Donald Trump : ఐసిస్ (ISIS) అగ్ర కమాండర్ (Top Commander) అబు-బిలాల్ అల్-మినూకి (Abu-Bilal al-Minuki) ని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. అమెరికా, నైజీరియా (USA, Nigeria) ప్రత్యేక బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి మినూకిని మట్టుబెట్టినట్టు తెలిపారు. మినూకి మృతితో ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ కార్యకలాపాలు మరింత బలహీనమవుతాయని తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ (Truth Social) లో ట్రంప్ పోస్టు పెట్టారు.
‘నా ఆదేశాల మేరకు అమెరికా బలగాలు, నైజీరియా భద్రతా బలగాలు సంయుక్తంగా ఐసిస్ అగ్ర కమాండర్ అబు-బిలాల్ అల్-మినూకిని మట్టుబెట్టాయి. ఐసిస్‌లో రెండో అత్యున్నత హోదాలో ఉన్న మినూకి ఆఫ్రికాలో దాక్కోగలనని భావించాడు. కానీ మా గూఢచార వర్గాలు అక్కడా ఉన్నాయనే విషయం మినూకి తెలుసుకోలేకపోయాడు. ఇకపై అతడు ఆఫ్రికా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయలేడు. అమెరికన్లు లక్ష్యంగా ఆపరేషన్లకు ప్లాన్ చేయడంలో సహకరించలేడు. అమెరికాతో కలిసి పనిచేసిన నైజీరియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
నైజీరియాలో జన్మించిన మినూకి ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ (ISWAP) సీనియర్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. ఇస్లామిక్ స్టేట్ తరఫున టెర్రర్ సెల్స్‌కు సూచనలు ఇవ్వడం, అంతర్జాతీయ నిధులను దారి మళ్లించడం వంటి కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. ఆ ఆరోపణలతో 2023లో అమెరికా అతడిని ఉగ్రవాదిగా గుర్తించింది.