బెంగళూరు: సూర్యుడి బాహ్య ఉపరితలంలో విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉండటానికి గల కచ్చితమైన కారణాలను కనుగొనే దిశగా అడుగులు పడ్డట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్‌లోని సాఫ్ట్ ఎక్స్-రేస్ విత్ సోలార్ ఎక్స్-రే మానిటర్ (ఎక్స్ఎస్ఎం) ఈ వివరాలను సేకరించినట్టు పేర్కొన్నారు. సూర్యుడి కరోనా వేడిగా ఉండేందుకు మెగ్నీషియం, అల్యూమీనియం, సిలికాన్ వంటి మూలకాలు కూడా ఒక కారణమని పేర్కొన్నారు. వాటి మోతాదుల్లో తేడా కూడా కరోనా ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతున్నట్టు వెల్లడించారు. సౌర కుటుంబం, సూర్యుడి గురించి మరింత పరిశోధనలు చేయడానికి ఈ సమాచారం ఎంతో కీలకమన్నారు.