హైదరాబాద్: వ్లాదిమిర్ పుతిన్ ఆస్తులు ఎంత ? ఆయన సంపాదన ఎంత ? బిలియనీరా.. మిలియనీరా.. ఎక్కడ ఉన్నాయి ఆయన ఆస్తులు? ఎవరి పేరు మీద ఆ సంపాద దాచిపెట్టారు ? ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆస్తులపై ఇప్పుడు ప్రపంచ దేశాలు నజర్ పెట్టాయి. ఆయన ఆస్తుల్ని స్తంభింపచేయాలని డిసైడ్ అయ్యాయి. ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. పుతిన్ ఆస్తుల్ని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ డర్టీ మనీని మేం కూడా సీజ్ చేస్తున్నామని బ్రిటన్ కూడా వెల్లడించింది. ఇంతకీ పుతిన్‌కు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయా ? ప్రపంచదేశాలుకు వార్ టెన్షన్ పుట్టించిన పుతిన్ ఆస్తులపై ఆసక్తికర కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారికరంగా పుతిన్ ఆస్తులు తక్కువే. కానీ వంద బిలియన్ల డాలర్లకుపైగా ఆయన ఆస్తులు ఉంటాయని కొందరు అంచనా వేస్తున్నారు.
ఉక్రెయిన్‌పై ఆక్రమణకు వెళ్లిన పుతిన్ ఆస్తుల్ని సీజ్ చేస్తున్నట్లు కొన్ని పశ్చమ దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఆస్తుల గురించి మాత్రం చాలా తక్కువే తెలుసు. పుతిన్ మిత్రుల అకౌంట్లలో మాత్రం బిలియన్ల డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారి పేరు మీద లగ్జరీ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. మిత్రుల ఫ్యామిలీ మెంబర్స్పైనా కనకవర్షం కురుస్తోందని నిపుణులు చెబుతున్నారు. అధికారికరంగా పుతిన్ ప్రతి ఏడాది 1,40,000 డాలర్లు ఆర్జిస్తున్నారు. పబ్లిక్ పేపర్స్ ప్రకారం ఆయనకు ఓ చిన్న అపార్ట్మెంట్ కూడా ఉంది. కానీ లెక్కలోలేని ఆస్తులు చెప్పలేనన్ని ఉన్నాయట.
బ్లాక్ సీ తీరం వద్ద ఉన్న పుతిన్ ప్యాలెస్ ఓ అద్భుతం. ఆ ఒక్క బిల్డింగ్ సుమారు బిలియన్ డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు. ఓనర్షిప్లో ఆయన పేరు లేకున్నా.. పుతిన్ ప్రభుత్వ పనులన్నీ అక్కడ సాగుతాయట. ఇంకా రష్యా అధ్యక్షుడికి వంద మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే ఓ నౌక ఉన్నట్లు తెలుస్తోంది. మోనాకోలో ఆయనకు సుమారు 4 మిలియన్ల డాలర్ల ఖరీదైన అపార్ట్మెంట్ ఉంది. పుతిన్ ప్రేమికురాలి పేరిట ఆ బిల్డింగ్‌ను ఖరీదు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మాజీ భార్య పేరిట ఫ్రాన్స్‌లోనూ అత్యంత విలాసవంతమైన భవనం ఉందట. పుతిన్ ఆస్తుల్ని సీజ్ చేయాలనుకున్న పశ్చిమ దేశాలకు ఇప్పుడో పెద్ద చిక్కు వచ్చింది. ఎందుకంటే ఏ ఒక్క ప్రాపర్టీ కూడా నేరుగా పుతిన్ పేరుమీద లేవట. ఆంక్షలతో పుతిన్‌పై వత్తిడి తేవాలనుకుంటున్న పశ్చిమ దేశాలు.. ఆయన ఆస్తుల్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నాయి. పుతిన్ అనుచరులు కూడా ఆయన సంపదను దాచిపెట్టిన తీరు కూడా పశ్చిమ దేశాలను అయోమయానికి లోనుచేస్తోంది.
అమెరికా ట్రెజరీ శాఖ తయారు చేసిన ఓ జాబితాలో పుతిన్ ఉన్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడురో, ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్, సిరియా అధ్యక్షుడు బాషర్ అల్ అసద్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్లు యూఎస్ ట్రెజరీ శాఖ నిషేధిత జాబితాలో ఉన్నారు. అయితే పుతిన్ ఆస్తులు సుమారు 200 బిలియన్ల డాలర్లకు పైగా ఉంటుందని అమెరికా ఫైనాన్షియర్ బ్రిల్ బ్రౌడర్ తెలిపారు. పుతిన్ ఆస్తులు సుమారు 125 బిలియన్ల డాలర్లు ఉంటుందని జార్జిటౌన్ వర్సిటీ ప్రొఫెసర్ ఆండర్స్ అస్లాండ్ ఓ పుస్తకంలో తెలిపారు. అయితే మిత్రులు, బంధువుల పేరిట విదేశాల్లో ఆ ఆస్తులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
నల్ల సముద్రం వద్ద ఉన్న పుతిన్ ప్యాలెస్‌లో మూవీ థియేటర్, హుక్కా లాంజ్, పోల్ డ్యాన్సింగ్ స్టేజ్ ఉన్నట్లు కొందరు తెలిపారు. రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవాల్ని చేసిన ఆరోపణలను కొట్టిపారేస్తూ.. పుతిన్ చాలా సాధారణ జీవితం సాగిస్తారని, ఆయనకు లగ్జరీ అవసరం లేదని ఇటీవల రష్యా టీవీ ఛానల్ పేర్కొన్నది.