న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్), ఒపెక్+ నుంచి వైదొలుగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మంగళవారం ప్రకటించింది. ఇరాన్ యుద్ధం ప్రపంచ చమురు సరఫరాలో తీవ్రమైన, దీర్ఘకాలిక అంతరాయాన్ని కలిగించిన తరుణంలో యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఇంధన రాజకీయాల్లో ఒక ప్రధాన మార్పున కు నాంది పలికింది. మే 1 నుంచి కూటమి నుండి వైదొలుగుతున్నట్లు యూఏఈ ప్రకటించింది. యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం చమురు ఉత్పత్తి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. దీర్ఘకాలంగా ఒక ప్రధాన విశ్వసనీయ సభ్యదేశంగా ఉన్న యూఏఈ మార్కెట్లు అస్థిరంగా ఉండి సరఫరా మార్గాలు ఒత్తిడికి గురవుతున్న తరుణంలో కూటమి నుంచి వైదొలగడం, కూటమిలోని సమన్వయాన్ని బలహీనపరిచే ప్రమా దం ఉంది. యూఏఈ ఇంధన శాఖ మంత్రి సుహైల్ అల్ మజ్రూయీ ఒపెక్ నుంచి వైదొలగాలన్న యూఏఈ నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు.
దీర్ఘకాలిక మార్కెట్ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఈ నిర్ణయం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా నిర్మాణాత్మక సహకారాన్ని అందచేసిన ఒపెక్, దాని సభ్య దేశాలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు ఆయన చెప్పారు. విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన, తక్కువ ఉద్గారాలు వెలువరించే సరఫరాలను అందించడం ద్వారా ప్రపంచ మార్కెట్ స్థిరత్వానికి మద్దతునిస్తూ ఇంధన భద్రత పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చర్య వల్ల తమ దేశానికి మరింత వెసులుబాటు లభిస్తుందని, ఇకపై ఆ గ్రూపు విధివిధానాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. సౌదీ అరేబియాతో ప్రత్యక్ష సంప్రదింపులు జరుపకుండా ఈ నిర్ణయాన్ని స్వతంత్రంగా తీసుకున్నట్లు కూడా ఆయన చెప్పారు.
ట్రంప్ విజయం?
చమురు ధరలను ప్రభావితం చేయడంలో ఒపెక్ పాత్రను తరచూ విమర్శిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు యూఏఈ తాజా నిర్ణయం రాజకీయ విజయంగా పరిణమించనున్నది. చమురు ధరలను అధికంగా ఉంచడం ద్వారా ఆ కూటమి ప్రపంచంలోని మిగతా దేశాలను దోచుకుంటున్నదని ట్రంప్ గతంలో పలుసార్లు ఆరోపించారు. గల్ఫ్‌లో అమెరికా బాధ్యతలను ఆయన చమురు ధరలతో ముడిపెట్టారు. సభ్య దేశాలకు అమెరికా సైనిక రక్షణ కల్పిస్తున్నప్పటికీ ఆ దేశాలు మాత్రం అధిక చమురు ధరలను విధించడం ద్వారా దోపిడీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
మిత్రులపై అసంతృప్తి
ప్రధాన ప్రాంతీయ కేంద్రం, అమెరికాకు సన్నిహిత మిత్రదేశమైన యూఏఈలో తాజా పరిణామాలు తీవ్ర అసంతృప్తికి దారితీయడమే ప్రస్తుత నిర్ణయానికి కారణంగా తెలుస్తున్నది. యుద్ధ సమయంలో ఇరాన్ పదేపదే జరిపిన దాడుల నుంచి తమను రక్షించడానికి కానీ తమకు అండగా నిలబడేందుకు కానీ తోటి అరబ్ దేశాలు తగినంతగా కృషి చేయలేదని యూఏఈ భావిస్తున్నది. గల్ఫ్ ఇన్‌ఫ్లూయన్సర్స్ ఫోరమ్‌లో యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గర్గాష్ మాట్లాడుతూ బలమైన రాజకీయ సైనిక మద్దతు లేకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు. గల్ఫ్ సహకార మండలి దేశాలు లాజిస్టికల్‌గా ఒకదానికొకటి మద్దతు ఇచ్చుకున్నాయి కానీ రాజకీయంగా, సైనికంగా, చారిత్రాత్మకంగా వాటి స్థానమే అత్యంత బలహీనంగా ఉందని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఒపెక్ అంటే?
ప్రపంచ మార్కెట్‌కు ఎంత చమురు సరఫరా అవుతుందో దాన్ని నిర్వహించడానికి కలిసి పనిచేసే ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల సమూహమే ఒపెక్. 1960లో ఏర్పడిన ఈ సంస్థ చమురు ధరలు, విధానాలపై ఉత్పత్తి దేశాలకు మరింత నియంత్రణ కల్పించడానికి ఏర్పడింది. మే 1 నుంచి వైదొలుగుతున్నట్లు యూఏఈ ప్రకటించిన తర్వాత ఒపెక్‌లో ఇక అల్జీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్విటోరియల్ గినియా, గాబన్, లిబియా, నైజీరియా, ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనెజువెలా వంటి 11 దేశాలు మిగిలి ఉన్నాయి. ఇక ఒపెక్+ 22-23 దేశాల ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల కూటమి. 2016లో ఇది ఏర్పడింది. ప్రపంచ చమురు సరఫరా, ధరల స్థిరీకరణ నిర్వహణ కోసం ఇది ఏర్పాటైంది. వీటిలో ఒపెక్ దేశాలతోపాటు 10 ఒపెక్ యేతర దేశాలైన రష్యా, మెక్సికో తదితర దేశాలు కూడా ఉన్నాయి.