వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఆ దేశ సేనేట్(US Senate) బ్రేకేసింది. ఇరాన్ యుద్ధం అంశంలో యుద్ధ అధికారాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానం ఆమోదం పొందడంతో.. ట్రంప్ అధికారాలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఉభయసభల అనుమతి లేకుండా యుద్ధాల అంశంలో ట్రంప్ సైనిక చర్యలు చేపట్టకుండా ఆ తీర్మానం పాస్ చేశారు. ఫిబ్రవరిలో ఇరాన్‌తో యుద్ధం మొదలైన తర్వాత తొలి సారి అమెరికా కాంగ్రెస్ ట్రంప్ వేగానికి కళ్లెం వేసింది. ఇరాన్ యుద్ధ అధికారాల తీర్మానాన్ని 50-48 ఓట్ల తేడాతో పాస్ చేశారు. డెమోక్రాట్లకు మద్దతుగా నలుగురు రిపబ్లికన్లు కూడా కలవడంతో ఆ తీర్మానం ఆమోదం పొందింది. ఓ డెమోక్రటిక్ అభ్యర్థి మాత్రం ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు.
ఇరాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న అమెరికా దళాలను ఆ తీర్మానం ప్రకారం వెనక్కి రప్పించాల్సి ఉంటుంది, లేదంటే అమెరికా కాంగ్రెస్ అనుమతితో సైనిక చర్యకు దిగాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ తీర్మానం కేవలం ఓ సంకేతం మాత్రమే అని అమెరికా మీడియా తెలిపింది. యుద్ధం ముగింపు కోసం ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా బలగాలు దాడి చేయడం లేదని, అందుకే ఆ తీర్మానం ఓ సందేశాత్మక సంకేతం అవుతుందని స్థానిక మీడియా పేర్కొన్నది. ఇరాన్‌తో యుద్ధం అంశంలో శాంతి ఒప్పందం కుదిరినా.. యుద్ధ అధికారాల తీర్మానం చాలా అవసరమైందని డెమోక్రాట్లు వాదిస్తున్నారు.