Canada : కెనడాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. టోరంటో సిటీలోని ఒక అపార్ట్మెంట్లో ఆదివార ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుడిని హతమార్చారు అని జిమ్ మాక్ స్వీన్ అనే పోలీసు తెలిపాడు. కాల్పుల వెనక ఉద్దేశం ఏంటనేది తెలసుకునేందుకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దుండగుడికి, చనిపోయినవాళ్లకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.
టోరంటోకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న యార్క్ జిల్లాలోని వాఘాన్ అనే అపార్ట్మెంట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వాఘన్స్ మేయర్ స్టీఫెన్ డెల్ డ్యూకా ట్వీట్టర్ వేదికగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. అంతేకాదు కాల్పుల ఘటనకు వెంటనే స్పందించి దుండగుడిని హతమార్చిన పోలీసును సత్కరిస్తామని ఆయన చెప్పాడు. 2020లో నోవా స్కోషియా ఘటనలో ఒక పోలీసు 22 మంది పౌరులను కాల్చి చంపాడు. ఆ ఘటనతో ఉలిక్కిపడిన కెనడా 1500 రకాల తుపాకులపై నిషేధం విధించింది.