సాధారణంగా బల్లులు ఎక్కడైనా ఉంటాయి. ఇంట్లోనూ బోలెడు ఉంటాయి. కానీ.. వాటిని మనం ఏం చేయం. అవి కూడా మన జోలికి రావు. తాజాగా ఓ రెస్టారెంట్లో ఓ బల్లి హడావుడి చేసింది. అది మామూలుగా ఇళ్లలో తిరిగే బల్లి కాదు. దాని పేరు మానిటర్ లిజార్డ్. అంటే.. అదో జాతికి చెందిన బల్లి అన్నమాట. చాలా పెద్దగానే ఉంటుంది. అసలు ఆ బల్లి అక్కడికి ఎలా వచ్చిందో తెలియదు కానీ.. ఆ బల్లిని చూసి ఓ మహిళ చెంగున ఎగిరి గంతేసింది. వెంటనే కుర్చీ ఎక్కేసింది.
ఇక.. గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న రెస్టారెంట్ సిబ్బందిలో ఒకరు దాన్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినా అది అక్కడి నుంచి కదల్లేదు. పైగా ఆ వ్యక్తి మీదికి బల్లి దూసుకెళ్లింది. చివరకు మరో వ్యక్తి వచ్చి రాడ్‌తో దాన్ని ఆపి.. దాని తోక పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లడంతో ఆ మహిళ అప్పుడు ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటన థాయిలాండ్‌లోని ఓ రెస్టారెంట్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.