Singareni | గోదావరిఖని : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ వన్ పరిధిలోని GDK-1 ఇంక్లైన్ గనిలో శనివారం నిర్వహించిన ప్రొడక్షన్ డే విజయవంతంగా ముగిసింది. 2025 26 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి భారీగా వెనుకబడడంతో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి గాను సింగరేణి వ్యాప్తంగా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా శనివారం జీడీకే-1 గనిలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధన దినోత్సవం పాటించారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ 806 టన్నుల అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించడంతోపాటు 736 టన్నుల బొగ్గు రవాణా డిస్పాచ్తో 1.2 OMS సాధించింది.
ఇటీవల సంవత్సరాల్లో ఇదే అత్యధిక రికార్డుగా నిలిచింది. ఒకరోజు నిర్దేశించిన లక్ష్యం 656 టన్నులు కాగా, 806 టన్నులు సాధించి లక్ష్యాన్ని మించి బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఉత్పత్తితోపాటు రవాణాలో కూడా గణనీయమైన వృద్ధి సాధిస్తూ736 టన్నుల బొగ్గును రవాణా చేశారు. ఈ విజయాన్ని సాధించడం గని సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనంగా నిలిచింది. ఈ గొప్ప విజయానికి ఆర్జీ-1 జనరల్ మేనేజర్ డీ లలిత్ కుమార్, ఎల్ రమేష్ (ఏజెంట్), సుధీర్ జక్కులవార్ (మేనేజర్) గని అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు యూనియన్ ప్రతినిధులు అందరిని అభినందిస్తూ భవిష్యత్లో కూడా ఇదే ఉత్సాహంతో మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు.