జగిత్యాల, నవంబర్ 30: నూతనంగా నిర్మించిన జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌ను ఎలక్టోరల్ అబ్జర్వర్ వాణీప్రసాద్, కలెక్టర్ జీ రవి బుధవారం పరిశీలించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో వారు కలెక్టరేట్‌ను సందర్శించారు. వివిధ విభాగాల్లో కలియదిరిగారు. ప్రతి అంగుళాన్నీ శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రతి గది వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి వసతి, టాయిలెట్స్, విద్యుత్ వ్యవస్థ, లైటింగ్ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు అన్ని హంగులు, సదుపాయాలతో ముస్తాబు చేయాలని, పరిసరాలను పచ్చదనంతో ఆహ్లాదంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఖిల్లాను సందర్శించారు. ఇక్కడ అదనపు కలెక్టర్లు మందా మకరంద్, బీఎస్ లత, ఆర్డీవో మాధురి ఉన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
జగిత్యాల రూరల్, నవంబర్ 30: ఈ నెల 7న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జగిత్యాలకు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ స్థలాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ జీ చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి బుధవారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డులో గల స్థలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండగా, ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.