ఒకే ఒక్క పాస్‌పోర్ట్. 16 ఏళ్ల బాలుడి ప్రాణాలను కాపాడింది.రష్యా సైనికులు జరుపుతున్న కాల్పుల నుంచి కాపాడుకోవడానికి ఓ బాలుడు తన పాస్‌పోర్టును అడ్డుగా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రష్యా సైనికుల బుల్లెట్ ఆ పాస్ పోర్టుకు తగిలింది. ఈ బుల్లెట్ ఆనవాళ్లు ఆ పాస్‌పోర్టుపై స్పష్టంగా కనిపిస్తూనే వున్నాయి. ఈ పాస్‌పోర్టును ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో కూడా షేర్ చేసింది. ఉక్రెయిన్ పాస్‌పోర్టులో బుల్లెట్ ముక్క ఇరుక్కుపోయింది. ఇదే ఈ బాలుడి ప్రాణాలను కాపాడింది. ప్రస్తుతం ఆ బాలుడికి ఆపరేషన్ జరుగుతోంది అంటూ ఉక్రెయిన్ విదేశాంగ శాఖ పేర్కొంది.
ఉక్రెయిన్‌లోని మరియూపోల్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాస్ పోర్టు 16 సంవత్సరాల బాలుడిది. ఈ పాస్‌పోర్టుకు సంబంధించిన ఇమేజ్ను కూడా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తన ట్విట్టర్లో షేర్ చేసింది. బుల్లెట్ వల్ల ఏర్పడిన రంధ్రం ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తూనే వుంటుంది. కేవలం సైన్యం, ప్రభుత్వ బిల్డింగ్‌లపైనే దాడులు చేస్తున్నామన్న రష్యా దీనికి ఏం సమాధానం చెబుతుందని ఉక్రెయిన్ సూటిగా ప్రశ్నించింది.