‘పథకాల’పై కలెక్టర్ల ఫోకస్
సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతూనే.. మరోవైపు స్కీముల అమలు, అర్హుల ఎంపికలో బిజీగా మారారు. సబ్బండ వర్గాల హితమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్నీ పారదర్శకంగా అర్హులందరికీ అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.
- ఓవైపు ఎన్నికలకు సమాయత్తం.. మరోవైపు స్కీంలపై ప్రత్యేక దృష్టి
- లబ్ధిదారులకు నేరుగా ఫలాలు అందించేందుకు కసరత్తు
- అమలు, ఎంపికపై నిరంతరం సమీక్షలు
- క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం
- వేగంగా అర్హుల గుర్తింపు.. జాబితాపై నిశిత పరిశీలన
సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతూనే.. మరోవైపు స్కీముల అమలు, అర్హుల ఎంపికలో బిజీగా మారారు. సబ్బండ వర్గాల హితమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్నీ పారదర్శకంగా అర్హులందరికీ అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని అమలవుతుండగా, తాజాగా తెచ్చిన వాటి కింద అర్హుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. జిల్లాల వారీగా నిరంతరం సమీక్షలు చేస్తూ.. అధికారులకు దిశానిర్దేశం చేస్తూ.. ప్రభుత్వ ఫలాలను లబ్ధిదారుల చెంతకు చేరుస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పక్కగా అమలు చేయడంతోపాటు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
– కరీంనగర్, ఆగస్టు17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్
కరీంనగర్, ఆగస్టు17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్ : ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల మినహా మిగిలిన కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త కలెక్టర్లు బాధ్యతలు చేపట్టారు. నిజానికి సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్‌జయంతి రెండేళ్ల క్రితమే బాధ్యతలు చేపట్టగా, మిగతా మూడు జిల్లాల మాత్రం కలెక్టర్లు ఇటీవలే జాయిన్ అయ్యిరు. జగిత్యాల జిల్లాకు షేక్ యాస్మిన్ బాషా గత ఫిబ్రవరిలో రాగా, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, బీ గోపి మాత్రం జూలైలో వచ్చారు. వచ్చీరాగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రాగా, ఆ మేరకు కలెక్టర్లు దృష్టి సారించారు. ఆయా జిల్లాలో ఉన్న ఓటర్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అందులో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి.. అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారుల బదిలీల ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో రిటర్నింగ్ అధికారులను కూడా నియమించారు.
దీంతోపాటు ఎన్నికల నిర్వహణపై ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఎక్కడా చిన్న చిన్న పొరపాట్లు కూడా పునరావృతం కాకుండా చూస్తున్నారు. ఇదే సమయంలో సంక్షేమ పథకాల అమలుపైనా ప్రత్యేక దృష్టిసారించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన పథకాలను లబ్ధిదారుల చెంతకు చేర్చేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయి అధికారులతో కలసి పనిచేస్తున్నారు. దళితబంధు, గొర్రెల పంపిణీ, ఆసరా, రైతు బంధు, రైతు బీమా, బీసీ కులవృత్తులు, మైనార్టీలకు రూ. లక్ష సాయం, జీవోనెం.58 కింద పట్టణాల్లో భూముల క్రమబద్దీకరణ, తాజాగా ప్రకటించిన నోటరీతో రిజిస్ట్రేషన్, గృహలక్ష్మి పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు కలెక్టర్ల ఆదేశాల మేరకు ఆయా శాఖల అధికారులు శ్రమిస్తున్నారు. అందుకోసం పథకాల అమలు తీరుపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, పురోగతి వివరాలు తెలుసుకుంటూ దిశనిర్దేశం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పథకాల అమలును పరుగులు పెట్టిస్తున్నారు.
