తున్నా. ఉన్న ఊరిలో ఉపాధిని కల్పించి మా నేతన్నల బతుకులు బాగు చేసిన సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– రేణికుంట శ్రీనివాస్, చేనేత కార్మికుడు
పంపిణీకి సిద్ధం చేస్తున్నాం
గర్శకుర్తిలో 32 లక్షల మీటర్ల బతుకమ్మ చీరెలు తయారీకి సర్కారు అవకాశం ఇచ్చింది. గ్రామంలోని నేత కార్మికుల ద్వారా తీరొక్క రంగులతో తయారు చేయిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా అన్నీ సిద్ధం చేసి పంపిణీకి అందిస్తాం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చి, చేతినిండా పనికల్పిస్తున్న సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రవిశంకర్‌కు కృతజ్ఞతలు.
– అలువాల తిరుపతి, ఆసామి