Shahbaz Sharif : పాకిస్థాన్ ప్రధాని (Pakistan PM) షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif) పై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు కీలక మిత్రపక్షమైన ‘పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)’ తో విభేదాలు ముదురుతుండగా.. మరోవైపు ప్రతిపక్షాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇంకోవైపు మాజీ ప్రధాని (Ex Prime Minister) ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) వైద్య చికిత్స వ్యవహారం కూడా షహబాజ్ ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెడుతోంది.
ఆగస్టు 18న ఇమ్రాన్ ఖాన్‌ను అడియాలా జైలు నుంచి రెండు రోజుల్లో ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఈ ఉత్తర్వులపై పునర్విచారణ కోరింది. భద్రతా కారణాలతో షిఫాకు బదులుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని పిమ్స్ ఆసుపత్రికి తరలించింది. వైద్య పరీక్షల తర్వాత కొన్ని గంటల్లోనే మళ్లీ జైలుకు పంపింది. దాంతో సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించలేదంటూ ఇమ్రాన్ కుటుంబం, పీటీఐ ఆరోపించాయి.
అయితే ఈ వ్యవహారం కోర్టు ధిక్కార కేసుకు దారితీసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో పీపీపీ అధినేత బిలావల్ భుట్టో.. జర్దారీ ప్రభుత్వం తీరుపై కఠిన వైఖరి తీసుకున్నారు. తమ అభ్యంతరాలు పరిష్కరించే వరకు సెనేట్, జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వ బిల్లులకు మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన పీపీపీ.. ఫలితాలను న్యాయస్థానంలో సవాల్ చేయాలని నిర్ణయించింది.
కొత్త రాష్ట్రాల ఏర్పాటుపైనా విభేదాలు తలెత్తాయి. విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం లేకుండా ప్రభుత్వం ముందుకు సాగవద్దని బిలావల్ స్పష్టంచేశారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఐక్యంగా కదులుతున్నాయి. జేయూఐ-ఎఫ్ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ నేతృత్వంలో ఉమ్మడి పార్లమెంటరీ వ్యూహంపై చర్చలు సాగుతున్నాయి. సోమవారం కీలక ప్రతిపక్ష సమావేశం జరగనుంది. పీపీపీ మద్దతు దొరికితే షెహబాజ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం దిశగా పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉన్నది.