అమలుతోపాటు అర్హుల గుర్తింపు
మొదటి విడుత గొర్రెల పంపిణీ కింద పెద్దపల్లి జిల్లాలో 10,204, కరీంనగర్లో 14,761 జగిత్యాలలో 17,450, రాజన్న సిరిసిల్లో 16,162 యూనిట్లు పంపిణీ చేశారు. రెండో విడుత పంపిణీ మొదుల కాగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ యూనిట్లు అందించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. లబ్ధిదారులు కోరుకున్న చోట గొర్లు కొని అందిస్తున్నారు. అయితే గతంలో వివిధ ప్రాంతాల్లో కొన్ని ఆరోపణలు రాగా, ఈ సారి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో తెచ్చిన దళితబంధు రెండో విడత అమలు ప్రక్రియ కొనసాగుతున్నది. సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పథకం తొలి విడతలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని, అక్కడ 18వేల పైచిలుకు మందికి యూనిట్లను గ్రౌడింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వంద మంది చొప్పున ఎంపిక చేసి, ఆర్థిక సాయం అందించింది. వీరంతా తమకు అనుకూలమైన యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆర్ధిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. వీరి స్ఫూర్తితో రెండో విడతగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 1100 చొప్పున యూనిట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. లబ్ధిదారుల ఎంపిక కోసం అర్హుల జాబితా సేకరణ కూడా పూర్తయింది. పరిశీలన ప్రక్రియ కాగానే యూనిట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ కార్పొరేషన్ అధికారులను కలెక్టర్లు ఆదేశించారు.
ఏ ధీమాలేని అభాగ్యులకు రాష్ట్ర సర్కారు ఆసరా పింఛన్లు అందిస్తూ కొండంత అండగా నిలుస్తున్నది. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో 97,752 మంది, కరీంనగర్ 1,41,344 మంది, జగిత్యాలలో 2,28,351 మంది, రాజన్న సిరిసిల్లలో 1,21,142 మంది పింఛన్లు పొందుతున్నారు. అయితే నిరుపేద, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుతున్న పింఛన్లపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ మార్పులు చేర్పులపై ఆరా తీస్తున్నారు. అలాగే పెడింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు గ్రామాలు, డివిజన్లు, వార్డుల వారీగా విభజించి, క్షేత్రస్థాయి పరిశీలనకు తేదీలు కూడా ఖరారు చేస్తున్నారు.
రైతుబంధు, రైతు బీమా పథకాలపై కూడా ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రైతుబీమా పథకంలో కొత్తగా చేరిన వారి వివరాలను వెంటనే అప్లోడ్ చేసి, ఉన్నతాధికారులకు రిపోర్టు అందజేయాలని కలెక్టర్లు ఆదేశించారు. అలాగే పంట రుణమాఫీ ప్రక్రియను దాదా పుగా పూర్తి చేశారు.
బీసీల్లోని కులవృత్తుల వారికి రాష్ట్ర సర్కారు లక్ష చొప్పున సాయం అందిస్తున్నది. మొదటి విడతలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 300 మందికి లబ్ధి కల్పిస్తున్నది. ఇప్పటికే పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.
మైనార్టీల్లోని చిరు వ్యాపారులకు ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో లక్ష సాయం అందిస్తున్నది. తొలివిడతగా 10 వేల మందికి ఇవ్వనున్నది. దరఖాస్తులు పక్రియ ఈ నెల 14తో ముగియగా.. రేపటి (ఈ నెల 19) నుంచే అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు.
జీవో నంబర్ 58 కింద మున్సిపాలిటీల్లో పేదల ఇంటి స్థలాలు ఉచితంగా క్రమబద్ధీకరించగా, మిగిలిన వాటిని కూడా నిబంధనల మేరకు పూర్తి చేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వ్యవసాయేతర నోటరీ భూములు కూడా క్రమబ్ధీకరించేందుకు ప్రభు త్వం అనుమతించగా, మూడు నెలల్లో పూర్తి చేసేందుకు వచ్చిన ధరఖాస్తులను వెంట వెం టనే పరిశీలించాలంటూ స్టాంపులు, రెవెన్యూ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
గృహలక్ష్మి పథకంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ధరఖాస్తుల స్వీకరణ నిరంతరాయంగా కొనసాగనుండగా, ఈ నెల 10 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, మొదటి విడత లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయగా.. క్షేత్రస్థాయిలో అర్హుల గుర్తింపు పక్రియను ప్రారంభించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

