Rishi Sunak | రిషి సునాక్.. ఇప్పుడు ఇండియాలో అందరి నోళ్లలో నానుతున్న పేరు.. ఒకనాటి రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొంది.. అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఉన్న బ్రిటన్ ప్రధాని పదవికి రిషి సునాక్ పోటీ పడుతున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నిక కోసం ఎంపీల మధ్య ఇప్పటివరకు రెండు దఫాలు జరిగిన అంతర్గత ఓటింగ్‌లో రిషి సునాక్‌దే పైచేయి. మరో ముగ్గుర్ని పోటీ నుంచి తప్పించాక.. ఇద్దరి మధ్య జరిగే పోరు రసవత్తరం కానున్నది. అధికార కన్జర్వేటివ్ పార్టీ రిజిస్టర్డ్ సభ్యుల పోస్టల్ బ్యాలెట్ కీలకం కానున్నది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో దాదాపు సగం మంది తమకు మంచి ప్రధాని రిషి సునాక్ కాగలరని నమ్ముతున్నారట. తాజాగా జేఎల్ పార్టనర్స్ నిర్వహించిన న్యూ ఒపీనియన్ పోల్ సారాంశం ఇది.
జేఎల్ పార్టనర్స్ పోల్‌లో 4,400 మందికి పైగా సభ్యులు రిషి సునాక్ తమకు మంచి ప్రధాని అవుతారని భావిస్తున్నారని తెలుస్తోంది. మొత్తం ఓటర్లలో 48 శాతం మంది రిషి సునాక్‌కు మద్దతు ఇచ్చారని సమాచారం.రెండో స్థానంలో 39 శాతం మందితో విదేశాంగశాఖ మంత్రి లిజ్ ట్రస్, 33 శాతం మందితో వాణిజ్యశాఖ సహాయ మంత్రి పెన్నీ మోర్డాంట్ నిలిచారట. అంటే ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ నెలకొంటుందని సన్డే టెలిగ్రాఫ్ ఒక వార్తాకథనం ప్రచురించింది.
బోరిస్ జాన్సన్ వారసుడి ఎన్నికపై జరుగుతున్న చర్చలో పన్నుల్లో కోత మొదటి స్థానంలో ఉంది. కానీ 38 శాతం మంది ఓటర్లు మాత్రం పన్నుల్లో కోత అంశానికి నాలుగో ప్రాధన్యం ఇస్తున్నారట. అంతే కాదు.. వారిలో 40 శాతం మంది కన్జర్వేటివ్లే. 19 శాతం మంది కన్జర్వేటివ్ మద్దతుదారులు, 24 శాతం మంది ఓటర్ల సంయుక్త సర్వేను జేఎల్ పార్టనర్స్ నిర్వహించింది. గతవారం నిర్వహించిన సర్వేలో ప్రతిపక్ష లేబర్ పార్టీకి 11 పాయింట్లు లభిస్తే.. టోరీల (కన్జర్వేటివ్)కు 31 పాయింట్లు వచ్చాయి.
ఇప్పటికైతే రిషి సునాక్‌కు ఫేవరెట్‌గా ఉన్న టోరీల ఎంపీలు.. చివరకు మోర్డాంట్ వైపు మళ్లుతారని చెబుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన సర్వేలో బాడ్నోచ్ 31 శాతంలో మొదటి స్థానంలో ఉంటే, లిజ్ క్రస్ 20 శాతంతో రెండో స్థానంలో, మోర్డాంట్ 18 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. రిషి సునాక్ కేవలం 17 శాతం మంది మద్దతుదారులను మాతరమే కలిగి ఉన్నారని కన్జర్వేటివ్ పార్టీ వెబ్సైట్ సర్వే తేల్చింది. అయితే, కన్జర్వేటివ్ పార్టీకి దాదాపు 1.60 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వారంతా పంపే పోస్టల్ బ్యాలెట్.. తదుపరి బ్రిటన్ ప్రధానిని ఖరారు చేస్తుంది. సెప్టెంబర్ ఐదో తేదీన బ్రిటన్ కొత్త ప్రధానిని ప్రకటిస్తారు.