న్యూయార్క్, జూలై 31: ఒకప్పుడు సంప్రదాయాలకు చిహ్నంగా నిలిచిన టాటూ (పచ్చబొట్టు) ప్రస్తుతం ఫ్యాషన్‌కు చిరునామాగా మారింది. సాధారణ యువత నుంచి పెద్దపెద్ద సెలబ్రెటీల వరకు టాటూలు వేసుకొని మురిసిపోతున్నారు. ఈ తరంలో ఫ్యాషన్‌కు నెలవైన టాటూ.. భవిష్యత్తులో మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషించనున్నది. టాటూతో వైద్య రంగంలో పెను మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రానున్న కాలంలో స్మార్ట్ టాటూలు మన ఫ్యామిలీ డాక్డర్‌గా మారనున్నాయి. ఇవి మన ఆరోగ్యంపై ఓ కన్నేసి మనల్ని కంటికి రెప్పలా కాపాడతాయి. స్మార్ట్ టాటూలపై అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు.
అనారోగ్యాన్ని ముందే పసిగట్టి…
అక్షరం లేదా చిత్రాల రూపంలో స్మార్ట్ టాటూలను పరిశోధకులు రూపొందిస్తున్నారు. ఈ స్మార్ట్ టాటూలను ఇంజెక్షన్ సాయంతో మన శరీరంలోకి పంపిస్తారు. చర్మం లోపలి పొరల్లో వీటిని జొప్పిస్తారు. శరీరం లోపల ఉండి ఈ స్మార్ట్ టాటూలు మన ఆరోగ్యంపై దృష్టి సారిస్తాయి. వీటి సాయంతో గుండె వేగం, మూత్రపిండాల పనితీరు, చక్కెర స్థాయులను తెలుసుకోవచ్చు. మన శరీరంలో అనుకొని మార్పులు జరిగి ఏదైనా అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంటే ఇవి ముందుగానే హెచ్చరిస్తాయి.