క్వాంగ్ నిహ్ : వియత్నాంలోని ముద్దు పెట్టుకునే రాళ్ల (Kissing Rocks) ను వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు. క్వాంగ్ నిహ్ ప్రావిన్స్ (Quang Ninh Province)లోని హా లాంగ్ బే (Ha Long Bay) లో ఉన్న ఈ చారిత్రక రాళ్లు ప్రస్తుతం ప్రమాదం అంచున ఉన్నాయి. తగిన చర్యలు చేపట్టకపోతే సముద్రంలో నీటి అలల తాకిడికి కోతకు గురవుతున్న ఈ కిస్సింగ్ రాక్స్ కూలిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సముద్రంలో నీటి మట్టం పెరగడంతో ఈ కిస్సింగ్ రాక్స్కు అలల తాకిడి ఎక్కువైంది. అంతేగాక ఆ రాక్స్‌ను వీక్షించేందుకు స్పీడ్ బోట్ల ద్వారా వచ్చే పర్యాటకులు కూడా ఎక్కువయ్యారు. రాక్స్కు 20 మీటర్ల సమీపం వరకు ఆ స్పీడ్ బోట్స్ వెళ్తున్నాయి. దాంతో నీటి అలలు కిస్సింగ్ రాక్స్‌ను తాకి వాటిని కోతకు గురి చేస్తున్నాయి. అంతేగాక కిస్సింగ్ రాక్స్ పరిసరాల్లో చేపల వేట కూడా యథేచ్చగా సాగుతున్నది.
ఈ చేపల వేట వల్ల కూడా నీటి తాకిడికి కిస్సింగ్ రాక్స్ క్రమంగా కోతకు గురవుతున్నాయి. నీటి లోపలి భాగంలో కూడా ఈ కిస్సింగ్ రాక్స్‌లో కోతలు వచ్చినట్లు నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. దాంతో వియత్నాం సర్కారు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే.. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన కిస్సింగ్ రాక్స్ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.