Koppula Eshwar | నీటి పారుదలపై మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు అవగాహన లేదు.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి పనులు వెంటనే పూర్తి చేయాలని, రాష్ట్రంలో నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాలపై సోషల్ వెల్ఫేర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కనీస అవగాహన లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే తెలంగాణలో కరువు పరిస్థితులు
- కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలిస్తుంటే సీఎం, మంత్రులు మౌనం వహిస్తున్నారు
Koppula Eshwar | పెద్దపల్లి, నవంబర్ 27(నమస్తే తెలంగాణ)/ ధర్మారం : ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి పనులు వెంటనే పూర్తి చేయాలని, రాష్ట్రంలో నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాలపై సోషల్ వెల్ఫేర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కనీస అవగాహన లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది రిజర్వాయర్ వద్ద పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, నంది మేడారం పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి హక్కులు, సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్ పనులపై సరైన అవగాహన లేకుండా హరీష్ రావుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా మార్చి, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా, గోదావరి జలాలను తరలించేందుకు ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. 2025లో 299:512 టీఎంసీల తాత్కాలిక నీటి పంపిణీ నిష్పత్తికి ముఖ్యమంత్రి ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. జనవరిలో టెండర్లు పిలిచి, ఆగస్టులో జీవో నంబర్ 453 విడుదల చేసినా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఈ నిర్ణయాల వల్ల నల్గొండ, పాలమూరు జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 3న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్లు 403, 405 ద్వారా హంద్రీ-నీవా పనులు చేపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీ-3 పనులు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 25 శాతం పనులు పూర్తి చేసి ఉంటే 50 టీఎంసీల నీటితో పాలమూరు ప్రాంతం సస్యశ్యామలమయ్యేదని అన్నారు. మూడేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పల్నాడు ప్రాజెక్టు విషయంలోనూ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 56లో నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించే ప్రతిపాదన ఎక్కడా లేదని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నిరూపించాలని హరీష్ రావు ప్రశ్నించారని గుర్తుచేశారు. తాగునీటి పేరుతో 186 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అనుమతులు లేకుండా చేపడుతున్న పనులను ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు. ధర్మపురి నియోజకవర్గంలో సాగునీటి సమస్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు సవాల్ విసిరారు. తాను 20 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, అందులో పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ధర్మపురి నియోజకవర్గంలో ఒక్క ఎకరం పంటైనా ఎండిపోయినట్లు నిరూపించాలని అన్నారు. ప్రస్తుతం మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వందల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 14 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మోటార్లు కాలిపోయినా ఆరు నెలలు, సంవత్సరం గడిచినా మరమ్మతులు చేయడం లేదని విమర్శించారు. గోదావరిలో నీళ్లు ఉన్నప్పటికీ మోటార్లు పనిచేయక రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. నంది మేడారం రిజర్వాయర్ నుంచి నీటిని అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో లెఫ్ట్, రైట్ కెనాల్ ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు.
లెఫ్ట్ కెనాల్ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని, లింక్ కెనాల్ కోసం రూ.12 కోట్లు మంజూరు చేయించినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఎండపల్లి, వెలగటూరు మండలాల రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ పనులను మంత్రి ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ముంజంపల్లి, మారడిపల్లి, వనపర్తి, బొట్ల వనపర్తి, కానంపల్లి, పాలగుర్తి ప్రాంతాలకు నీరు అందించే రైట్ కెనాల్ ప్రతిపాదనలను కూడా పట్టించుకోవడం లేదన్నారు. బొమ్మారెడ్డిపల్లి ఎక్స్టెన్షన్ కెనాల్‌కు గతంలో రూ.16 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామని, ఇప్పటికీ వాటిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మాదరగండి మత్తుకు సుమారు రూ.15-16 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఎండపల్లి, గుల్లకోట, కొండాపూర్, అంబారిపేట తదితర గ్రామాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని తెలిపారు. మేడారం రిజర్వాయర్ నిర్మాణం వల్ల స్థానిక మత్స్యకారులకు శాశ్వత ఉపాధి లభించిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామంలో గ్రామపంచాయతీ భవనం, 50 పడకల ఆసుపత్రి, డబుల్ రోడ్డు, పార్కు, కోర్టు, రైతు వేదిక, కమ్యూనిటీ భవనాలు నిర్మించామని వివరించారు. మత్స్యకారుల కోసం గంగమ్మ దేవాలయం, ఎస్సీ కాలనీల్లో కమ్యూనిటీ హాళ్లు నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం మంత్రి లక్ష్మణ్ కుమార్ గ్రామానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని 610 మండలాలకు గాను 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ రైతులకు కరువు సాయం అందడం లేదని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తే, ప్రస్తుతం ఆరు గంటల విద్యుత్ కూడా సరిగా అందడం లేదన్నారు. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. యూరియా సరఫరా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలోనూ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని కోటిలింగాల అభివృద్ధికి రూ.2.5 కోట్లు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ప్రస్తుతం ఆ పనులు నిలిచిపోయాయని తెలిపారు. యశ్వంతరావుపేట చెరువు అభివృద్ధికి, పూడికతీతకు నిధులు కేటాయించినా పనులు జరగడం లేదన్నారు. ధర్మారం మండలంలోని భీమన్న చెరువుకు రూ.15 కోట్లు మంజూరు చేసి భూసేకరణకు పరిహారం కూడా చెల్లించినప్పటికీ పనులు ప్రారంభించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి నిర్వహణలో వైఫల్యం కారణంగానే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. నీళ్లు అందుబాటులో ఉన్నా ఎత్తిపోసి రైతులకు అందించలేని అసమర్థ పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణ రైతాంగానికి నష్టం కలిగించే నిర్ణయాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ విమర్శలు చేయడం మానుకుని నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, చెరువుల పనులను పూర్తి చేయాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించడం, పెండింగ్ పనులను పూర్తి చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

