గురువారం 04 జూన్ 2020
International - Apr 21, 2020 , 01:36:10

వుహాన్‌ గుట్టు విప్పుతాం!

వుహాన్‌ గుట్టు విప్పుతాం!

  • చైనాకు దర్యాప్తు బృందాన్ని పంపాలనుకుంటున్నాం
  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడి
  • తోసిపుచ్చిన చైనా.. అనుమతించేది లేదని స్పష్టీకరణ

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 20: కరోనా వ్యాప్తిపై తెలిసీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు తేలితే చైనాపై తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా గుట్టు విప్పేందుకు తమ దర్యాప్తు బృందాన్ని వుహాన్‌కు పంపాలనుకుంటున్నామని చెప్పారు. ఆదివారం శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చైనాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అక్కడకు వెళ్లడంపై చాలా కాలం కిందటే చైనాను కోరాం. మేం అక్కడి వెళ్లాలనుకుంటున్నాం. అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలనుకుంటున్నాం. కానీ చైనా మమ్మల్ని అనుమతించడంలేదు’ అని తెలిపారు.  

 ఆ పది దేశాల కంటే ఎక్కువ పరీక్షలు 

భారత్‌తోపాటు మరో తొమ్మది దేశాలు నిర్వహించిన మొత్తం పరీక్షల కంటే అమెరికానే అత్యధికంగా పరీక్షలు నిర్వహించిందని ట్రంప్‌ పేర్కొన్నారు. కరోనాపై పోరులో అమెరికా పురోగతి సాధిస్తున్నదని, ఇప్పటివరకు 41.8 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రపంచంలో ఇదే రికార్డు అని పేర్కొన్నారు. భారత్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, దక్షిణకొరియా, జపాన్‌, సింగపూర్‌, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, స్వీడన్‌, కెనడా నిర్వహించిన పరీక్షలను కలిపినా అమెరికా కంటే తక్కువేనని చెప్పారు. 

అనుమతించేది లేదు: చైనా

వుహాన్‌లోకి తమ దర్యాప్తు బృందాన్ని అనుమతించాలన్న అమెరికా డిమాండ్‌ను చైనా నిర్దందంగా తోసిపుచ్చింది. కరోనాకు సంబంధించి తాము కూడా బాధితులమేనని, దోషులం కాదని స్పష్టంచేసింది. చైనా విదేశాంగ మంత్రి జెంగ్‌ షువాంగ్‌ సోమవారం మాట్లాడుతూ.. ‘ఈ వైరస్‌ మానవాళికి ఉమ్మడి శత్రువని     చెప్పారు.

తెరుచుకున్న టెక్సాస్‌ 

ఆస్టిన్‌: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో సోమవారం నుంచి వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. తద్వారా అమెరికాలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. అమెరికాలో ఆదివారం ఒక్కరోజే 26వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండువేల మంది మరణించారు. దీంతో కేసుల సంఖ్య 7.6 లక్షలు దాటగా, మరణాలు 41వేలకు చేరాయి. సోమవారం కడపటి వార్తలందే సమయానికి కేసుల సంఖ్య 7.71 లక్షలకు చేరుకున్నాయి. కొత్తగా 780 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు కరోనా మరణాలతో అల్లాడిన న్యూయార్క్‌లో క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతున్నదని అధికారులు ప్రకటించారు. 


logo